ఆధ్యాత్మికం : నమస్కారం.. ఎంతో సంస్కారం.. ఎన్ని రకాలు.. ఎంత మేలు చేస్తాయో తెలుసా..!

తెలిసినవాళ్లు ఎదురుపడితే హలో.. హాయ్ అని పలకరిస్తారు. ఉదయం అయితే గుడ్ మార్నింగ్.. చెప్తారు. అదే సాయంత్రం అయితే గుడ్ ఈవినింగ్ అంటారు. కానీ దేవుడికి, గురువులకు, పెద్దవాళ్లకు నమస్కారం చేస్తారు. నమస్కారం అంటే కేవలం పలకరింపు మాత్రమే కాదు. ఎదుటి వ్యక్తి మీదున్న అభిమానాన్ని, గౌరవాన్ని, కృతజ్ఞతను తెలియజేయడం. 

నమస్కారం చేసేటప్పుడు నమస్తే అని చెప్పడంతోపాటు చేతులు జోడిస్తారు. అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నమస్కారం చేయడం ఎదుటివాళ్లలోని మంచి తనాన్ని గుర్తించి, వాళ్ల స్వభావానికి విధేయత ప్ర కటించడమే అని మన పురాణాలు చెప్తున్నాయి.

ఎందుకు

నమస్కారం- ......నమస్తే....  అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. 'నమస్' అంటే వందనం, ఆరాధించడం, మర్యాద ఇవ్వడం, గౌరవాన్ని వ్యక్తీకరించడం, ప్రణామం వంటి అర్ధాలున్నా యి. కానీ ఈ రోజుల్లో ఒక చెయ్యి పైకెత్తి, గాల్లోకి విసురుతూ, కేవలం నోటితో.... షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ చెప్పడం మామూలై పోయింది. 

కొందరు సెల్యూట్ ను  కూడా నమస్కారం అనుకుంటున్నారు. కానీ రెండు చేతుల్ని జోడించి, హృదయానికి హత్తుకునేలా చెప్పడమే నమస్కారం.  మనిషిలో ఉన్న అహాన్ని పోగొట్టుకుని, ప్రేమ, ఆప్యాయత, మానవత్వం, స్నేహం కలిగి ఉంటామని తెలియజేయడమే నమస్కారం ప్రధాన ఉద్దేశం. అలాగే నమస్కారంలో 'నమ' అంటే వంగి ఉండటం అనే అర్ధం కూడా ఉంది. దేవుడు, తల్లిదండ్రులు, గురువులు. పెద్దల దగ్గర అణకువగా ఉండాలని కూడా నమస్కారం సూచిస్తుంది.

మేలు

మనిషి శరీరం కూడా ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రం లాంటిదే. నమస్కారం చేసేటప్పుడు రెండు వేళ్ల కొసలు ఒకదానితో ఒకటి తాకుతాయి. వాటికి, కళ్లు, చెవులు, మెదడుకు సంబంధం ఉంటుంది. అందువల్ల అవి చైతన్యం పొందుతాయి. దాంతో నమస్కారం పెట్టిన వ్యక్తిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవచ్చు. నమస్కారం అనేది కేవలం శరీర భాషే కాదు. మనసు భాష కూడా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలకు నమస్కారం చేస్తే... వారి పట్ల గౌరవం, వినయ విధేయతలు, ఆత్మీయతను కలిగి ఉంటానని చెప్పడమే. 

Also Read : సోమావతి అమావాస్య రోజున ..ఇలా చేయండి... పాపాలు పోతాయి

అందుకే రెండు చేతులు హృదయం దగ్గరకు తెచ్చి నమస్కారం చెప్పాలంటారు పెద్దలు. వయసులో పెద్దవాళ్లకు నమస్కారం పెడితే, వాళ్ల దీవెనలు పిల్లలకు మేలు చేస్తాయని నమ్ముతారు. అలాగే నమస్కా రం పెట్టిన వ్యక్తి నుంచి ప్రేరణ పొందుతారు. మనసులో ఉన్న అహాన్ని తొలిగించుకుంటారు.. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవోభవ అన్న మాటలు ఈ సంస్కా రాన్ని తెలిపేవే.

రకాలు

నమస్కారం అంటే ఏదో హాయ్ చెప్పినంత సులభం కాదు. దానికో పద్ధతి ఉంది. ఎలా చెప్పాలి?. ఎన్ని రకాలుగా చెప్పాలి? అని పూర్వీకులు వివరించారు. అసలు శరీరంలోని ఎనిమిది అవయవాలతో చేసేదే ఉత్తమమైన నమస్కారం. దాన్నే సాష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. చేతులు, పాదాలు, మోకాళ్లు, వక్షస్థలం, తల, కళ్లు, మనస్సు, మాట... వీటన్నింటితో చెయ్యాలి. 

అయితే స్త్రీలకు మరో రకమైన నమస్కారం ఉంది. ఎందుకంటే స్త్రీ మాతృస్వరూపిణి. పరాశక్తిగా కూడా పూజిస్తారు. మహిళల వక్షస్థలం, నడుము భూమికి తగలడం మంచిది కాదని అంటారు. అందుకే, ఆమె పంచాంగ నమస్కారం చేస్తే సరిపోతుంది. అంటే తల, చేతులు, భుజాలతో మాత్రమే చేయాలి. 

అయితే వీటితో పాటు ఇంకొన్ని రకాల నమస్కారాలూ ఉన్నాయి. తలను మాత్రమే వంచి చేసేది ఏకాంగ నమస్కారం. నోటితో నమస్తే చెప్తూ చేసేది వాచిక నమస్కారం. ఏది ఏమైనా దేవుడికి భక్తిశ్రద్ధలతో, మనఃపూర్వకంగా నమస్కారం చేస్తే మంచి ఫలితం ఇస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతున్నారు.

-వెలుగు, లైఫ్-