పళ్లు, నోరు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి అంటారు డెంటిస్టులు. అయితే, ఎంత సేపు బ్రష్ చేయాలి? అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. ఒక నిమిషం బ్రష్ చేస్తే చాలని కొందరు, రెండు నిమిషాలు బ్రష్ చేసుకుంటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయని మరికొందరు అనుకుంటారు. పళ్లు, చిగుళ్లు హెల్దీగా ఉండాలంటే మూడు నాలుగు నిమిషాలు బ్రష్ చేయాలని ఈ మధ్య వచ్చిన రీసెర్చ్ రిపోర్టులు కొన్ని చెబుతున్నాయి.
రెండు సార్లు ఎందుకంటే..
పళ్లు తోముకున్న కొన్ని గంటల్లోనే నోట్లో బ్యాక్టీరియా పెరగడం మొదలౌతుంది. అందుకే రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. పంటి ఆరోగ్యానికి వస్తే.... రోజుకి ఎన్నిసార్లు పళ్లు తోముతున్నారు? బ్రష్ చేసే తీరు? ఎలాంటి బ్రష్ వాడుతున్నారు? అనేవి చాలా ఇంపార్టెంట్. పళ్ల చుట్టూ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లతో కూడిన పాచి ఉంటుంది.
రెండు నిమిషాలు బ్రష్ చేసినా పళ్ల మీద పాచి పోతుంది. అయితే మూడు నాలుగు నిమిషాలు పళ్లు తోమితే పళ్ల సందుల్లో ఉన్న పాచి కూడా పోతుందని, నోరు శుభ్రమవుతుందని రీసెర్చర్లు అంటున్నారు.