ఈ మధ్య మనుషుల కంటే కూడా ఫోన్‌తో రిలేషన్షిప్ చాలా ఎక్కువైంది. వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చి అన్ని రకాలుగా డిస్టర్బ్ చేసే ఫోన్ రిలేషన్‌షిప్‌కి బ్రేకప్ చెప్పాల్సిందే! అప్పుడే జీవితాన్ని ‘జీవించ’గలుగుతారు. మామూలు మనుషులు అవుతారు.
మొబైల్ ఫోన్ అనే మెటల్ రెక్టాంగిల్ పీస్ ఒకటి హ్యాండ్ బ్యాగుల్లో, చొక్కా జేబుల్లో, అరచేతుల్లోకి చేరి మనుషుల ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా గేమ్స్ ఆడుతున్న ఫోన్ రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పాల్సిందే. అప్పుడే టైం మేనేజ్మెంట్ సాధ్యమవుతుంది. అరచేతిలో ఇమిడే చిన్న స్క్రీన్ మీది మెరుపులు కళ్లలో వెలుగును, బుర్రలో పదునును లాగేసుకుంటోంది. దానితో బ్రేకప్ చెప్తే కానీ ‘ఏం చేయాలన్నా టైం దొరకట్లేదు’ అనేవాళ్లకు టైం మేనేజ్మెంట్ అనేది ఎంత ఈజీనో తెలుస్తుంది.
గ్యాంబ్లింగ్‌తో సమానం
ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే కరుణ అనే ఒకావిడ గురించి చెప్పాలి. ఆమెలో రియలైజేషన్ ఎలా వచ్చిందో కానీ... తన స్మార్ట్‌ఫోన్‌లో టైం ట్రాకింగ్ యాప్ వేసుకుంది. దాన్నిబట్టి ఆమె రోజులో 52 సార్లు ఫోన్‌ను పిక్ చేస్తోంది. మూడు గంటల 57 నిమిషాలు అంటే... దాదాపు నాలుగ్గంటల సమయాన్ని ఫోన్ వాడడానికే కేటాయిస్తోంది అని తెలిసింది. అప్పుడు ఆమెకు అనిపించిందట తను స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యానని.
మరి స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా? కొన్ని సెకన్లకు ఒకసారి ఫోన్‌ను చెక్ చేయడం అనేది ‘బిహేవియరల్ అడిక్షన్’ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ అడిక్షన్‌ను దాదాపు గ్యాంబ్లింగ్‌తో పోల్చొచ్చు. అంతటి ఎఫెక్ట్‌ను చూపిస్తుందన్నమాట. ఆ ప్రభావం రిలేషన్షిప్, నిద్ర, ఫిజికల్ ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం మీద పడుతుంది.
యాప్స్‌కి అతుక్కుపోయేలా!
స్మార్ట్‌ఫోన్స్‌లో వాడే యాప్స్‌లో కొన్నింటిని అడిక్టివ్ మెషిన్స్ అనొచ్చు. వాటిలో మ్యాచింగ్ లేదా డేటింగ్ యాప్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇష్టపడే లేదా ఇష్టపడుతున్న వ్యక్తుల నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజ్ కోసం ఆ యాప్‌ను ఒకటికి రెండుసార్లు చూస్తారు. అదే ఒక సెల్ఫీ పోస్ట్ చేస్తే... ఎన్ని లైక్స్? ఎన్ని హార్ట్స్? వచ్చాయని స్క్రీన్ మీద ఉన్న వేలు అదేపనిగా రిఫ్రెష్ చేస్తూనే ఉంటుంది. లైక్స్ రావడం వల్ల బ్రెయిన్లో ఫీల్ గుడ్ కెమికల్ డోపమైన్ విడుదలవుతుంది. దానికి అలవాటుపడ్డ బ్రెయిన్స్ మళ్లీ మళ్లీ ఆ రివార్డు కావాలని ఆరాటపడుతూ.. సెకన్లో ఎన్నో సార్లు ఫోన్ చెక్ చేస్తుంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌నే తీసుకుంటే... ఒక అట్రాక్టివ్ ఫీచర్‌ను కోడింగ్ చేసింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వ్యక్తి కొంచెంసేపు అటుఇటు బ్రౌజ్ చేశాక, ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదని ఆ యాప్ క్లోజ్ చేయబోయినప్పుడే వాళ్ల పోస్ట్‌కి వచ్చిన లైక్స్ ఒక్కసారిగా కనిపిస్తాయి. దాంతో మళ్లీ ఇంకొంచెంసేపు ఇన్‌స్టా గ్రామ్‌కి అతుక్కుపోతారు! బ్రెయిన్ కెమిస్ట్రీ మీద దాడి చేసి యాప్స్‌ని ఎక్కువసేపు వాడేలా డిజైన్ చేయడంలో ఇదో టెక్నిక్ అన్నమాట.
వామ్మో ఇంత మోసమా? అనిపించొచ్చు. అలాగని ఫోన్‌ని పక్కన పారేయలేరు కదా. అందుకే చిన్న మార్పులు కొన్ని చేసుకోవాలి. అప్పుడు వర్చువల్ వరల్డ్‌ను వదిలి పెట్టి వాస్తవ ప్రపంచంలో టైం గడిపే అవకాశం ఉంటుంది. మీ టైంని స్మార్ట్‌ఫోన్ మింగేయకుండా ఫోన్‌కు దూరంగా ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ కంటే ఎక్కువ కిక్ ఇచ్చే కొత్త హాబీని అలవాటు చేసుకోవాలి.
చేతికి అందనంత దూరంలో...
ఫోన్లు ఏ విషయం నుంచైనా పక్కదారి పట్టిస్తాయి అనడంలో డౌట్ అక్కర్లేదు. ఫోన్ చేతిలో పట్టుకుని వాడకపోయినా కంటికి కనపడేలా ఉంటే చాలు ‘మాకు చాలా విల్ పవర్ ఉంది. దాన్ని ముట్టుకోం’ అనే వాళ్లను కూడా లూజర్స్ని చేసేస్తుంది. అలాంటి దాన్నుంచి బయటపడాలంటే కొన్ని టెక్నిక్స్ వాడాలి. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ని ట్రంక్ లేదా గ్లౌవ్ బాక్స్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సేఫ్ డ్రైవ్ కూడా అవుతుంది.
నిద్ర త్వరగా పట్టాలన్నా, మీ జీవిత భాగస్వామితో రిలేషన్ బాగుండాలన్నా ఫోన్ ఛార్జింగ్ బెడ్రూమ్లో పెట్టొద్దు. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు నిద్ర పోయే ముందు చూసే చివరి వస్తువు, ఉదయం లేవగానే చూసే మొదటి వస్తువు కాకుండా ఉంటుంది. అంతేకాదు అర్థరాత్రిళ్లు లేచి ఫోన్ చూసుకునే అలవాటు కూడా పోతుంది.
అలారం క్లాక్, రిస్ట్ వాచీలను వాడడం మొదలుపెట్టాలి. వాటివల్ల ‘టైం చూసేందుకు లేదా అలారం కోసం ఫోన్ వాడుతున్నాం’ అనే సాకు చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాగే ‘ప్రపంచంలో జరుగుతున్న విశేషాలు మిస్ అవుతాం’ అనేవాళ్లు న్యూస్‌పేపర్స్, మ్యాగజైన్స్ సబ్స్క్రయిబ్ చేసుకోవాలి. సంగీత ప్రేమికులు స్ట్రీమింగ్ యాప్స్ వాడడం మానేసి స్మార్ట్‌ఫోన్, యాప్స్ లేకముందు సంగీతం ఎలా వినేవాళ్లో వాటికి మారిపోవాలి.
టెక్నాలజీ సాయంతో...
- ఏ యాప్స్ అయితే అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయో అలాంటి యాప్స్‌నే వాడి అడిక్షన్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అంటే... వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు టెక్నాలజీకి టెక్నాలజీతోనే చెక్ పెట్టాలన్నమాట.
- స్క్రీన్ టైంను మానిటర్ లేదా బ్లాక్ చేసే యాప్స్ వాడాలి. స్క్రీన్‌టైంని షెడ్యూల్ చేసే లేదా సోషల్ మీడియా పోస్ట్ షెడ్యూల్ చేసేవి వాడొచ్చు. కొన్ని మొబైల్ ఫోన్స్‌లో స్క్రీన్‌టైం ట్రాకర్ ఇన్‌బిల్ట్‌గా ఉంటోంది కూడా.
- బేసిక్ ఫోన్స్ వాడాలి లేదా ఇంటర్నెట్ లిమిటెడ్‌గా వాడాలి.
- మొబైల్ స్క్రీన్‌ను బ్లాక్ అండ్ వైట్ మోడ్ పెట్టుకోవాలి. అన్ని హంగులున్న స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో పెడితే అది పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్‌లా కనిపిస్తుంది. అప్పటివరకు రంగుల ప్రపంచాన్ని చూసిన కళ్లకు బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ వల్ల ఆసక్తి తగ్గిపోతుంది.
- సోషల్ మీడియాలో మునిగి తేలడాన్ని స్పీడ్‌గా కరిగిపోయిన బాల్యంతో పోల్చి చూడొచ్చు. అదెలాగంటే స్మార్ట్ ఫోన్‌కి కళ్లు అతికించి మీరు ఎంజాయ్ చేస్తుంటే టైం అనేది మీకు తెలియకుండానే జారిపోతుంది.
- పుష్ నోటిఫికేషన్స్ నుంచి బయటపడాలంటే.. భార్య/ భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లల స్కూల్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కి మాత్రమే నోటిఫికేషన్స్ అలర్ట్ పెట్టుకోవాలి. మిగతా నోటిఫికేషన్స్ ఆపేయాలి. అప్పుడు ‘టింగ్ టింగ్’ అని వచ్చే నోటిఫికేషన్ శబ్దాలు డిస్టర్బ్ చేయవు. అలాగే ఫోన్ లిఫ్ట్ చేయాలనే టెంప్టేషన్ కూడా ఉండదు.
డిజిటల్ డిటాక్స్
ఒక రోజంతా అంటే 24 గంటలు స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండాలి. ఫోన్ దగ్గర లేనప్పుడు పిచ్చిపిచ్చిగా అనిపించొచ్చు. గాల్లో ఎగురుకుంటూ వెళ్లి క్షణాల్లో ఫోన్ తెచ్చుకోవాలి అనిపించొచ్చు. ఇలాకాకుండా కొందరికి ఆందోళనగా అనిపిస్తుంది. చిరాకు పడుతుంటారు. ఈ లక్షణాలు ఏవి కనిపించినా నో ప్రాబ్లమ్. అడిక్షన్ తెచ్చిపెట్టే తిప్పలు ఇవన్నీ. ఇది చాలా సాధారణం. అందుకని వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇలా ఉండడాన్నే విత్‌డ్రాయల్ సింప్టమ్ అంటారు.
30 రోజుల డిజిటల్ డీక్లట్టర్ ట్రైచేస్తే ఇంకా బెటర్ అంటున్నారు మానసిక నిపుణులు కొందరు. దీన్నే ‘డిజిటల్ మినిమలిజమ్’ అంటారు. అంటే రెగ్యులర్‌గా జీవితంలో వాడుతున్న అన్ని రకాల టెక్నాలజీలకు బ్రేక్ చెప్పాలి. చాలా అవసరం అనుకున్న టెక్నాలజీని మాత్రమే వాడాలి. దానివల్ల వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అదెలాగంటే ఉద్యోగులు కంపెనీ ఇ–మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. పనికి సంబంధించిన విషయం కాబట్టి అది అవసరం. అలాగే భార్యాభర్తలు వారి వారి ఉద్యోగాల రీత్యా దూరంగా ఉంటుండొచ్చు. ఇలాంటి వాళ్లు ఫేస్‌టైం వంటి వాటిని కమ్యూనికేషన్ టూల్‌గా వాడుకోవచ్చు.
దానికి బదులుగా...
