గుడ్డు ఎన్ని రోజులు తాజాగా ఉంటుంది? అసలు గుడ్డును ఎలా నిల్వ చేయాలి? గుడ్డు పాతది, పాడైపోయిందనేది ఎలా తెలుసుకోవచ్చు? ఏముంది సింపుల్ గుడ్డు పగలగొట్టి వాసన చూస్తే సరి. గుడ్డు పాడైపోతే సల్ఫర్ వాసన వస్తుంది. లేదంటే మామూలు వాసనే ఉంటుంది. నిజమే మార్కెట్ నుంచి మీ వంటగదికి చేరిన గుడ్డు చాలా రోజుల నాటిదా? పాడై పోయిందా? లేదా సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిందా అనే విషయం తెలుసుకునేందుకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి.
గుడ్డు చాలా రోజుల క్రితానిది అయితే దాన్ని తినడం అంత మంచిది కాదు. అంతెందుకు టేస్ట్ కూడా మంచిగా ఉండదు. అదే గుడ్డు పాడైపోతే అందులో కచ్చితంగా బ్యాక్టీరియా చేరినట్టే. కుళ్లిపోయి, వాసన వస్తుంది. పాడైన గుడ్డు తింటే ఏమవుతుందంటే... జీర్ణానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కొన్ని రోజులపాటు కడుపు నొప్పి ఉంటుంది. అదే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా సోకిన పచ్చి గుడ్డు తింటే అనారోగ్యం బారిన పడతారు. ఈ బ్యాక్టీరియా గుడ్డులో ఉన్న విషయాన్ని గుర్తించడం కూడా కష్టమే.
ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ గుడ్డు వాసన రాదు, రుచి మారదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ బ్యాక్టీరియా ఉన్నట్టు కంటికి కనిపించదు. అయితే పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా ఉండడం అనేది చాలా అరుదు. ఒకవేళ ఉన్నా గుడ్డును వండినప్పుడు అది చచ్చిపోతుంది. అందుకని గుడ్డు వాసన రాకపోతే ఉడికించి లేదా వండుకుని తినొచ్చు. దానివల్ల ఆరోగ్యానికి కలిగే ఇబ్బంది ఏమీలేదు.
ఇలా తెలుసుకోవచ్చు
గుడ్డు పాడైందనే విషయం తెలియాలంటే వాసన చూడటం మొదటి పారామీటర్. వాసన చూసి గుడ్డు మంచిదా? కాదా? తెలుసుకోవచ్చు. గుడ్డు ఫ్రెష్‌గా ఉంటే ఎటువంటి వాసన రాదు. సల్ఫ్యూరిక్ వాసన వచ్చిందంటే అది పాడైపోయిందని అర్థం. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే... గుడ్డు పెంకు మీద రంధ్రాలు ఉంటాయి. గుడ్డును ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు అందులో ఉన్న పదార్థాల వాసన గుడ్డుకు పడుతుంది. దానివల్ల కొన్నిసార్లు గుడ్డు సొన వాసన రావచ్చు. ఇలాంటప్పుడు గుడ్డు పాడైంది అనుకోవాల్సిన అవసరం లేదు.
సొన నీళ్లలా ఉన్నా లేదా రంగు మారినా
గుడ్డు వాసన రావట్లేదు. అయినా కూడా పాడైందేమో అనే అనుమానం ఉందా! అయితే ఇలా టెస్ట్ చేయండి. గుడ్డులోని పచ్చ లేదా తెల్ల సొన నీళ్లలా ఉంటే ఆ గుడ్డును పారేయాల్సిందే. గుడ్డులో యోక్ అంటే పచ్చ సొన ఆరెంజ్ రంగులో ఉన్నా మంచిదే. అలాగే తెల్లసొన (ఆల్బుమిన్) క్లియర్‌గా ఉండాలి. అది కొంచెం చిక్కటి తెలుపు రంగులో ఉన్నా తాజా గుడ్డు అన్నట్టే. అలాకాకుండా ఈ సొన గులాబీ, ఆకుపచ్చ లేదా రెండుమూడు రంగులు కలిపి ఉంటే దానికి బ్యాక్టీరియా సోకినట్టు.
పగలకొట్టకుండానే...
గుడ్డును పగలగొట్టకుండానే అది మంచిదా? పాడైందా? తెలుసుకోవచ్చు. ఇది చాలా పాత పద్ధతి. చాలామందికి తెలిసిన పద్ధతి. అదే చల్లటి నీళ్లలో వేయడం. గుడ్డును చల్లటి నీళ్లలో వేసినప్పుడు అది తేలితే మంచి గుడ్డు కాదు. మునిగిపోతే ఆ గుడ్డు వాడొచ్చు. గుడ్డు తాజాగా ఉందో? లేదో? తెలుసుకునేందుకు ఇలా టెస్ట్ చేయడం ఓకే. కానీ గుడ్డు మంచిగా ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు మాత్రం ఈ టెస్ట్ కరెక్ట్ అని చెప్పలేం. అయితే నీళ్లలో గుడ్డు తేలే టెస్ట్‌లో అయితే మంచిదా? కాదా? వెంటనే తెలిసిపోతుంది. గుడ్డు పెంకు నీళ్లని పీల్చుకుని మునిగిపోయిందంటే అందులో బ్యాక్టీరియా చేరినట్టే. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు అన్నీ చెడిపోవు. వాటిని హార్డ్ బాయిల్ చేసుకోవచ్చు. వాటికయితే గుడ్డు చెదిరిపోకుండా పొట్టు వలిచేయొచ్చు.
అలాగే గుడ్డు పెంకు జిడ్డుగా ఉంటే బ్యాక్టీరియా సోకినట్టే. అలాకాకుండా పెంకుపైన పొడిపొడిగా ఉంటే ఆ గుడ్డును వాడేటప్పుడు కడిగి వాడాలి. గుడ్డు కొనేటప్పుడు పగుళ్లు ఉంటే అందులో రోగకారకాలు చేరినట్టే. దాన్ని వాడొద్దు. సరిగా నిల్వ చేస్తే గుడ్డు ప్యాక్ మీద ఇచ్చిన డేట్ నుంచి నాలుగైదు వారాల వరకు గుడ్లు తినొచ్చు. లేదంటే గుడ్డును ప్యాక్ చేసిన డేట్ నుంచి నెల రోజుల్లోపు తినేయొచ్చు అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
షేక్ చేస్తే కూడా..
గుడ్డును చెవి దగ్గర పెట్టుకుని షేక్ చేయాలి. అప్పుడు ఏ సౌండ్ వినపడలేదంటే అది మంచి గుడ్డు. సౌండ్ వస్తే అది చాలా పాత గుడ్డు అని. ఇలాంటి గుడ్డును బేకింగ్ లేదా స్క్రాంబ్లింగ్కి వాడొచ్చు. గుడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అందులోని సొన పెంకు మీద నుంచి తేమను పీల్చుకుంటుంది. దాంతో సొన ఆకారం మారిపోతుంది.
ఇలా నిల్వ చేయాలి
కొందరు గుడ్లను కడిగి నిల్వ చేస్తుంటారు. గుడ్డు పెంకుమీద రంధ్రాలు ఉంటాయి. కడిగినప్పుడు నీళ్లు లోపలికి పోతాయి. దాంతో బ్యాక్టీరియా పెరిగే ఆస్కారం ఉంది. ఒకవేళ ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే అందులో టెంపరేచర్ 40డిగ్రీల ఫారెన్ హీట్‌కి సెట్ చేసుకోవాలి. గుడ్లు ఏ ప్యాక్‌లో అయితే తెస్తారో వాటిని అలానే నిల్వ చేయాలి. అంతేకానీ వాటిని బయటకు తీసి ఫ్రిజ్ డోర్లో పెట్టొద్దు. ఫ్రిజ్ డోర్ టెంపరేచర్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. దానివల్ల గుడ్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్లను వెంటనే వాడొద్దు. రూమ్ టెంపరేచర్‌కి వచ్చేవరకు బయట పెట్టి వాడాలి. తాజా గుడ్లను గది ఉష్ణోగ్రతలో రెండు వారాల పాటు ఉంచొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... వాటిని కడిగి నిల్వ చేయొద్దు.