చలికి ..గజగజ వణుకుతున్న సంక్షేమ హాస్టళ్ల స్టూడెంట్స్

  • ఇంటి నుంచి చద్దర్లు తెచ్చుకుంటున్న  విద్యార్థులు
  • ఎముకలు కొరికే చలిలో చన్నీళ్లతో స్నానాలు
  • అలంకార ప్రాయంగా సోలార్ వాటర్ హీటర్లు

ఆసిఫాబాద్ , వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో విద్యార్థులకు చద్దర్లు, బ్లాంకెట్లు సరఫరా చేయకపోవడంతో చలికి గజగజ వణుకుతున్నారు.   ఒక్కో హస్టళ్లలో 200 నుంచి 500 పైగానే విద్యార్థులు చదువుతున్నారు. చలికాలం ఆరంభంలో పంపిణీ చేయాల్సిన దుప్పట్లు , బ్లాంకెట్లు ఐటీడీఏ అధికారులు నేటికీ పంపిణీ చేయడం లేదు. హాస్టళ్లలో విరిగిన తలుపులు, కిటికీలకు తోడు  సోలార్ వాటర్ హీటర్లు ఎక్కడ పనిచేస్తలేవు. ఉదయమే లేచి స్టూడెంట్స్ చన్నీళ్లతో స్నానాలు చేసి ఇబ్బంది పడుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. కాగా గత నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి.

సోలార్ వాటర్ హీటర్లు పని చేస్తలేవ్..

సోలార్ యూనిట్లు పని చేయకపోవడంతో స్టూడెంట్లు రోజు ఆరుబయటే వణికించే చలిలో చల్లటి నీళ్లతో స్నానాలు చేస్తున్నారు. ఇప్పటికే సరిపడా గదులు, టాయిలెట్ల వంటి సదుపాయాలు లేక సతమతమవుతున్న స్టూడెంట్లకు చలి కాలం పెద్ద సమస్య వచ్చిపడింది.  స్టూడెంట్ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో స్నానాలకు వేడి నీళ్లు అందించేందుకు ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్లు అలంకార ప్రాయంగా మారాయి.  కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటిని ఏర్పాటు చేసిన అధికారులు చిన్న చిన్న మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక్కో సోలార్ యూనిట్ కోసం అధికారులు రూ .5 లక్షల వరకు వెచ్చించారు. జిల్లాలో 46 ఆశ్రమ పాఠశాలలు ఉండగా 12,327 మంది స్టూడెంట్ చదువుకుంటున్నారు.

  • జైనూర్ మండలంలో మొత్తం 7 ఆశ్రమ హాస్టల్ లున్నాయి. జైనూర్, రాసిమెట్ట, పోచంలోద్ది, పానపటర్, పట్నాపూర్, మర్లవాయి, గౌరీ,. ఈ హాస్టల్ లల్లో మూడు మండలాల గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. గత రెండేళ్లు గా విద్యార్థులకు బ్లాంకెట్ లు పంపిణీ  చేయలేదు. 
  • దహెగాం మండలం లోని కల్వాడ ఆశ్రమ స్కూల్లో మొత్తం 209  మంది విద్యార్థులు ఉండగా శుక్రవారం 160 మంది విద్యార్థులు హాజరయ్యారు.  స్నానానికి వాటర్ హీటర్ లు పని చెయ్యకపోవడం తో ఎముకలు కొరికే చలిలో చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారు.

బ్లాంకెట్ ల పంపిణీలో జాప్యం సరికాదు

ఆశ్రమ హాస్టల్ లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలి.  చలి కాలం నేపథ్యంలో బ్లాంకెట్లు , చదర్లు పంపిణీ చేయడంలో అధికారులు జాప్యం చేయడం సరికాదు.  అది విద్యార్థులు చదువుపై ప్రభావం పడుతది. వెంటనే వారిని ఆదుకోవాలని. మాడవి  ఆనంద్ ఈశ్వర్, ఆదివాసీ ప్రధాన పురోహిత సేవా సంఘం జిల్లా ప్రెసిడెంట్ 

డిసెంబర్ వరకు ఇస్తం

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చద్దర్లు, బ్లాంకెట్లు ఇంకా సరఫరా చేయలేదు. ప్రతిపాదనలు పంపిన. ఇప్పుడే కాదా చలి మొదలైంది. చద్దర్లు, బ్లాంకెట్లు  డిసెంబర్ వరకు వస్తాయి. రాగానే విద్యార్థులకు అందజేస్తం.

రమాదేవి, డీటీడిఓ, ఆసిఫాబాద్