Agricultural News: బంతి పూలు.. లాభాల పంట..  సాగు పద్దతులు ఇవే..

దేవుడి పూజకైనా.. ఏ శుభకార్యానికైనా పూలు కావాలి.. అందులోనూ మన తెలుగువారు పూలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పూలను పూజిస్తూ దేవుళ్లుగా భావించే తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది బతుకమ్మ పండుగ. పూల పండుగ అంటే ఊరూ వాడ బతుకమ్మ సందడి. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు పూజిస్తారు. అందుకే పూలకు చాలా ప్రాధాన్యత నెలకొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంతి పువ్వుల సాగు సీజన్ ప్రకారం జరుగుతుంది.

బంతిపూల తోట సాగును  వాతావరణ  పరిస్థితులను బట్టి వర్షాకాలం, శీతాకాలం మరియు వేసవికాలాల్లో ప్రపంచమంతటా కూడా సాగుచేయవచ్చు. ఆధిక ఉష్ణోగ్రతలు మొక్క ఎదుగుదలను ప్రభావితం చేయడం వల్ల తక్కువ పరిమాణం కలిగిన పువ్వులు ఉత్పత్తి అవ్వడం కారణంగా దిగుబడులు తగ్గడానికి ఆస్కారం వుంటుంది. నీడ ప్రదేశాలు బంతి సాగుకు అనుకూలం కాదు. దీనివల్ల మొక్కలు శాఖీయదశలోనే ఉండి పూలు సరిగ్గా పూయవు.18 నుంచి 28 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత బంతి సాగుకు అనుకూలం.  అంటే వర్షాకాలం.. శీతాకాలం బంతి సాగుకు అనుకూలమైన సమయం. 

నాటే సమయం : బంతిని అన్ని కాలాల్లో సాగు చేయనప్పటికీ ఒక నెల తేడాలో జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకూ నాటుకున్నట్లైతే బంతి పువ్వులను మార్కెట్‌కు అక్టోబర్‌ నుండి ఏప్రిల్‌ వరకు పూల ఉత్పత్తిని సరఫరా చేయవచ్చు. ప్రధానంగా రైతులు పండుగ సీజన్లలో పూలు వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేసుకొని మొక్కలు నాటుకున్నట్టయితే రైతులు ఎక్కువ లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. సుమారు పండగ రోజుకి రెండు మాసాలు ముందు నాటుకోవాలి. సాధరణంగా సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మాసాలలో నాటుకున్న పంట నుంచి నాణ్యత కలిగిన పువ్వులు మరియు విత్తనాలు పొందవచ్చు.

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం..

తక్కువ సమయంలో పంట చేతికొచ్చి ఆదాయాన్ని సమకూర్చే బంతిపూల సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడితో 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. సీజన్‌కు అనుగుణంగా బంతిసాగు రైతులు కనీసం కేజీ రూ.50 నుంచి రూ.100 వరకు మార్కెట్‌లో బంతిపూలను విక్రయిస్తున్నారు. స్థానికంగా పండుగ సీజన్‌లో పూలను అమ్ముకుంటూ మిగతా రోజుల్లో ఖమ్మం, మధిర, విజయవాడ వంటి ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు.

ఎరువుల వాడకం వివరాలు :  చివరి దుక్కిలో ఒక ఎకరానికి 8 నుంచి 10 టన్నుల  పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. వీటితోపాటు ఎకరాకు 30 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్‌ ఎరువులను అందించాలి.  సిఫార్సు చేసిన మోతాదులో సగం నత్రజని, మొత్తం భాస్వరం మరియు పొటాషియంను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగతా సగం నత్రజనిని నాటిన 30నుంచి -40 రోజులు తరువాత పైపాటుగా అందించాలి. అదే విధంగా 0.20 శాతం యూరియాను 15 రోజుల వ్యవధిలో రెండసార్లు పంటపై పిచికారీ చేసుకున్నట్లైతే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.

నీటి యాజమాన్యం :  మొక్కలకు అన్ని దశల్లోను సరిపడినంత తేమ భూమిలో ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మొక్కలు ఏ దశలోనైన నీటి ఎద్దటికి గురి అయినట్లయితే మొక్క పెరుగుదల మరియు పూత దెబ్బతింటుంది. నేల స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులను ఇచ్చుకోవాలి. శీతాకాలం పంట అయితే వాతావరణ పరిస్థితులను బట్టి 8-నుంచి10 రోజుల వ్యవధిలో తడులను అందించవచ్చు.

