తేలనున్న వలస జీవుల లెక్క

  • సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో విదేశాలకు వెళ్లినవారి వివరాల సేకరణ
  • వలసలపై నాలుగు ప్రశ్నలు
  • రాష్ట్రంలో 15 లక్షల మంది ఉంటారని అంచనా

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వలస జీవుల లెక్క తేలనుంది. తెలంగాణ నుంచి ఏ దేశంలో ఎంత మంది ఉంటున్నారనే విషయంలో స్పష్టత రానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి గల్ఫ్ కంట్రీస్ తోపాటు ఇజ్రాయెల్, సింగపూర్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలస వెళ్లారు. 

గల్ఫ్ కు వలస వెళ్లిన వారే రాష్ట్రం నుంచి సుమారు 15 లక్షల మంది వరకు ఉంటారని అనధికారిక అంచనా. వలస కూలీలు, కార్మికుల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గరగానీ ఇతర సంస్థల దగ్గరగానీ కచ్చితమైన లెక్కలు లేవు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సర్వేతో  వలస జీవుల లెక్క తేలనుంది. 

వలసలపై నాలుగు ప్రశ్నలు

సర్వే లో భాగంగా రూపొందించిన ప్రశ్నల్లో వలసలకు సంబంధించి 48వ ప్రశ్నలో నాలుగు అనుబంధ ప్రశ్నలు చేర్చారు. ఇందులో 48(ఏ)కింద 'మీ కుటుంబం నుంచి ఎవరైనా వలస వెళ్లారా?(1. వలస వెళ్లలేదు. 2. ఇతర దేశాలకు వెళ్లారు. 3. ఇతర రాష్ట్రాలకు వెళ్లారు.), 48(బీ)కింద ఇతర దేశం అయితే దేశం పేరు, 48(సీ) కింద ఇతర రాష్ట్రమైతే రాష్ట్రం పేరు, 48(డీ) కింద వలస వెళ్లడానికి కారణం అనే ప్రశ్నలు ఉన్నాయి.

ఈ నాలుగు ప్రశ్నల ద్వారా మన రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి వలస వెళ్తున్నారు..? ఏ ప్రాంతం నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయనే లెక్క తేలనుంది. వలసల కారణాలు కూడా వెల్లడి కానున్నాయి. వలసలను అరికట్టేందుకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాలసీ పరమైన విధానాలను రూపొందించడానికి ఈ సర్వే ఉపయోగడనుంది. 

గల్ఫ్ కార్మికులకు రాష్ట్ర సర్కార్ ఎక్స్ గ్రేషియా..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించే స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని కొందరు బాధిత కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందజేశారు. ఎక్స్ గ్రేషియాతోపాటు సమగ్రమైన ఎన్నారై పాలసీ, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకమైన పాలసీ రూపొందించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుందని గల్ఫ్ జేఏసీ నేత రుద్ర శంకర్ అభిప్రాయపడ్డారు. 

అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు.. 

సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లకు తమ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారని చెప్తే వారి పేర్లు రేషన్‌‌‌‌ కార్డుల నుంచి తొలగిస్తారని, ఇతర ప్రభుత్వం పథకాలు ఇవ్వరనే ప్రచారం గల్ఫ్​ కు వెళ్లిన వలసజీవుల కుటుంబాల్లో జరుగుతోంది. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, వలస కార్మికులు, కూలీల లెక్క తేలితే ఆ కుటుంబాల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చే అవకాశముందని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రెసిడెంట్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మందా భీమ్ రెడ్డి వెల్లడించారు.

గల్ఫ్ కు వలస వెళ్లే వారి వయస్సు, కులం తదితర వివరాలను సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నాళ్లు వలసలు అంటే పాలమూరు లాంటి కరువు పీడిత జిల్లాల నుంచే ఉంటాయని సామాజికవేత్తలు భావిస్తున్నారని, కానీ గోదావరి జలాలు పారే మెట్‌‌‌‌పల్లి, కోరుట్ల, జగిత్యాల నుంచి కూడా గల్ఫ్​ కు వెళ్లడానికిగల కారణాలను అన్వేషించాల్సి అవసరం ఉందని తెలిపారు.