హైడ్రా ఎంట్రీతో హెచ్ఎండీఏ అలర్ట్ చెరువుల కబ్జాలపై ఫోకస్

  • లేక్​ ప్రొటెక్షన్​ కమిటీలను యాక్టివ్​ చేస్తున్న సంస్థ  
  • 3,532 చెరువుల్లో 2,540 చెరువులను నోటిఫై చేసిన కమిటీలు 
  • 230 చెరువులు కబ్జా అయినట్టు గుర్తింపు
  • రాబోయే రోజుల్లో మరిన్ని చెరువుల సర్వేకు రెడీ

హైదరాబాద్, వెలుగు :మహానగరంలో హైడ్రా ఎంట్రీ ఇచ్చి చెరువులపై అక్రమ నిర్మాణాలను కూలుస్తుండడంతో ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన​హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్ అథారిటీ(హెచ్​ఎండీఏ) అలర్టయ్యింది. తమ పరిధిలో చెరువుల పరిస్థితిపై సర్వే నిర్వహిస్తోంది. ఆయా జిల్లాల పరిధిలో రికార్డుల్లో ఉన్న చెరువులు ఎన్ని ? ఉన్నవి ఎన్ని అన్నదానిపై ఆరా తీస్తోంది. దీని కోసం హెచ్ఎండీఏ కమిషనర్​ చైర్మన్​గా ఉన్న లేక్ ​ప్రొటెక్షన్​కమిటీని యాక్టివ్​ చేస్తోంది. ఇందులో కీలకమైన 18 శాఖల అధికారులు మెంబర్లుగా ఉన్నారు. 

ఈ లేక్​ ప్రొటెక్షన్​ కమిటీతో ఏడు జిల్లాల పరిధిలోని చెరువులను గుర్తించాలని, వాటి పరిరక్షణ చేపట్టాలని, కబ్జాలను కూల్చేందుకు సాయం తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ ఆధీనంలో ఉండే చెరువులను సర్వే చేయిస్తోంది. రానున్న రోజుల్లో హైడ్రా మాదిరిగానే లేక్​ప్రొటెక్షన్​కమిటీని స్ట్రెంతెన్​చేసి వారికి అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరతామని అధికారులు తెలిపారు. 

కనిపించని సుమారు వెయ్యి చెరువులు 
 
హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో కలిపి మొత్తం 3,532 చెరువులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఇప్పటివరకు 2,540 చెరువులను మాత్రమే గుర్తించినట్టు లేక్​ ప్రొటెక్షన్​ సెల్​ఆఫీసర్​ ఒకరు చెప్పారు. మిగిలిన వాటిని గుర్తించేందుకు ఇప్పటికే సర్వే ప్రారంభించామంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 230 చెరువుల్లో కబ్జాలున్నట్టు తేల్చామన్నారు. తమ సర్వేలో కబ్జాలకు గురైన చెరువులను గుర్తించడమే కాకుండా ఆయా చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్​జోన్లను గుర్తించి మార్కింగ్​ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే పాత రికార్డులను ప్రస్తుతం ఉన్న రికార్డులతో పరిశీలిస్తున్నామన్నారు. 

గతంలో ఉన్న రికార్డులు, మ్యాపులు ప్రకారమే ఆయా చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్​జోన్లను గుర్తించి మార్కింగ్​ చేస్తున్నట్టు చెప్పారు. చెరువులు కబ్జాలకు గురైనట్టు తేలితే స్థానిక సంస్థలకు సమాచారం ఇస్తున్నామన్నారు. దీని ఆధారంగానే వారు నోటీసులు ఇవ్వడమో లేక కూల్చడమో చేస్తారంటున్నారు. చెరువుల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఇండియన్ ​రిమోట్​సెన్సింగ్​ (ఐఆర్ఎస్​) ఏజెన్సీ నుంచి కూడా వివరాలు సేకరిస్తోందన్నారు. ఈ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం జీహెచ్​ఎంసీ పరిధిలోనే 60 చెరువులు ఆక్రమణలకు గురైనట్టు తేలిందంటున్నారు. అలాగే అనేక చెరువుల రూపురేఖలు మారిపోయినట్టు కూడా గుర్తించామన్నారు. రాబోయే రోజుల్లో హెచ్ఎండీఏ పరిధిలోని మరిన్ని చెరువులపై సర్వే చేస్తామని కూడా అధికారులు తెలిపారు.