ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఇష్టమే. ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకుంటూ కోడిగుడ్లు విసురుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఆ రంగులు నేరుగా చర్మం, జుట్టు మీద పడిపోతాయి. సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోతే చర్మ సమస్యలే కాదు జుట్టు కూడా ఇబ్బంది పడుతుంది. అందుకే రంగుల బారి నుంచి సంరక్షించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.ఈ పండగ జరుపుకోవడానికి ముందు, తర్వాత.. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే హోలీ జరుపుకున్న తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. మరి దాని కోసం ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం...
హోలీ పండగ (మార్చి 25) వచ్చేస్తోంది. హోలీ అంటేనే రంగు రంగుల పండగ. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండగ అంటే ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు. కొందరైతే ఒక్కరోజు కాదు.. రెండు, మూడు రోజులపాటు ఈ పంగను జరుపుకుంటూ ఉంటారు. సరదాగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మనం రంగులు పూసుకుంటూ.. నీళ్లు చల్లుకుంటూ సరదాగా ఆడుకుంటూ ఉంటాం.ఈ పండగ సరదాగా చేసుకున్నప్పుడు సరదాగానే ఉంటుంది. కానీ.. ఆ తర్వాత వస్తుంది అసలు సమస్య. పూసుకున్న రంగులు తొందరగా పోవు. అంతేకాదు.. చాలా రకాల స్కిన్ ఎలర్జీలు, ర్యాష్ లు వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి తిప్పలు పడాల్సి ఉంటుంది.
Also Read: రంగులాట మంచిదే.. పిల్లాపెద్దలకు కలిపే వేడుక
రంగుల పండగ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ రంగులు చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచే చర్మ సంరక్షణ ప్రారంభించండి. ఇది రంగు ల హానికరమైన రసాయనాల నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. దాదాపుగా మనం అందరూ హోలీ పండుగ ఉదయం పూట జరుపుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఎండ వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. దాని వలన చర్మం దెబ్బతింటుంది. సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావడం , చర్మంపై హానికరమైన రసాయనాల కారణంగా చర్మ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి చర్మ సంరక్షణలో అనేక చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. రంగు పూసుకోవడానికి ముందు, తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
హోలీ ఆడటానికి ముందు చేయాల్సినవి..
1. రంగుతో ఆడుకోవడానికి వెళ్లే ముందు, మీ చేతులు, పాదాలు, ముఖానికి మంచి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. కావాలంటే కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనె లేదా క్రీమ్ మందంగా రాయడం గుర్తుంచుకోండి.
2. కనీసం SPF 30 సన్‌స్క్రీన్‌ని రాయాలి.
3. ఫుల్ స్లీవ్స్ ధరించండి. ఇది చాలా శరీరాన్ని కవర్ చేస్తుంది. రక్షణ కోసం మీరు సన్ గ్లాసెస్ ధరించవచ్చు. రంగు కారణంగా జుట్టు దెబ్బతినకుండా ఉండేందుకు స్కార్ఫ్ ఉపయోగించండి.
4. జుట్టుకు నష్టం రాకుండా ఉండేందుకు కవర్ చేసుకోవాలి. లేదంటే.. జుట్టుకు సాధ్యమైనంత వరకు రంగులు తగలకుండా చూసుకోవాలి.
5. రంగుతో ఆడుకునే ముందు నెయిల్ పాలిష్ తప్పనిసరిగా వేయాలి. గోళ్లు పాడవ్వకుండా ఉంటాయి.
6. రసాయన రంగులకు బదులుగా, మీరు పండ్లు, కూరగాయలు లేదా ఆకులతో చేసిన రంగులతో ఆడవచ్చు.
7. రంగులు కొనుగోలు చేసే ముందు ఎల్లప్పుడూ పదార్థాలను తనిఖీ చేయండి. తేదీ ముగిసిన తర్వాత రంగు ఉపయోగించడం హానికరం.
హోలీ ఆడటం అయిపోయిన తర్వాత చేయాల్సినవి..
1. హోలీ ఆడిన తర్వాత గోరువెచ్చని నీటి స్నానం చేయండి. ఇది హానికరమైన సూక్ష్మక్రిములను వదిలించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
2. ఒంటికి అంటుకుపోయిన రంగును వదిలించుకోవడానికి స్క్రబ్ చేయవద్దు లేదా రుద్దవద్దు.
3. డ్రై స్కిన్ ఉన్నవారు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మం లోపల తేమను ఉంచుతుంది
4. రంగుతో ఆడుకున్న తర్వాత మీ ముఖానికి రెటినోల్, గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ .. విటమిన్ సి పూయవద్దు. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది.
5. రంగులు పూసుకున్న తర్వాత చర్మం చికాకుగా ఉంటే, అప్పుడు సాధారణ కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. అది సమస్యను పరిష్కరిస్తుంది. కొబ్బరినూనె రాసిన కూడా దురద సమస్య తగ్గలేదు అంటే.. వేపాకు నీటితో స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా రిలీఫ్ కలుగుతుంది