viral video:హోలీ స్పెషల్ కలర్‌ఫుల్ ఇడ్లీ అబ్బా చూస్తేనే నోరూరుతుంది

దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఇడ్లీ బాగా ఫేమస్, ఎక్కువగా మార్నింగ్ టిఫిన్స్ లో ఉండే ఈ వంటకం మినప పప్పు, ఇడ్లీ రవ్వతో తయారు చేస్తారు. తెలుగులో దీన్ని ఆవిరి కుడుము అంటారు. ఈ ఇడ్లీ మద్రాసీల వంటకం. మల్లెపువ్వుల్లా తెల్లగా, సున్నితంగా  ఉండే ఇడ్లీకి మంచి టేస్టీ చెట్నీ జోడిస్తే ఆ రుచే వేరు. ఇప్పటి వరకూ తెల్లగా ఉండే ఇడ్లీలనే మీరు చూసి ఉంటారు. మహా అయితే మిల్లెట్స్ పిండితో చేసిన ఇడ్లీలు రెడ్ లేదా బ్రౌన్ కలర్ లో ఉంటాయి. కానీ ఫస్ట్ టైం నాలుగైదు కలర్స్ లో ఉండే ఇడ్లీలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఒకే ఇడ్లీలో ఇన్ని  రంగులా  అన్నట్టు గ్రీన్, పింక్, పర్పల్, ఎల్లో, ఆరెంజ్ రంగులతో చూడటానికి కలర్స్ ఫుల్ ఇడ్లీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇన్స్టాగ్రామ్ యూజర్ రోహిణి వీటిని తయారు చేసి, నిన్న (మార్చి 12) తన అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఒక్కరోజుకే 4 మిలియన్ వ్యూస్, 88వేల లైక్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో  వైరల్ గా మారింది. ఈ హోలీకి స్పెషల్ కలర్ ఫుల్ ఇడ్లీ అని షేర్ చేసింది. కలర్ ఫుల్ ఇడ్లీల తయారీ కోసం ఆమె న్యాచురల్ కలర్స్ నే  వాడిందట. గ్రీన్ కోసం బచ్చలికూర, పింక్ కోసం బీట్ రూట్, పర్పుల్ రంగు రావడానికి బఠానీ పువ్వు, ఎల్లో కలర్ కోసం పసుపు, ఆరెంజ్ కోసం బీట్ రూట్ అండ్ పసుపును మిక్స్ చేసిందట. ఈ రంగుల్లో పిండిని వేర్వేరు గిన్నెల్లో కలుపుకొని, ఇడ్లీ స్టీమింగ్ కుక్కర్ ప్లేట్లో వేసుకుంది. రంగు రంగుల ఇడ్లీలు చూస్తేనే నోరుతున్నాయి. తింటే ఇంకా ఎంత టేస్టీగా ఉంటాయో మరి.