వనపర్తి జిల్లాలో..అచ్చం అదే రూపంలో..రంగనాథ స్వామి

రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు చాలామంది తమిళనాడుకు వెళ్తుంటారు. కానీ.. మన రాష్ట్రంలో కూడా ఆ స్వామి కొలువై ఉన్నాడు. శ్రీరంగ పట్టణంలోని ఆలయానికి ఏ మాత్రం తీసిపోని ఆ ఆలయం వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో ఉంది. స్వామి కొలువై ఉండడం వల్ల ఈ ఊరి ప్రజలు హోలీ పండుగను దేశమంతా చేసుకున్న తర్వాత రోజు చేసుకుంటారు. దాదాపు ఐదు వందల ఏండ్ల క్రితం కట్టిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఆలయాన్ని కట్టించిన రాజ వంశీయులే ఏటా ఉత్సవాలు జరిపిస్తున్నారు. 

అవతారపురుషుడు మహావిష్ణువు తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథ స్వామిగా దర్శనమిస్తాడు. అచ్చం అదే రూపంలో వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో ఉన్న ఆలయంలో కూడా దర్శనమిస్తున్నాడు . ఆధ్యాత్మిక, కళాపోషణకు నిలయమైన ఈ ఆలయం తెలంగాణలో ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచింది. ఇక్కడ శ్రీరంగనాథస్వామిని దర్శించుకుంటే.. పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. ఈ ఆలయం నిర్మించి, స్వామిని ప్రతిష్ఠించిన నాటి నుంచి ప్రతి ఏడాది తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ ఆలయాన్ని నిర్మించిన వనపర్తి సంస్థాన రాజవంశీయుల ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రంగనాథుడి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో పాటు పదిహేను రోజుల జాతర  చేస్తారు. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి కళ్యాణం జరగ్గా, ఈ రోజు 24న అంగరంగ వైభవంగా స్వామి వారి రథోత్సవం జరుగుతుంది.

రాజుకి కలలో...

వనపర్తి సంస్థానాధీశుడైన బహిరి అష్టబాషి  గోపాలరావు15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కట్టించాడు. స్వతహాగా ఆయన కవి. ఎనిమిది భాషలపై పట్టున్న బహుముఖ సాహితీ ప్రియుడు. దక్షిణ భారతదేశంలోని చాలా పుణ్యక్షేత్రాలని చాలావరకు దర్శించుకున్నాడు. అలా పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా.. తమిళనాడులోని శ్రీరంగం చేరుకున్నాడు. అక్కడ రంగనాయకులు కొలువైన క్షేత్రాన్ని చూశాడు. ఆ ఆలయ నిర్మాణం, శిల్పకళకు ముగ్ధుడైన ఆయన  ప్రతి ఏడాది శ్రీరంగ రంగనాథస్వామిని దర్శించుకోవడం మొదలుపెట్టాడు. కొన్నేండ్ల తర్వాత రాజుకి వయసు మీదపడింది. దాంతో వనపర్తి సంస్థానం నుంచి శ్రీరంగం వెళ్ళడానికి ఆరోగ్యం సహకరించలేదు.

వయసు రీత్యా శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోలేక పోయానని బాధపడుతుండేవాడు. అప్పుడు రంగనాథస్వామి  స్వయంగా రాజు కలలో కనిపించి ‘‘నీ రాజ్యంలోని సంకిరెడ్డిపల్లి గ్రామ అడవిలో ఉన్న ఒక పుట్టలో నేను కొలువుదీరి ఉన్నా. నువ్వు చింతించకు” అని చెప్పాడు. ఆ స్థలంలో వెతికితే రంగనాథ స్వామి విగ్రహం కనిపించింది. వెంటనే వనపర్తికి దగ్గర్లో అప్పట్లో కొరివిపాడుగా పిలిచే నేటి శ్రీరంగాపురం గ్రామంలో ఆలయాన్ని కట్టారు. తర్వాత సంకిరెడ్డిపల్లి నుంచి స్వామి విగ్రహాన్ని  తీసుకొచ్చి శ్రీరంగాపురంలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత గోపాలరావు కొరివిపాడు గ్రామాన్ని శ్రీరంగాపురంగా మార్చాడు.

