ఒకప్పుడు చిన్నమిల్లుతో మొదలైన ప్రయాణం ఇప్పుడు దేశ విదేశాలు దాటింది. నాలుగు లిస్టెడ్ కంపెనీలు.. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్.. వేలమంది ఉద్యోగులు. ‘అర్వింద్ మిల్స్’గా మొదలైన కంపెనీ ‘అర్వింద్ ఫ్యాషన్స్’గా మారేవరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మార్కెట్‌ని ఎప్పటికప్పడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుని కంపెనీని ఈ స్థాయిలో నిలబెట్టింది లాల్‌భాయ్ ఫ్యామిలీ. 1931లో కంపెనీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కుటుంబమే కంపెనీని కాపాడుతూ వస్తోంది.
లాల్‌భాయ్ దల్పత్‌భాయ్.. ఆ కుటుంబంలో రెండో తరం ఎంట్రపెనూర్. ఆయనే అర్వింద్ లిమిటెట్ పేరుతో టెక్స్‌టైల్ కంపెనీ పెట్టాడు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. లాల్‌భాయ్‌కి చదువుకోవడం అంటే చిన్నప్పటినుంచీ ఇష్టం. కానీ.. ఆయనకు పదిహేడేండ్లు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. దాంతో చదువు మానేసి బిజినెస్ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ల కుటుంబం ఎప్పటినుంచో వ్యాపారరంగంలోనే ఉంది. మొగల్స్ కాలంలో లాల్‌భాయ్ కుటుంబం బంగారు ఆభరణాల వ్యాపారం చేసేదని చెప్తుంటారు.
లాల్ వ్యాపారంలోకి వచ్చాక1897లో నూలు కోసం సరస్‌పూర్‌లో ఒక మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ని పెట్టాడు. దాన్ని చాలా సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. ఆ తర్వాత స్వాతంత్య్రో ద్యమం ఊపందుకుంది. అందులో భాగంగా.. మహాత్మాగాంధీ ‘స్వదేశీ’ వస్తువులు వాడమని పిలుపునిచ్చారు. దాంతో స్వదేశీ వస్తువులకు డిమాండ్ పెరిగింది. అప్పటికే లాల్‌భాయ్ పెట్టిన కాటన్ బిజినెస్‌లో అనుభవం ఉన్న ఆయన కొడుకులు కస్తూర్, నరోత్తం, చిమన్ కలిసి1931 డిసెంబర్‌లో పూర్తిస్థాయి మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీతో అర్వింద్ మిల్స్‌ని మొదలుపెట్టారు.
ఏడు మిల్లులు
కస్తూర్‌భాయ్ లాల్‌భాయ్ కాలంలోనే కంపెనీ చాలా డెవలప్ అయ్యింది. ఆయన ఏకంగా ఏడు టెక్స్‌టైల్ మిల్లులను స్థాపించాడు. వాటిలో అర్వింద్ మిల్స్ అతిపెద్దది. కస్తూర్‌భాయ్‌కి ఉన్న వ్యాపార జ్ఞానం వల్ల టెక్స్‌టైల్స్ రంగంలో చాలా తక్కువ టైంలో నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆయన పెట్టిన మిగతా మిల్స్‌ని కూడా అర్వింద్ మిల్స్‌లో విలీనం చేశాడు. అలా కంపెనీ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. అంతేకాదు.. అర్వింద్ కంపెనీ తయారుచేసిన బుట్టా వాయిల్స్1935లోనే స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌లకు ఎగుమతి అయ్యాయి.
1952లో అరవింద్ కంపెనీ దిగుమతి చేసుకున్న రంగులపై ఆధారపడటాన్ని తగ్గించాలి అనుకుంది. అందుకు రంగులు, రసాయనాలు తయారుచేసే ప్లాంట్‌ను మొదలుపెట్టారు. ఇది ఇండియాలోనే మొదటి ప్లాంట్. తర్వాత కంపెనీలో ప్రొడక్ట్స్ క్వాలిటీని మరింత పెంచడానికి 1973లో నరోత్తం లాల్‌భాయ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అలా1980ల నాటికి కంపెనీ విలువ వంద కోట్లకు చేరింది.
ఆ తర్వాత రెండు దశాబ్దాల్లోనే 6,600 కోట్లకు చేరింది. 2008లో కంపెనీ పేరుని ‘అర్వింద్ మిల్స్ లిమిటెడ్’ నుంచి ‘అర్వింద్ లిమిటెడ్’గా మార్చారు. ఇప్పుడు ఈ కంపెనీలో కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
మొదటి డెనిమ్
అర్వింద్ కంపెనీ1980లో ఇండియాలోనే మొట్టమొదటి డెనిమ్ బట్టల బ్రాండ్ ‘ఫ్లయింగ్ మెషిన్’ని లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ పేరు మీదే జీన్స్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది.1985 నాటికి డెనిమ్ తయారీలో అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. తర్వాతి ఏడాదిలోనే అర్వింద్ కంపెనీ డెనిమ్ తయారీకోసం ప్రత్యేకంగా అహ్మదాబాద్‌లోని నరోడా రోడ్‌లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత కొన్నేండ్లలోనే డెనిమ్ ప్రొడక్షన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది.1987 చివరి నాటికి హై క్వాలిటీ కాటన్ షర్టింగ్ తయారీ కూడా మొదలుపెట్టింది.
మార్కెటింగ్ కోసం ‘వీఎఫ్ కార్పొరేషన్ (అమెరికా)’ లాంటి కంపెనీలతో టై–అప్ అయ్యి ఇండియన్ మార్కెట్‌లోకి ‘లీ జీన్స్, యారో షర్ట్స్’ లాంటి హై క్వాలిటీ వరల్డ్ బ్రాండ్స్‌ని తెచ్చింది. దాంతో కంపెనీకి లాభాలు విపరీతంగా వచ్చాయి. ఆ సక్సెస్‌తో అహ్మదాబాద్ దగ్గర్లోని సంతేజ్‌లో మోడర్న్ టెక్నాలజీతో బట్టల తయారీ ప్లాంట్ ఏర్పాటుచేసింది. ఇది ఇప్పుడు 450 ఎకరాల్లో విస్తరించింది.
దీనికోసం1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ ప్లాంట్‌లో అంతర్జాతీయ మార్కెట్ల కోసం హై క్వాలిటీ కాటన్ షర్టింగ్, బాటమ్స్‌ని ఉత్పత్తి చేస్తున్నారు.1998లో 34 మిలియన్ మీటర్ల కెపాసిటీతో సంతేజ్ షర్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
అర్వింద్ స్టోర్స్
అరవింద్‌కు చెందిన అన్ని బ్రాండ్స్‌ని ఒకే తాటి మీదకు తెచ్చి అమ్మేందుకు 2010లో అర్వింద్ స్టోర్లను ఏర్పాటు చేశారు. వీటిలో బట్టలు అమ్మడం మాత్రమే కాకుండా ‘బెస్పోక్ టైలరింగ్ యూనిట్’, ‘స్టూడియో అర్వింద్’ సర్వీసులను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో 180కి పైగా అర్వింద్ స్టోర్‌లు ఉన్నాయి. అరవింద్ కంపెనీ సంబంధించిన ప్రొడక్ట్స్‌ని దేశ వ్యాప్తంగా192 సిటీలు
టౌన్లలో మొత్తంగా 5000 డిపార్ట్‌మెంటల్, మల్టీ బ్రాండెడ్ స్టోర్లలో అమ్ముతున్నారు. 2011 తర్వాత అర్వింద్ ఇండియాకు ‘కాల్విన్ క్లైన్, టామీ హిల్‌ఫిగర్, గ్యాప్, ఎడ్ హార్డీ, హేన్స్, నౌటికా అండ్ ఎల్లే’ లాంటి అతిపెద్ద ప్రపంచ ఫ్యాషన్ బ్రాండ్స్లను ఇండియాకు తీసుకొచ్చింది.
సమయానికి తగు...
మార్కెట్‌లోకి సరైన టైంకి రావడం వల్లే అర్వింద్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. పైగా ఎప్పటికప్పుడు మార్కెట్‌ని అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకోగలిగింది. ముఖ్యంగా1931లో టెక్స్‌టైల్స్ కంపెనీ పెట్టడం చాలా తెలివైన పని. ఎందుకంటే..అప్పుడే స్వదేశీ ఉద్యమం మొదలైంది. పైగా 1930 మాంద్యం నుండి ప్రపంచం కోలుకుంది.
దాంతో టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా అరవింద్ యాజమాన్యం మార్కెట్‌లో వచ్చే ట్రెండ్స్‌ని ముందుగానే పసిగట్టి అందుకు తగ్గ మార్పులు చేస్తుండడంతో ఇప్పటికీ మార్కెట్‌లో మంచి పొజిషన్‌లో ఉంది.
