దీపావళి దీపాలు.. త్రిమూర్తులకు ప్రతీక.. పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసా..

Diwalai Special 2023: భారతదేశంలో దీపావళి పండగను చాలా గొప్పగా జరుపుకొంటారు. ఈ పండగ వెనక చాలా కథలు ఉన్నాయి. దీపావళి పండగ ప్రాముఖ్యతను, వెనక ఉన్న కథలను  ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 

దీపావళి పండుగ  చీకటి నిరాశానిస్పృహలు, అజ్ఞానానికి గుర్తు. కాంతి ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోనికి పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలనేది దీపాళి పండుగ ఉద్దేశం అని పండితులు చెబుతున్నారు. దీపం ఐశ్వర్యం అయితే, అంధకారం దారిద్ర్యం. దీపం ఉన్నచోట జ్ఞానసంపద ఉంటుంది. దీపం సాక్షాత్తూ లక్ష్మీదేవి. దీపావళినాడు దీపలక్ష్మి తన కిరణాలతో జగత్తునంతటినీ కాంతిమయం చేస్తుంది. దీపలక్ష్మికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తే సకల సంపదలూ లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 

త్రిమూర్తులుకు ప్రతీక

దీపం జ్ఞానానికి ప్రతీక. ఏ శుభకార్యం జరిగినా ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేయడం అనేది మన దేశంలో సంప్రదాయం. దీపకాంతిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా పేర్కొంటారు. దీపంలో కనిపించే ఎర్రని కాంతి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, నీలి కాంతి విష్ణు భగవానునికి, తెల్లని కాంతి పరమశివుడికి ప్రతినిధులని చెబుతారు.

ఆశ్వయుజ బహుళ చతుర్దశి, మర్నాడు అమావాస్య, మూడోరోజు కార్తిక శుద్ధ పాడ్యమి- దక్షిణ దేశాన పండుగ రోజులు. వీటిలో మొదటిది నరక చతుర్దశిగాను, రెండోది దీపావళి అమావాస్యగాను, మూడోరోజు బలిపాడ్యమిగాను పాటించడం దక్షిణాదిన ఆనవాయితీగా వస్తోంది.  నరకాసుర సంహార గాథ, బలిచక్రవర్తి రాజ్యదానం, విక్రమార్కుడి పట్టాభిషేకం దీపావళిపండుగతో ముడిపడి ఉన్నాయి. ఉత్తర భారతంలో చతుర్దశికి ముందురోజు ధనత్రయోదశి, ఇటు పాడ్యమి మర్నాడు యమద్వితీయ చేరి దీపావళి ఐదు రోజుల పండుగ అయింది.

ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ.. మొత్తం ఐదు రోజులూ వరుసగా పండుగలు జరుపుకుంటారు. ధనత్రయోదశినే 'ధన్‌తేరస్‌' అని, యమత్రయోదశి అనీ వ్యవహరిస్తారు. రావణ సంహారానంతరం రాముడు అయోధ్యకు చేరి, భరతుడిని కలిసింది దీపావళి రోజునే అని నమ్మకం. దాన్ని “భరత్‌మిలాప్‌” పేరుతో జరుపుకోవడం ఉత్తరాదివారి ఆచారం. దీపావళికి దేశమంతటా ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తుంది. దానికి ముఖ్య కారణాల్లో మొదటిది పర్వదిన సంప్రదాయం.

భారతీయులకు ప్రతి సందర్భంలోనూ అభ్యంగనస్నానం, దీపారాధనం తప్పనిసరి ఆచారాలు. ముఖ్యంగా నరకచతుర్దశి, దీపావళినాడు. చతుర్దశినాడుగాని, అమావాస్యనాడు గానీ స్వాతి నక్షత్రం రావడం మరింత ప్రత్యేకం. అది చాలా యోగదాయకం. స్వాతీ నక్షత్రం కలిస్తేనే దీపావళిగా పిలవాలని ఒక సిద్ధాంతం. స్వాతీ నక్షత్రం వాయుదేవతాకం. రవిచంద్రులు స్వాతీ నక్షత్రయుతులు కావడాన్ని తేజోవాయు సంయోగకాలంగా పరిగణిస్తారు. అదే కారణంగా జలతత్తానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఆవేళ- అభ్యంగన స్నానం విశేష ఫలాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

దీపావళి అమావాస్య

రావణాసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. అనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.

నరకాసుర సంహారం

ఇక రెండో కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుంటారు. నరకాసురుడు బ్రహ్మదేవుని నుంచి పొందిన వర గర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శ్రుతి మించడంతో సత్యభామ సమేతుడైన కృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.

లక్ష్మీదేవి ఆవిర్భావం

మూడో కథగా పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

మహాభారత వృత్తాంతం

నాలుగో కథగా.. మహాభారతంలోని ఇతివృత్తాన్ని చెబుతారు. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళ అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం ముగించుకొని తమ రాజ్యానికి తిరిగివస్తారు. అ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.

నరకచతుర్ధశి  గురించి..

ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధుజనాలను పీడిస్తూ దేవ, మర్త్యలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసురసంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు.అతడు లోకకంటకుడైనాడు. తల్లి తన బిడ్డలను ఎప్పుడూ చంపుకోదు కనుక తనకు తల్లి చేతిలోనే మరణించేలా వరాన్ని పొందుతాడు నరకుడు.

మహావిష్ణువు- భూదేవి ద్వాపరయుగంలో కృష్ణ- సత్యభామలుగా జన్మిస్తారు. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలివెళ్తాడు శ్రీ కృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. అతను తన పుత్రుడని తెలుసుకున్న సత్యభామ తన పుత్రునిపేరు కలకాలం నిలిచి ఉండేలా చేయమని ప్రార్థించడంతో అ రోజు నరకచతుర్దశిగా పిలవబడుతుందని వరం ప్రసాదిస్తాడు కృష్ణుడు.

నరకుని చెర నుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్యనాడు చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలను వెలిగించి బాణసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి.