రంజాన్ మాసం వచ్చిందంటే.. మండుటెండల్లోనూ నిండు వసంతంలా అనిపిస్తుంది. ప్రతి ఊళ్లో ముస్లింల పవిత్ర ప్రార్థనలు వినిపిస్తుంటాయి. సిటీలన్నీ హలీమ్ రుచులతో సందడిగా ఉంటాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే మార్కెట్‌లన్నీ జనంతో కిక్కిరిసిపోతాయి. రంజాన్ నెల అంటేనే వరాల నెల. మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి అవసరమైనవన్నీ అందించే ఈ నెలలోనే ఖురాన్ గ్రంథం అవతరించింది. అప్పుడే రంజాన్ ఉపవాసాల నిర్ణయం కూడా జరిగింది.
ఉపవాసాలు దైవం మీద భక్తి, భయాలను పెంచుతాయి. రంజాన్ నెలలో ముస్లింలు తెల్లవారు జామున 4 గంటలకే సహేరి(ఉదయం తీసుకునే ఆహారం) తీసుకుంటారు. తరువాత సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోరు. ఎంగిలి మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేస్తారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నాపెద్ద అందరూ భక్తి శ్రద్ధలతో చేసే ఈ ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెప్తుంటారు.
జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని సైన్స్ చెప్తుంది. ఈ దీక్షలు సహేరీతో మొదలై ఇఫ్తార్‌తో ముగుస్తాయి. వెయ్యి రాత్రుల కన్నా విలువైన రాత్రిగా చెప్పుకుంటున్న ‘షబేఖద్ర్’ కూడా రంజాన్ నెలలోనే ఉంది. ఈ ఒక్క రాత్రి దైవారాధన చేస్తే వెయ్యి నెలలు ఆరాధన చేసిన దానికంటే ఎక్కువ మేలు కలుగుతుంది. రంజాన్ నెలలో ఐదుపూటల నమాజుతో పాటు, అదనంగా తరావీహ్ నమాజులు చేస్తారు. సాధారణ దానధర్మాలతో పాటు ‘ఫిత్రా’ అని పిలిచే ప్రత్యేక దానం కూడా రంజాన్‌లోనే చేస్తారు. దీనివల్ల పేదలకు ఎంతో లాభం జరుగుతుంది. ‘జకాత్’ కూడా రంజాన్‌లోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదల అవసరాలను తీర్చేదే.
జీవనవిధానంలో మార్పులు
రంజాన్ నెలలో ముస్లింలు తమ జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకుంటారు. దైవారాధన, దాన ధర్మాలు చేస్తూ త్యాగం, కరుణ, సానుభూతి, ప్రేమతో మెలుగుతారు. ఉపవాస సమయంలో అబద్ధం, అన్యాయం.. లాంటి పాపపు పనులకు దూరంగా ఉంటారు. సుమారు 30 రోజుల పాటు ఈ దీక్షలో ఉంటారు. అనంతరం రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు.
ప్రళయ కాలం సంభవించే వరకు...
మహమ్మద్ ప్రవక్త కంటే ముందు అనేక మంది ప్రవక్తలు భూమిపైకి వచ్చారు. మొదటి ప్రవక్త అయిన హజరత్ ఆదం అలైహిస్సాలం కాలంలో10, హజరత్ షీష్ అలైహిస్సాలం కాలంలో 50, హజరత్ ఇద్రీస్ అలైహిస్సాలం కాలంలో 30, హజరత్ ఇబ్రాహిం అలైహిస్సాలం కాలంలో 10 చొప్పున ఆకాశ గ్రంథాలు భూమిపై అవతరించాయని మత పెద్దలు చెప్తుంటారు. తర్వాత హజరత్ మూసా అలైహిస్సలాం, హజరత్ దావూద్ అలైహిస్సలాం, హజరత్ ఈసా అలైహిస్సలాం ప్రవక్తల కాలంలో తౌరాత్, జబూర్, ఇంజీల్ గ్రంథాలు అవతరించాయి.