శిల్ప కళా వైభవం

సుమారు 600 మంది శిల్పులు, కళాకారులు, ఆగమశాస్త్ర పండితులు, వేలాది మంది కార్మికులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం కృష్ణ, తుంగభద్ర నదీతీరాల్లో ప్రత్యేకంగా దొరికే ఇసుక రాయిని వాడారు. తమిళనాడులోని తంజావూరు, తిరుచునాపల్లి(శ్రీరంగం), కంచి, తిరువనంతపురం నుంచి వచ్చిన శిల్పులు అద్భుతమైన శిల్పాలు చెక్కారు.

ఎత్తైన గాలిగోపురాలు

ఆలయంలోకి వెళ్లే ముందు పెద్ద రాజగోపురం దర్శనమిస్తుంది. ఈ గోపురం ఐదు అంతస్తులతో 60 అడుగుల ఎత్తు, 20 అడుగుల ద్వారంతో నిర్మించారు. మొదటి అంతస్తు నుంచి క్రమ పద్ధతిలో రామాయణం, క్షీరసాగర మధనం, శ్రీకృష్ణుడి జీవితం, ఉగ్ర నరసింహావతారం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి.. దేవతామూర్తుల విగ్రహాలు అందంగా చెక్కారు. వీటితో పాటు ముగ్గురు రెడ్డి రాజుల వంశస్తుల శిల్పాలు, శ్రీరాముడి పట్టాభిషేకం తదితర సన్నివేశాల చిత్రాలు కనువిందు చేస్తాయి. రాజ గోపురంపై బంగారు పూతతో కూడిన ఏడు కలశాలు కనిపిస్తాయి. చిన్న గాలి గోపురం కూడా మూడు అంతస్తుల్లో నిర్మించారు. దీన్ని ఐదు బంగారు కలశాలు, కొన్ని చిత్రాలతో అందంగా మలిచారు.

తంజావూరు చిత్రాలు

తిరుమల, తమిళనాడులోని తంజావూరులోని స్వర్ణకారులు, చిత్రకారులు రకరకాల లోహాలతో, నవరత్నాలతో ఏళ్ళతరబడి దశావతారం, ఇతర ఆధ్యాత్మిక రూపాలను తయారుచేశారు. ఆలయానికి వెనక వైపు మూడు అంతస్తుల్లోని నేలమాళిగలో తంజావూరు చిత్రపటాలు ఉన్నాయి.

స్వామి తేరు

దాదాపు 40 అడుగుల ఎత్తులో నాలుగు రాతి చక్రాలు, పూర్తి టేకు చెక్కతో స్వామి రథం తయారుచేశారు. స్వామి కళ్యాణం జరిగిన మూడో రోజు పుబ్బనక్షత్రంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రావణమాసంలో గోదారంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు. ఆ తర్వాతి రోజు30 అడుగుల మరో రథంపై స్వామిని ఊరేగిస్తారు.

ఆలయం చుట్టూ చెరువు

శ్రీరంగంలో ఉండే కావేరి నదిలాగే శ్రీరంగపురం రంగనాథస్వామి ఆలయం చుట్టూ నది లాంటిది ఉండాలని రాణీ శంకరమ్మదేవి ఆలయం చుట్టూ రంగ సముద్రాన్ని తవ్వించారు. నీటి మధ్యలో సేద తీరేందుకు ‘కృష్ణ విలాస్’​ అనే భవనాన్ని కట్టారు. ఆమె మనవడైన కృష్ణదేవరాయ పేరు మీద కృష్ణ విలాస్​ కట్టించినట్లు చరిత్ర చెప్తుంది. ఆనాటి ఫొటోల్లో చూస్తే.. ఈ భవనం ‘పాతాళభైరవి’ సినిమాలోని మాయా మహల్‌‌‌‌‌‌‌‌లా కనిపిస్తుంది. మెయింటెనెన్స్‌‌‌‌ లేక శిథిలావస్థకు చేరింది. ఇప్పుడు గోడలు మాత్రమే మిగిలాయి. చెరువును గతంలో1.89 టీఎంసీల నీటి నిల్వతో రంగసముద్రం బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా మార్చారు. 

