భయాలు పెద్దవాళ్లలో కంటే చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటాయి. అయితే వయసు పెరిగే కొద్ది చాలా భయాలు పోతాయి. కొన్ని వయసుల వాళ్లు పలు విషయాలకు, వస్తువులకు, ప్రదేశాలకు మాటలకు, మనుషులకు భయపడతారు. రెండేళ్లు వచ్చేదాకా చిన్నపిల్లలు పెద్దపెద్ద శబ్దాలు విన్నా, తెలియని వాళ్లు దగ్గరకు వచ్చినా, అమ్మానాన్నలు దూరంగా ఉన్నా, ఏదైనా వస్తువులు చూసినా ఏడుస్తారు.
ఆ ఏడుపుకు కారణం వాళ్లలో కలిగిన భయమే. మూడు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న పిల్లలు కథలంటే చెవి కోసుకుంటారు. కానీ ఆ కథల్లోని కల్పిత పాత్రలను బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఒంటరిగా పడుకోవాలంటే భయపడతారు. ఎవరో ఒకరు తోడు ఉండాలని గొడవ చేస్తారు. దెయ్యాలు, భూతాలు, వింతవింత శబ్దాల గురించి కూడా భయపడుతుంటారు. ఏడు నుంచి పదహారు ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు చిన్న గాయాలైనా ఇంట్లో అమ్మానాన్నలు గొడవపడ్డా. స్కూల్లో తగిన గుర్తింపు లేకపోయినా, ఏవైనా రోగాలు వచ్చినా భయపడతారు.