ఇలా సృష్టి ఏర్పడినప్పటి నుంచి మొత్తం103 ఆకాశ గ్రంథాలు భూమిపై అవతరించాయి. ఆ తర్వాత చివరి ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలైహివ సల్లం కాలంలో పవిత్ర ఖురాన్104వ గ్రంథంగా అవతరించింది. ఇది చివరిదే కాకుండా అన్ని గ్రంథాల కంటే ఉన్నతమైనదిగా మౌల్వీలు చెప్తారు. ప్రళయ కాలం సంభవించే వరకు ఆ గ్రంథమే చెలామణిలో ఉంటుందని, ఈ గ్రంథాన్ని రక్షించే బాధ్యతను స్వయంగా అల్లా చేపట్టారని నమ్ముతారు. ఇందులో114 సూరాలు, 6,666 ఆయాతులు, 540 రుకూలు ఉంటాయి. సంపూర్ణ గ్రంథాన్ని 30 భాగాలుగా చేశారు. వాటిని (పారా) పాఠాలుగా చెప్తుంటారు. ఖురాన్ అవతరించి దాదాపు1,500 ఏళ్లు గడిచినా ఈ గ్రంథంలోని చిన్న డాట్ (.) కూడా మారలేదు.
ఖురాన్‌లో ఏముంది?
ఖురాన్‌లో ఉన్న సారాంశం అంతా మనిషి చుట్టూరా తిరుగుతుంది. పుట్టుక, చావు, పరలోక జీవితం, సృష్టిలో మనిషికి లోబర్చిన అనుగ్రహ భాగ్యాలు, పూర్వపు గాథలు, గుణపాఠాలు, ప్రవక్తల పరంపర, సృష్టి ఉనికి.. ఇలా ఎన్నో విషయాలను అందులో చర్చించారు. మనిషి జీవితంలో సక్సెస్ కావడానికి అవసరమైన అన్ని సూచనలు, నియమాలు ఇందులో ఉన్నాయి. మానవ సంబంధాలు, శాంతియుత జీవనం, అహింస, విశ్వసనీయత, ఎవరితో ఎలా మసలుకోవాలి? ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి? నిత్య జీవితం ఎలా గడపాలి? పిల్లలతో ఎలా ఉండాలి? పెద్దలతో ఎలా ఉండాలి? వంటి ఇహలోక అంశాలతో పాటు పరలోక సౌఖ్యం పొందడానికి అవసరమైన మూల సూత్రాలు కూడా ఇందులోనే ఉన్నాయి.
లైలతుల్ ఖద్ర్
రంజాన్ నెలలో చివరి అంకంలో ఐదు బేసి సంఖ్య ఉన్న రాత్రుల్లో ఏదో ఒక రోజు రాత్రిని ఇస్లామియా ప్రకారం ‘లైలతుల్ ఖద్ర్’ అని అంటారు. ఈ నెలలో 27వ రోజు రాత్రి షబ్–ఏ–ఖదర్ జరుపుకుంటారు. ఈ రోజు దివ్య ఖురాన్ అవతరించిందని భావించి రాత్రి జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. 83 ఏళ్ల పాటు ప్రార్థనలు చేస్తే ఎంత పుణ్యం దక్కుతుందో... ఆ ఒక్క రోజు భక్తితో ప్రార్థనలు చేస్తే అంత పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.
ఫిత్రా తప్పనిసరి
రంజాన్ పండుగను ‘ఈదుల్ ఫితర్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. ఈ నెలలో ఆర్థిక స్థోమత ఉన్న ముస్లింలు ‘ఫిత్రా’లు ఇస్తారు. ఫిత్రా అంటే దానధర్మాలు అని అర్థం. ఎవరి దగ్గర ఏడున్నర తులాల బంగారం, 52.5 తులాల వెండి లేదా.. వీటి విలువకు సరిపడా నగదు, డిపాజిట్స్ ఉంటాయో వాళ్లంతా ఫిత్రా ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ డబ్బు రంజాన్ పండుగ కంటే ముందు రోజు లోపు పేదలకు ఇవ్వాలి. ఈ ఫిత్రాలను తీసుకునేవాళ్ల ఇంట్లో ప్రతి ఒక్కరికీ1.6 కిలోల గోధుమల ధర చొప్పున లెక్కించి డబ్బు, బట్టలు, ఫుడ్ రూపంలో ఇస్తారు. అయితే ఈ ఫిత్రాను పండుగ ప్రత్యేక నమాజు ఈదుల్ ఫితర్ కంటే ముందే ఇవ్వాలి. స్థోమత ఉండి ఫిత్రా ఇవ్వని వ్యక్తి నెల రోజులు ఉపవాసాలు పాటించినా లాభం లేదని ముస్లింల విశ్వాసం.
తరావీ నమాజు
రంజాన్‌లో రోజూ జరిగే ఐదు పూటల నమాజ్‌తో పాటు రాత్రి పూట జరిగే ఇషా నమాజ్ తర్వాత ‘తరావీ’ అనే ప్రత్యేక నమాజ్ చేస్తారు. నెల మొత్తం జరిగే ఈ ప్రత్యేక నమాజ్‌లో దివ్య ఖురాన్ పఠనం జరుగుతుంది. ఖురాన్ అవతరించిన నెల కాబట్టి ఈ నెలలో ఆ గ్రంథాన్ని చదివిన వాళ్లతో పాటు విన్నవాళ్లకు కూడా పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఖురాన్ చదువుతారు.
ఏతేకాఫ్
రంజాన్ నెలలో రోజువారీ చేసే నమాజ్‌తోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రాత్రి(ఇషా) ఫర్జ్ నమాజ్ తర్వాత అదనంగా 20 రకాతుల తరావీహ్ నమాజ్ చేస్తారు. ఇది నెలంతా చేస్తారు. ఈ నెలలో దీక్షలు పాటించి, మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేసిన వాళ్ల కోరికలను అల్లాహ్ తీరుస్తాడని ప్రగాఢ నమ్మకం. ముప్పై రోజుల దీక్షలను మూడు భాగాలుగా విభజించారు. మొదటి పది రోజులు రహమత్ రోజాలు, రెండో 10 రోజులు మగ్ ఫిరత్ రోజాలు, చివరి10 రోజులు జహన్నుమ్ స్ చుట్కారా పానేకి రోజాలు.
మొదటి10 రోజుల్లో దీక్షలు పాటిస్తే అల్లా కరుణ వర్షం కురిపిస్తాడని,10 నుంచి 20 రోజుల దీక్షలు పాటిస్తే చేసిన పాపాలను హరిస్తాడని, 21వ రోజు నుంచి దీక్షలను పూర్తి చేస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. 21వ రోజు నుంచి చివరి వరకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఏతేకాఫ్ అంటారు. అంటే ఒకరకమైన తపోనిష్ఠ. దీన్ని పాటించాల్సిన వాళ్లు మసీదులోనే ఒక పక్క డేరా కట్టుకుని ఉంటారు. దైవ ధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేస్తారు. ఏతేకాఫ్‌లో ఉన్నవాళ్లు బలమైన కారణం ఉంటే తప్ప మసీదు వదిలి బయటకు పోకూడదు.
::: షౌకత్ అలీ, మెట్ పల్లి
జకాత్
రంజాన్ నెలలో పేద ముస్లింలకు ‘జకాత్’ ఒక వరం లాంటిది. రంజాన్ పండుగను పేద ముస్లింలు కూడా సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ‘జకాత్’ అనే విధానాన్ని ఖురాన్‌లో చెప్పారు. ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ఏడాది పాటు సంపాదించిన నగదు, వెండి, బంగారం ఆభరణాల విలువలో రెండున్నర శాతం విలువైన వస్తువులు లేదా నగదు జకాత్ పేరిట పేదలకు దానం చేయాలి. వ్యవసాయ భూములు, పశువులు, గొర్రెలు, మేకలు.. ఇలా దేని మీద ఆదాయం వచ్చినా అందులో నుంచి పేదలకు రెండున్నర శాతం దక్కుతుంది.
.....రంజాన్ ప్రత్యేకతలు
ఈ నెలలో సహృదయంతో, దైవభక్తితో సత్కార్యం చేసినవాళ్లకు ఇతర మాసాల్లో చేసిన ‘ఫరజ్’కి లభించే పుణ్యఫలం దక్కుతుంది. ఫరజ్‌ని ఆచరిస్తే ఇతర మాసాల్లో లభించే 70 విధులకు సమానమైన పుణ్య ఫలాలు దక్కుతాయి.
ఈ నెలలో ఖురాన్ అవతరించడంతోపాటు హజరత్ దావూద్‌కు ‘జబూర్’ గ్రంథం దక్కింది.
హజరత్ జిబ్రాయిల్ ప్రతి ఏడాది ఈ నెలలో మహా ప్రవక్తకు దివ్య ఖురాన్‌ను సంపూర్ణంగా వినిపించేవాడు.