డిజిటల్ మినిమలిజంలో భాగంగా ఒక విషయానికే అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. క్రికెట్, బాస్కెట్‌బాల్, హైకింగ్, రీడింగ్, ఇనుస్ట్రుమెంట్ ప్లేయింగ్ వంటి వాటిలో దేన్ని ఎంజాయ్ చేస్తారో ఆ పని చేయొచ్చు. చేస్తున్న పని ఏదైనా మనసుకి ఆనందాన్ని ఇవ్వాలి. సింపుల్‌గా చెప్పేదేంటంటే డిజిటల్ డిస్ట్రాక్షన్స్ కోసం డిజిటల్ టైంను వేరే యాక్టివిటీలతో నింపాలి.ఉదాహరణకి సోషల్‌మీడియాలో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ముక్కూమొహం తెలియని వ్యక్తుల కామెంట్స్‌కి రిప్లయ్ పెడుతూ, యుద్ధాలు చేస్తుంటే కనుక అది ఆపేయాలి. ఆ సబ్జెక్ట్ రియల్ వరల్డ్‌లో పనిచేయాలి. అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఫలితం కూడా ఉంటుంది.
ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి
చాలామంది ఎమోషనల్ విషయాల మీద దృష్టిపెట్టకుండా వాళ్లను ఇబ్బందిపెట్టే ఎమోషన్స్‌కి దూరంగా ఉండేందుకు ఫోన్ మీద ఆధారపడుతుంటారు. అలా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌మీద స్క్రోల్ చేస్తూ బిజీగా ఉంటే... చుట్టూరా జరిగే ముఖ్యమైన విషయాలు ఎన్నో మీ దృష్టి దాటిపోయే అవకాశం ఉంది.
అందుకే ఎక్స్పర్ట్ చెప్పేదేంటంటే... స్మార్ట్ ఫోన్‌ని స్మార్ట్‌గానే వాడాలి. అందుకు చేయాల్సిందల్లా ‘ఫోన్‌కే ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నా’ అని ప్రశ్నించుకోవాలి. బోర్, ఆందోళన, ఉత్సుకత, సంతోషం... ఇలా వీటిలో దేనివల్ల ఫోన్ మీద ఆధారపడాల్సి వస్తోంది అనేది తెలుసుకోవాలి. దాంతోపాటు ఫోన్ అంతగా వాడడం వల్ల బెటర్‌గా ఫీలవుతున్నారా? లేదంటే పరిస్థితి ఇంకా చెత్తగా తయారైందా? అనేది గమనించుకోవాలి. ఉదాహరణకి రాత్రి నిద్ర పోవాల్సిన టైంలో అరగంట పాటు సోషల్‌మీడియాలో మునిగి తేలడం వల్ల ఎంతో విలువైన నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అది అంతటితో ఆగకుండా డిప్రెషన్ బారిన పడే పరిస్థితికి దారి తీసే అవకాశం కూడా ఉంది.
బ్రేకప్ చెప్పాక
నిజానికి స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పనులు ఎన్నో చేస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను ‘స్మార్ట్’గా వాడుకోవాలి. ఫోన్‌తో బ్రేకప్ అయ్యాక మళ్లీ ఫోన్ వాడేటప్పుడు అవసరమైన కొన్ని యాప్స్ వేసుకోవచ్చు. కాకపోతే వాటిని మైండ్‌ఫుల్‌గా వాడాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా ఒక్కసారిగా జరిగిపోదు. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో నడుస్తుంటుంది.
ఒక అలవాటు కావాలన్నా లేదా ఒక అలవాటును వదిలేయాలన్నా కొంత టైం పడుతుంది. అందుకని ఒక్కోసారి పెట్టుకున్న షెడ్యూల్ తప్పినా మిమ్మల్ని మీరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. రీ ఆర్గనైజ్ చేసుకుని రీస్టార్ట్ చేయొచ్చు.
టూల్ & టెంప్టేషన్
స్మార్ట్ ఫోన్‌ని ఒక ‘టూల్’గా వాడాలి. కొత్త సిటీలోకి వెళ్లినప్పుడు నావిగేటర్‌గా, ఫొటోలు తీసుకునేందుకు. ఇక ‘టెంప్టేషన్’ విషయానికి వస్తే... తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఆ తరువాత పోస్ట్ చేసిన ఫొటోను ఎంతమంది లైక్ చేశారని ఫోన్‌ని పదేపదే రిఫ్రెష్ చేయడం.