కలుపు మొక్కలు బెడద : బంతి సాగులో ముఖ్యంగా వర్షాకాల పంటలో ఈ యొక్క కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. పంట తొలి దశల్లో కలుపు మొక్కలు పంటకు వేసిన ఎరువులు మరియు నీటికోసం పోటీపడుతూ పంట మొక్కలు కన్నా ఏపుగా పెరుగుతాయి. సాధారణంగా పంట వ్యవధిలో 3 నుంచి 4 సార్లు కలుపు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి.

తలలు తుంచుట : ఆఫ్రికన్‌ రకాలలో పెరుగుదల అనేది ఎక్కువుగా ఉండి చివరగా పూ మొగ్గ ఏర్పడుతుంది. ఆ ర్వాతనే ప్రక్క కొమ్మలు అనేవి ఏర్పడుతాయి. అందువల్ల మొక్కలు నాటిన 40 రోజులకు తలలను త్రుంచినట్లైతే అనేక ప్రక్కకొమ్మలు తొందరగా ఏర్పడి మొక్క మంచి ఆకారాన్ని సంతరించుకుని ఎక్కువ సంఖ్యలో ఒకే పరిమాణం కలిగిన పూలు పూస్తాయి. అదే హైబ్రీడ్‌ రకాలలో నాటిన 20 రోజుల్లో తలలను త్రుంచుకున్నట్లైతే ప్రక్క కొమ్మలు సంఖ్య పెరగడంతో పూల దిగుబడి పెరుగుతుంది

పూలకోత :  బాగా విచ్చుకున్న బంతి పూలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయడం మంచిది. పూలు కోయడానికి ముందు రోజు నీటి తడిని అందించినట్లైతే పూలు తాజాగా ఉండి ఎక్కువ నిల్వ సామర్థ్యగుణాన్ని పొందుతాయి. వర్షాకాలం పంట అయితే సెప్టెంబర్‌ మధ్య నుంచి పూత ప్రారంభం అయ్యి డిసెంబర్‌ వరకు పూలను పొందవచ్చు. బంతి పువ్వులను కోసిన తరువాత పూలను తడిపిన గోనె లేదా వెదురు బుట్టలో ఉంచి తడి గుడ్డను కప్పి పూలను మార్కెట్‌కి తరలించాలి. శీతాకాలపు పంట అయితే పూత జనవరి మధ్య నుంచి మొదలై మార్చి వరకు పూస్తాయి. అదేవిధంగా వేసవిలో అయితే పూత ఏర్పడటం అనేది మే నేల మధ్యకాలం నుంచి మొదలుకొని జూన్‌ వరకు విరివిగా పూలు పూస్తాయి. 

నేలలు: బంతిని అన్నిరకాల నేలల్లో సాగుచేయనప్పటికి సారవంతమైన ఎర్ర గరప నేలలు అత్యంత అనుకూలమైనవి. మురుగు నీరు వసతి కలిగిన బరువైన నేలల్లో కూడా బంతిని సాగుచేయవచ్చు. 

రకాలు :సాగు చేసే రకాలలో ఆఫ్రికన్‌ మరియు ఫ్రెంచి రకాలు ముఖ్యమైనవి. వాణిజ్య పరంగా అయితే ఆఫ్రికన్‌ రకాలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది.

ఆఫ్రికన్‌ బంతి : ఇది ఏపుగా 90 నుంచి -120 సె.మీ ఎత్తుపెరిగే దృఢమైన మొక్క.   వీటిలో వివిధ రంగులు కలిగిన పెద్ద పూల రకాలున్నాయి. పూసా నారింగ గైందా, పూసా బసంతి గైందా, అదే విధంగా ఐ.ఐ.హెచ్‌.ఆర్‌ బెంగళూర్‌ విడుదల చేసిన ఆర్కా బంగార (పసుపు), ఆర్కా అగ్ని (నారింజ) మంచి దిగుబడులను ఇస్తున్నాయి. అయితే ఈ రెండు రకాలు కాండం కత్తిరింపులు ద్వారా మాత్రమే వ్యాప్తి చేసుకోవచ్చు. ఈ రకాల్లో విత్తనం ఉండదు. ఇవే కాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు రూపొందించిన హైబ్రీడ్‌ వంగడాలు కూడా ఉన్నాయి.

ఫ్రెంచ్‌ బంతి :  ఈ రకం మొక్కలు పొట్టిగా పెరిగే స్వభావం కలిగి ఉండి దాదాపు 30నుంచి  40 సెం.మీ ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ రకం మొక్కలు దృఢంగా ఉండి సింగిల్‌ లేక డబుల్‌ పువ్వులును కలిగి ఉంటాయి. ఇవి ఆఫ్రికన్‌ రకాలు కంటే ముందుగా కోతకు వస్తాయి.

సింగిల్‌ రకాలు : డైంటి మారిట్ట, సన్నీ, టేట్రారాఫ్లిడ్‌ రెడ్‌, నాటీమారిట్ట మొదలగునవి

డబుల్‌: బొలెరో, బటర్స్కాచ్‌, క్యూపిడ్‌ యెల్లో, మెలోడీ, ఆరంజ్‌ ఫ్లేమ్‌, టైంజరెన్‌ యెల్లో మొదలగునవి.

దిగుబడి : సాధారణంగా ఆఫ్రికన్‌ రకాలు ఎకరానికి 4-5 టన్నుల పూల ఉత్పత్తిని అందిస్తాయి. అదే ఫ్రెంచ్‌ రకాలు అయితే 4.5 టన్నుల నుంచి 6 టన్నుల పూల దిగుబడిని పొందొచ్చు.

పంట తెగుళ్లు: బంతి సాగులో ముఖ్యంగా నారుమడి దశలో నారుకుళ్లు తెగులు అనేది ప్రధాన సమస్య ఈ తెగులు లక్షణాలు ఏమి అనగా వేరు భాగాలు కుళ్ళిపోయి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. ఆధిక తేమ శాతం మరియు వెచ్చని వాతావరణం ఈ యొక్క తెగులు వ్యాప్తికి దారితీస్తుంది. ఈ తెగులు నివారణకు మురుగునీరు సదుపాయం కలిగి ఉండే విధంగా ఎతైన నారు పెడలను తయారు చేసుకోవాలి. నారుమడిని ముందుగా పండించిన పంట వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరియు కెప్టెన్‌ 2 గ్రా. లేదా మాంకోజెబ్‌ 3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి నేలను బాగా తడుపుకోవాలి.

ఆకు మచ్చ  కుళ్ళు తెగులు :  ఆకులపై గోధుమ వర్ణంతో కూడిన మచ్చలు ఏర్పడుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ తెగులు ఉదృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు పువ్వులపై మచ్చలు ఏర్పడి పువ్వులు నల్లగా మారి ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల విత్తనోత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఈ వ్యాధిని నివారించడానికి గాను స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌ వాడకూడదు. బ్లైటాక్స్‌ 0.4 శాతం మరియు బావిస్టిన్‌ 0.1శాతం పిచికారీ చేసుకున్నట్లైతే ఈ తెగులు బారి నుంచి విముక్తి పొందవచ్చు.

చీడ పీడలు .. పేనుబంక:  పిల్ల మరియు పెద్ద పురుగులు ముఖ్యంగా ఎదుగుతున్న పూల మొగ్గలను మరియు ఆకుల రసాన్ని పీల్చుతాయి. వీటివల్ల పూలు నాణ్యత కోల్పోతాయి. నివారణకు డైమిథోయేటే 2 మి.లీ లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మందును మార్చుతూ పిచికారీ చేసుకోవాలి.

తామర పురుగులు : తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు పువ్వుల నుంచి రసాన్ని పీల్చి ఆశించిన మొక్క భాగాల మీద తెల్లని మచ్చలు కనపడతాయి. ఆశించిన పూ మొగ్గలు గోధుమ రంగుకి మారి ఎండిపోతాయి.

మొగ్గ తొలుచు పురుగు :ఈ పురుగు లార్వాతో పూల భాగాన్ని తొలుచుకుంటూ తినడం వల్ల పూ మొగ్గలు సరిగ్గా విచ్చుకోవు. వీటి నివారణకు ప్రోఫెనోఫాస్‌ 2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.