ఉత్తర ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి రోజున ఆలయ ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. తెల్లవారు జామునే భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. సూర్యోదయ కాలంలో దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రం చెప్తుంది. ఈ దర్శనం తర్వాత పదిరోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం అధ్యయనోత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు.

ఉత్సవ వాహనాలు

తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి ఉత్సవ వాహనాల్లాగే అచ్చు గుద్దినట్లుగా ఇక్కడ స్వామి ఉత్సవ వాహనాలు ఉంటాయి. శేషవాహనం, హన్మత్ వాహనం, గరుడవాహనం, గజవాహనం, అశ్వవాహనం, సూర్య, చంద్ర ప్రభ వాహనాలు ఉన్నాయి. రథోత్సవంతో పాటు మరికొన్ని సందర్భాల్లో తిరు వీధుల్లో ఈ వాహనాల మీద భక్తులకు దర్శనమిస్తాడు రంగనాధుడు.

హోలీ పండుగ నిషేధం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి కంకణబద్ధుడై ఉంటాడు. కాబట్టి కామదహనం (హోలి) ఇక్కడ  నిషేధం. అందుకే ఏటా దేశమంతా హోలి పండుగ చేసుకున్న తర్వాతి రోజు శ్రీరంగపురం గ్రామ ప్రజలు చేసుకుంటారు. దీనికి మరో కారణం కూడా చెప్తారు. రథోత్సవం రోజే హోలీ పండుగ కావడంతో... హోలీ ఆటలో పడి రథోత్సవం టైంకి భక్తులు రాలేకపోయేవాళ్లు. దాంతో రథోత్సవానికి హోలీ పండుగ అడ్డు రాకూడదని రథోత్సవం రోజు కాకుండా మరుసటి రోజు ఈ గ్రామ ప్రజలు హోలీ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాత్రం రథోత్సవం తరువాతి రోజు హోలీ పండుగ వచ్చింది!

రత్న పుష్కరిణి

ఆలయానికి 200 మీటర్ల దూరంలో నక్షత్ర ఆకారంలో పూర్తిగా రాళ్లతో ఈ బావి కట్టారు. గుండుబావి (రత్నపుష్కరిణి) అని పిలిచే ఈ కోనేటిలో ఇప్పటివరకు నీళ్లు ఎండిపోలేదు. ప్రస్తుతం ఇది రంగ సముద్రంలో కలిసిపోయింది. ఒకప్పుడు ఈ ఊరివాళ్లు రత్నపుష్కరిణి నీళ్లే తాగేవాళ్లు.

ఇలా వెళ్లాలి

నేషనల్​ హైవే– 44కి సమీపంలో ఉండే ఈ ఆలయానికి రావడం చాలా సులభం. హైదరాబాద్​ నుంచి 150 కిలో మీటర్లు జర్నీ చేస్తే.. వనపర్తి వస్తుంది. అక్కడినుంచి 24 కిలోమీటర్లు వెళ్తే.. ఆలయాన్ని చేరుకోవచ్చు. కర్నూలు​ నుంచి  వెళ్లాలంటే55 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్, కర్నూల్‌‌‌‌, వనపర్తి.. ఎటువైపు నుంచి వచ్చినా 44వ నేషనల్​ హైవేపై ఉన్న పెబ్బేరు పట్టణానికి చేరుకోవాలి. పెబ్బేరు నుంచి12 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగాపురం ఉంది. పెబ్బేరు నుంచి ఆర్టీసీ బస్సు, ప్రైవేట్​ వాహనాలు ఉంటాయి. 

- కేశపాగ శ్రీనివాస్​, శ్రీరంగాపూర్