అమెరికాలో మొదలైన ఒక చిన్న కంపెనీ. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలకు విస్తరించింది. అంతలా ఆదరణ తెచ్చుకుందంటే.. నిత్యావసర వస్తువు అయిఉండొచ్చు అనుకుంటే పొరపాటే. ఆ కంపెనీ అమ్ముతున్నది ఆలుగడ్డ చిప్స్! అయినా.. ఎందుకంత సక్సెస్ అయ్యిందంటే? అనేక కారణాలు ఉన్నాయి. ఇంట్లో తయారుచేసుకోవడానికి వీలున్నా, లోకల్ మార్కెట్‌లో అలాంటి చిప్స్ దొరుకుతున్నా.. అంతకంటే ఎక్కువ ధర పెట్టి మరీ లేస్ చిప్స్ తింటున్నారు జనాలు. అంతెందుకు అమెరికా లాంటి దేశాల్లో ఆలు చిప్స్‌కి పర్యాయ పదం ‘లేస్’.
రుచికరమైన ఆలుగడ్డ చిప్స్... సిగ్నేచర్ క్రింకిల్ కట్... ప్యాకేజింగ్ టెక్నిక్స్... ఆకట్టుకునే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల ప్రపంచంలోనే ఎక్కువమంది ఇష్టపడే స్నాక్ బ్రాండ్స్‌లో ఒకటిగా ఎదిగింది లేస్. ప్రపంచంలోని అతిపెద్ద ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీల్లో ఒకటైన పెప్సికో కంపెనీకి ‘లేస్’ అనుబంధ సంస్థగా ఉంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది. దశాబ్దాల పాటు క్రియేటివిటీతో అడ్వర్టైజ్మెంట్స్ తీస్తూ.. ఎప్పటికప్పుడు వెరైటీ ఫ్లేవర్స్ తెస్తూ టాప్‌లో ఉంది.
ఇంతగా పాపులర్ అయిన లేస్ కంపెనీ చరిత్ర1932లో మొదలైంది. హెర్మాన్ లే అనే అతను అమెరికాలో ఒక ట్రావెలింగ్ సేల్స్‌మ్యాన్. అంటే ఊరూరా తిరుగుతూ శ్నాక్స్ అమ్మేవాడు. అలా కొన్నేళ్లపాటు సేల్స్‌మ్యాన్‌గా చేశాక తనే సొంతంగా శ్నాక్స్ తయారుచేసి, అమ్మాలి అనుకున్నాడు.
వెంటనే టెన్నెస్సీలోఉన్న నాష్‌విల్లేలో శ్నాక్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. మొదట్లో దుకాణం పెట్టేంత డబ్బు లేక.. తను తయారుచేసిన శ్నాక్స్‌ని కారు డిక్కీలో వేసుకుని ఊరూరా తిరుగుతూ కిరాణా షాపుల్లో అమ్మేవాడు. హెర్మాన్ అమ్మే ఆలుగడ్డ చిప్స్ రుచికరంగా ఉండడంతో అమ్మకాలు బాగా పెరిగాయి. దాంతో సప్లయ్‌కి మించి డిమాండ్ పెరిగింది. దాంతో ప్రొడక్షన్ పెంచాల్సి వచ్చింది. అందుకే లే 1938లో అట్లాంటాలోని ఒక పాత చిప్ ఫ్యాక్టరీ కొన్నాడు. ఆ కంపెనీకి ‘హెచ్‌డబ్ల్యూ లే అండ్ కంపెనీ’ అని పేరు పెట్టాడు. ప్రొడక్ట్‌కి తన పేరు నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ‘లేస్’ అని నామకరణం చేశాడు. అలా కంపెనీలో ప్రొడక్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి బిజినెస్‌ని బాగా విస్తరించాడు. దక్షిణ అమెరికా అంతటా సప్లయ్ చేయడం మొదలుపెట్టాడు.
ఫ్రిటో-లేగా...
ఆ తర్వాత ఇరవై ఏండ్లలో అమెరికా అంతటా లేస్ అమ్మకాలు మొదలయ్యాయి. కంపెనీని మరింత విస్తరించాలనే ఆలోచనతో1961లో అప్పట్లో అమెరికాలోని ప్రముఖ శ్నాక్ కంపెనీ ఫ్రిటోతో కలిసి ‘ఫ్రిటో-లే’గా ఏర్పాటు చేశారు. తర్వాత ఐదేండ్లలో కంపెనీ చాలా డెవలప్ అయ్యింది. ఆ తర్వాత అప్పటికే మంచి పేరున్న పెప్సికో ‘లేస్’ని కొనేసింది. అలా ప్రపంచ వ్యాప్తంగా లేస్‌ని మార్కెట్ చేయడానికి దారి పడింది. పెట్టుబడికి కొదువ లేకుండా పోయింది. క్రియేటివ్ మార్కెటింగ్, కొత్త ఫ్లేవర్స్ లాంచింగ్ లాంటివి చేసి బ్రాండ్ ఇమేజ్ బాగా పెంచారు.
