సిరియాలో మినీ భూకంపం సృష్టించారు! భూగర్భంలోని మిసైల్ ప్లాంట్ను పేల్చేసిన ఇజ్రాయెల్ కమెండోలు

  • ‘ఆపరేషన్ మెనీ వేస్’ పేరుతో గత సెప్టెంబర్​లో దాడి.. 
  • 120 మంది సోల్జర్లతో ఆపరేషన్​
  • తాజాగా వీడియో రిలీజ్​

జెరూసలెం: అది 2024 సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి. పశ్చిమ సిరియాలోని ఓ కొండ ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద పేలుడు సంభవించింది. చాలా దూరం వరకూ భూమి కంపించింది. అయితే, అది ప్రకృతి వల్ల సంభవించిన  విపత్తు కాదు.. సిరియాలోకి చొరబడిన ఇజ్రాయెల్ కమెండోలు సృష్టించిన మినీ భూకంపం! అక్కడి కొండ గర్భంలో ఇరాన్ సీక్రెట్ గా నిర్మించిన మిసైల్ ప్లాంట్​ను పేల్చివేయడంతో వచ్చిన ప్రకంపనలవి. ‘డీప్ లేయర్’ అనే ఆ మిసైల్ ప్లాంట్ ను పేల్చేసేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ మెనీ వేస్’ వీడియోను తాజాగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది.

నిఘా పెట్టి.. పక్కాగా ప్లాన్ 

పశ్చిమ సిరియాలోని మస్యాఫ్ ఏరియాలో ఓ కొండను 70 నుంచి 130 మీటర్ల వరకూ తొలచి ‘డీప్ లేయర్’ పేరుతో ఇరాన్ మిసైల్ తయారీ ప్లాంట్​ను నిర్మించింది. రాజధాని డమాస్కస్ తర్వాత అత్యంత కట్టుదిట్టమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్న ప్రాంతం కావడంతో ఇజ్రాయెల్ కళ్లుగప్పి.. మిసైల్స్, వెపన్స్​ను తయారు చేయొచ్చని.. సేఫ్​గా లెబనాన్​లోని హెజ్బొల్లా మిలిటెంట్లకు, సిరియాలోని అప్పటి అసద్ సర్కారు బలగాలకు అందజేయొచ్చని ఇరాన్ భావించింది. 

నిజానికి అంతకుముందు ఇరాన్ దక్షిణ సిరియాలోని జమ్రాయా వద్ద ఓ మిసైల్, రాకెట్ ఇంజిన్ల తయారీ ప్లాంట్​ను ఏర్పాటు చేసింది. కానీ దానిని ఇజ్రాయెల్ 2017లో ధ్వంసం చేయడంతో.. 2021 కల్లా మస్యాఫ్​లో కొండ కింద కొత్త ప్లాంట్ నిర్మించింది. ఏటా 300 మిసైళ్లను తయారుచేసేలా తీర్చిదిద్దింది. ఈ ప్లాంట్​కు 3 ద్వారాలు, 16 రూంలు ఉన్నాయని వెల్లడించింది. దీనిపై మొదటి నుంచే ఇజ్రాయెల్ నిఘా పెట్టింది. 

2023 అక్టోబర్​లో ఇజ్రాయెల్​పై హమాస్ దాడితో యుద్ధం మొదలవడం.. హెజ్బొల్లా, ఇరాన్ మద్దతున్న ఇతర మిలిటెంట్ల నుంచీ దాడులు ప్రారంభం కావడంతో డీప్ లేయర్​ను పేల్చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం షల్డాగ్ యూనిట్ లోని 100 మంది కమెండోలను, యూనిట్ 669కు చెందిన మరో 20 మంది కంబాట్ సెర్చ్, రెస్క్యూ కమెండోలనూ ఎంపిక చేసి 2 నెలలు శిక్షణ ఇచ్చింది.

3 గంటల్లో ఆపరేషన్ ఫినిష్

సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి ఇజ్రాయెల్ నుంచి 4 సీహెచ్53 యాసుర్ హెవీ ట్రాన్స్ పోర్ట్ హెలికాప్టర్ల లో కమెండోలు బయలుదేరారు. ఎస్కార్ట్​గా ఏహెచ్64 అటాక్ హెలికాప్టర్లు, 21 ఫైటర్ జెట్లు, 5 డ్రోన్లు, 14 నిఘా విమానాలు వెళ్లాయి. మధ్యధరా సముద్రం మీదుగా సిరియాలోకి ఎంటరయ్యాయి. అక్కడి నుంచి తక్కువ ఎత్తులో ఎగురుతూ మస్యాఫ్ చేరుకున్నాయి. వెంటనే ఫైటర్ జెట్లు దూరంగా ఉన్న పలు లక్ష్యాలపై దాడులు చేశాయి. 

సిరియన్ బలగాల దృష్టి అటు మళ్లగానే.. కమెండోల హెలికాప్టర్లు డీప్ లేయర్ ప్లాంట్ ముందు దిగాయి. డ్రోన్​తో పర్యవేక్షిస్తూ, సిరియన్ బలగాలపై కాల్పులు జరుపుతూ కమెండోలు ప్లాంట్​లోకి చొరబడ్డారు. ప్లాంట్​లో 660 పౌండ్ల పేలుడు పదార్థాలను అమర్చి, బయటకి వచ్చి పేల్చేశారు. దీంతో టన్ను పేలుడు పదార్థాలు పేలిన తీవ్రతతో భారీ విస్ఫోటనం సంభవించింది. మొత్తం ఆపరేషన్ మూడు గంటల్లో ముగిసింది.