ఫామ్ ప్రాజెక్ట్
మహారాష్ట్రలోని అకోలాలో అర్వింద్ కంపెనీ ఒక ఫామ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది. దానికి ‘బెటర్ కాటన్ ఇనిషియేటివ్ (బీసీఐ)’ అని పేరు పెట్టింది. ఇందులో భాగంగా.. తక్కువ నీళ్లు, రసాయనాలతో ఎక్కువ పత్తి దిగుబడి తీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ రైతులు దాదాపు 50,000 హెక్టార్ల భూమిలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పత్తి పండిస్తున్నారు. సాధారణంగా బట్టల పరిశ్రమలో చాలా ఎక్కువ నీళ్లు అవసరం అవుతాయి. కానీ.. తక్కువ నీళ్లతో ఉత్పత్తి చేయడానికి అరవింద్ కంపెనీ ప్రయత్నిస్తోంది.
అంతేకాకుండా వ్యర్థ జలాల శుద్ధి కోసం కొత్త పద్ధతులను వాడేందుకు ప్రత్యేకంగా ‘అర్వింద్ ఎన్విసోల్’ పేరుతో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ‘పాలీమెరిక్ ఫిల్మ్ ఎవాపరేషన్ టెక్నాలజీ (పీఎఫ్‌ఈటీ)’కి వరల్డ్ పేటెంట్ పొందింది. ఈ విప్లవాత్మక టెక్నాలజీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వాటర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్ కోసం అయ్యే పవర్‌లో 80శాతం వరకు ఆదా చేస్తుంది.
నాలుగు కంపెనీలు
ఒక్క కంపెనీతో మొదలైన అర్వింద్ ప్రయాణం ఇప్పుడు నాలుగు కంపెనీలకు చేరింది. అరవింద్‌తోపాటు అనుబంధంగా ఏర్పాటు చేసిన సంస్థలు కూడా ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. బ్రాండ్స్ పోర్ట్‌ఫోలియోతో ఉన్న అర్వింద్ ఫ్యాషన్స్, గ్యాస్, పెట్రోకెమికల్స్, ఫార్మా ఇండస్ట్రీలతో ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు. అలా ఇప్పుడు లాల్‌భాయ్ గ్రూప్‌కు నాలుగు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కుటుంబానికే చెందిన పునీత్ ‘అర్వింద్ లిమిటెడ్’, ‘అనూప్ ఇంజనీరింగ్’ కంపెనీలను చూసుకుంటున్నాడు. కులిన్ ‘అర్వింద్ ఫ్యాషన్స్ కంపెనీ’
‘రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ ఆర్మ్’, ‘రిటైల్’ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. కొన్నేండ్ల నుంచి ఈ–కామర్స్ బిజినెస్ పెరిగింది. కానీ అప్పట్లోనే కులిన్ ప్రత్యేకంగా డిజిటల్ స్టాక్‌ను క్రియేట్ చేయడానికి150 మంది యువకులతో ఒక టీం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అర్వింద్ ఫ్యాషన్ బిజినెస్‌లో దాదాపు 30 శాతం ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది.
మ్యూజియం
అరవింద్ కంపెనీ స్థాపనకు కారుకుడైన లాల్‌భాయ్ దల్పత్‌భాయ్‌కి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ.. చదువు మధ్యలోనే ఆపేయడంతో మంచి పాఠకుడిగా మారాడు. అందుకే ఆయన లైబ్రరీలో ఆర్థికశాస్త్రం నుండి సాహిత్యం, రాజకీయాల వరకు అన్ని రకాల పుస్తకాలు ఉండేవి. అతనికి సన్నిహితుడైన విక్రమ్ సారాభాయ్‌తో కలిసి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–అహ్మదాబాద్ (ఐఐఎంఏ)తో పాటు కొన్ని ప్రముఖ విద్యా
పరిశోధనా సంస్థలను స్థాపించాడు. అందుకే ఆయన ఉన్న ఇంటిని ఆ కుటుంబానికి చెందిన నాలుగో తరం వారసుడు సంజయ్ లాల్‌భాయ్, అతని భార్య జయశ్రీ కలిసి మ్యూజియంగా మార్చారు. దీన్ని అహ్మదాబాద్ నడిబొడ్డున ఉన్న లాల్‌భాయ్ దల్పత్‌భాయ్ కట్టించిన118 ఏళ్ల పురాతన భవనంలో ఏర్పాటు చేశారు. ఈ ఇంట్లో ఇప్పటికీ ఎన్నో చారిత్రక కళాఖండాలు ఉన్నాయి.