నామినేటెడ్​ పోస్టులపై ..కాంగ్రెస్​ లీడర్ల ఆశలు

  • పదవులు దక్కించుకునే ప్రయత్నాలు
  • ముఖ్య నేతలను కలిసి విన్నపాలు

కామారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ ​పోస్టులపై ఆ పార్టీ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్న వివిధ పోస్టుల కోసం జిల్లా లీడర్లు ప్రయత్నాలు షురూ చేశారు. అధికారంలో లేనప్పుడు పార్టీనే నమ్ముకొని ఉన్నామని, అధికారంలోకి వచ్చినందున తమకు ఛాన్స్​ ఇవ్వాలని కోరుతున్నారు. తమ గాడ్​ ఫాదర్ల ద్వారా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లాకు చెందిన ముఖ్యనేత షబ్బీర్​అలీకి ఇటీవల ప్రభుత్వ సలహాదారుగా అవకాశం లభించింది. ఈయన ద్వారా నామినేటెడ్​పోస్టుల కోసం సిఫార్సులు చేయించుకునేందుకు కొందరు లీడర్లు రెడీ అయ్యారు.

పదవులు ఆశిస్తున్నవారిలో..

కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్ ​శ్రీనివాస్​రావు, లీగల్​సెల్ ​జిల్లా కన్వీనర్​దేవరాజు గౌడ్, చంద్రకాంత్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి రాష్ట్ర స్థాయి పోస్టులపై గట్టి నమ్మకంతో ఉన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా నమ్ముకొని ఉన్న దృష్ట్యా ఛాన్స్​కల్పిస్తారని ఆశిస్తున్నారు. జిల్లా స్థాయిలోనూ గ్రంథాలయ చైర్మన్​తో పాటు, మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ ఆలయాల చైర్మన్, డైరెక్టర్ ​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఎల్లారెడ్డి మార్కెట్​కమిటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్వరులు జారీ చేశారు.

కామారెడ్డి, భిక్కనూరు పాలవర్గాలు ఇంకా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన జిల్లా లైబ్రరీ చైర్మన్, డైరెక్టర్లను తొలగించారు. ఈ పోస్టులు తమకు దక్కుతాయని ద్వితీయ శ్రేణి లీడర్లు నమ్మకంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడలో బీఆర్ఎస్, కామారెడ్డిలో బీజేపీ విజయం సాధించాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట నామినేటెడ్​ పోస్టులు ఇస్తే, ప్రజలకు దగ్గరయ్యే ఛాన్స్​ఉంటుందని భావిస్తున్నారు.

బాన్సువాడలో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన ఏనుగు రవీందర్​రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన లీడర్ల పనితీరు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నామినేటెడ్ ​పోస్టులు ఇచ్చే ఛాన్స్ ​ఉంది. పార్టీలో కొత్తగా చేరిన వారు సైతం తమకు పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. 

పార్లమెంట్​ ఎన్నికల్లో.. 

పార్లమెంట్​ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని కాంగ్రెస్​ భావిస్తోంది. ​ఎన్నికలకు ముందు కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం ద్వారా స్థానిక లీడర్లు, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రాష్ట్ర స్థాయి పోస్టులను భర్తీ చేయొచ్చనే ప్రచారం నడుస్తోంది. దీంతో మొదటి విడతలోనే పదవులు దక్కించుకోవాలని జిల్లా లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలను కలిసి నామినేటెడ్​ పోస్టుల్లో తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు.