కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి

పొట్టలో నులిపురుగుల సమస్య అనేది చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇది చిన్న పిల్లలే కాదు పెద్దల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. కడుపులో నులిపురుగులు చేరడం వల్ల  కడుపు నొప్పి, మలద్వారం వద్ద దురద వంటివి వీటి లక్షణాలతో బాధపడుతుంటారు. అయితే పొట్టలోకి నులి పురుగులు లేదా నట్టలు లేదా ఏలికపాములు ఏలా చేరతాయి..అవి ఎన్నిరకాలు..వాటిని ఏవిధంగా తొలగించాలి అనే విషయాలను తెలుసుకుందాం.. 

ఏలిక పాములు.. కడుపులోకి కనిపించే ఈ పురుగులను గ్యాస్ట్రిక్ వార్మ్స్ అని కూడా అంటారు. ఇవి ఏలికపాములు( రౌండ్ వార్మ్స్), పట్టి పరుగులు(ఫ్లాట్ వార్మ్స్), నారి కురుపు పురుగులు (టేప్ వార్మ్స్)  అని మూడు రకాలు ఉంటాయి. ఈ మూడు రకాల పురుగులు ఒక్కోటి ఒక్కో రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యంపై చూపించే ప్రభావం కూడా వేర్వేరుగా ఉంటుంది. 

ఏలికపాములు కడుపులో ఎలా చేరతాయి?

ఏలిక పాములు మట్టి ద్వారా కడుపులోకి చేరుతాయి. వీటి గుడ్లు ఉన్న ప్రదేశాలను తాకడం, చేతులను శుభ్రంగా కడుక్కోపోవడం వల్ల ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. క్రిముల గుడ్లతో కల్తీ అయిన ఆహారం, పానీయాలను తీసుకోవడం వల్ల పొట్టలోకి పురుగులు చేరుతాయి.


మురుగునీటి ప్రాంతాలు, మరుగుదొడ్ల వల్ల కూడా ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. సరిగ్గా ఉడకని మాంసం, పురుగులు పట్టిన చేపలు తినడం వల్ల, పెంపుడు జంతువులకు కూడా ఈ నులిపురుగుల గుడ్లు కడుపులోకి చేరుతాయి. 

చాలా మంది పిల్లల్లో మనం ఎక్కువగా నులిపురుగులు (థ్రెడ్ వార్మ్స్) ఇన్ ఫెక్షన్ సోకుతుంది.  పొడవైన తాడులా ఉంటే ఈ పురుగుల గుడ్లు పొట్టలోకి చేరి పెరుగుతాయి. తర్వాత ఇవి మలద్వారం వద్ద గుడ్లు పెడతాయి.  అవి చేతులకు అంటుకుంటాయి. దుస్తులు,ఆటబొమ్మలు,టూత్ బ్రష్ లు, వంగగది,బాత్రూం నేల , పడకగది, ఆహారంలోకి ఈ గుడ్లు వ్యాప్తి చెందుతాయి. 

పొట్టలోకి గుడ్లు చేరిన తర్వాత లార్వాగా ఏర్పడతాయి. ఒకటి లేదా రెండు నెలల్లో అవి పొడవైన క్రిములుగా మారుతాయి. వీటికి ఒకసారి చికిత్స తీసుకున్న తర్వాత పిల్లలు మరోసారి అలాంటి ఉపరితలాలను తాకితే మళ్లీ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారు.

కాబట్టి పిల్లలు తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వారికి చేతులు కడుక్కునే అలవాటు చేయాలి.


నులిపురుగుల నిర్మూలనకు ఇలా చేయాలి

  • ప్రతీ ఒక్కరూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి, గోళ్లు కత్తిరించుకోవాలి.
  • తినడానికి ముందు, టాయ్‌లెట్‌కు వెళ్లిన తర్వాత, పిల్లలకు న్యాపీలు మార్చాక చేతుల్ని శుభ్రపరుచుకోవాలి.
  • పిల్లలకు తరచుగా చేతుల్ని కడుక్కునే అలవాటు చేయాలి. ప్రతిరోజూ స్నానం చేయాలి.
  • పళ్లు తోమడానికి ముందు, తర్వాత బ్రష్‌లను శుభ్రంగా కడగాలి.
  • వేడినీళ్లతో టవళ్లు, బెడ్‌షీట్లను ఉతకాలి. ఆటబొమ్మలను శుభ్రంగా ఉంచాలి.
  • వంటగది, బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోవాలి.

క్రిముల్ని ఎలా తొలగించాలి?

క్రిముల కారణంగా పిల్లల్లో, పెద్దల్లో అనేక రకాల వ్యాధుల వస్తాయని డాక్టర్లుచెపుతున్నారు.  కాబట్టి ఏడాదికి రెండుసార్లు వైద్యుల సలహా మేరకు క్రిమి నివారణ మందులను తీసుకోవాలి. చిన్నారు లకు రెండేళ్లు దాటినప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టొచ్చు. ఈ ప్రక్రియలో శరీరంలోని ఈ నులిపురుగులు బయటికి వెళ్లిపోతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.