మార్కెటింగ్
ఆలుగడ్డలు ప్రపంచమంతా దొరుకుతాయి. అన్ని చోట్లా వాటితో చిప్స్ తయారుచేసుకుంటారు. లోకల్‌గా చాలా కంపెనీలు అలా తయారుచేసిన చిప్స్‌ని తక్కువ ధరకే అమ్ముతుంటాయి. అయినా.. చాలా దేశాల్లో లేస్‌ని ఎందుకు ఇష్టపడుతున్నారు? అంటే.. లేస్‌లో దొరికే పలు రకాల ఫ్లేవర్స్, క్వాలిటీ. వీటితోపాటు బ్రాండ్ ఇమేజ్‌ని విపరీతంగా పెంచిన మార్కెటింగ్. లేస్ ఎప్పుడూ వెరైటీ యాడ్స్ చేస్తూ.. ప్రొడక్ట్‌ని మార్కెట్ చేస్తుంది. అదే దాని సక్సెస్‌కు ముఖ్య కారణం. దానివల్లే ఒక చిన్న లోకల్ కంపెనీగా మొదలైన లేస్ ప్రపంచ వ్యాప్తంగా చాలామంది నోళ్లలో కరకరలాడుతోంది.
ఇంటర్నేషనల్ పవర్‌హౌస్‌గా మారే దశలో కంపెనీ ఎన్నో జిమ్మిక్స్ చేసింది. అందుకే 1940 నుండి ఇప్పటివరకు చిప్స్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఒక సర్వేలో ఈ బ్రాండ్‌ని ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వాళ్లు ఇష్టపడుతున్నారని వెల్లడైంది. ఫ్రెండ్స్ గెట్-టుగెదర్లు, హౌస్ పార్టీలతో సహా ఏ చిన్న పార్టీ జరిగినా లేస్ ప్యాకెట్స్ ఓపెన్ కావాల్సిందే. ముఖ్యంగా మన దేశంలో వీటిని ఎక్కువగా ఇష్టపడడానికి కారణం.. చిప్స్ పెద్దగా ఉండడం, రుచితోపాటు వాటిని తిన్నప్పుడు వచ్చే కరకరమనే సౌండ్ ఎక్స్‌పీరియెన్స్.
రెండొందల రుచులు
అమెరికాలో టొమాటో ఫ్లేవర్డ్ లేస్ తిన్నవాళ్లు.. అదే ఫ్లేవర్డ్ లేస్‌ని ఇండియాలో తింటే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే.. లేస్ ఏ దేశంలో ప్రజల టేస్ట్‌కు తగ్గట్టుగా ఆ దేశంలో ఫ్లేవర్స్ తెస్తుంటుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నవాళ్లయినా లేస్‌ని ఇష్టపడాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 200లకు పైగా ఫ్లేవర్స్ అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. వాటిలో కూడా ప్రాంతాల వారీగా రుచిలో కాస్త తేడా ఉంటుంది. బార్బెక్యూ, లెమన్, క్రీమ్, ఆనియన్ చిప్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇలా ఫ్లేవర్స్‌ని తీసుకురావడానికి ఎన్నో రకాల మార్కెట్ రీసెర్చ్, సర్వే చేస్తుంటుంది కంపెనీ.
డూ అజ్ ఏ ప్లేవర్
ఎవరికి కావాల్సిన ఫ్లేవర్‌ని వాళ్లే సెలక్ట్ చేసుకునేందుకు కంపెనీ ‘డు అజ్ ఎ ఫ్లేవర్’ పేరుతో ఒక క్యాంపెయిన్ నిర్వహించింది. 2012 జులైలో పెట్టిన ఈ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటంటే... దేశంలో ఎవరైనా లేస్‌కి కొత్త ఫ్లేవర్‌ని సజెస్ట్ చేయొచ్చు. ఆ ఫ్లేవర్ యునిక్‌గా ఉండి, అందరికీ నచ్చేలా ఉండి, తయారుచేసేందుకు ఈజీగా ఉంటే.. దాన్ని కంపెనీ తీసుకుంటుంది. తర్వాత ఆ ఫ్లేవర్‌ని మార్కెట్‌లోకి తెస్తారు. అలా ఇప్పటివరకు దాదాపు 22 రకాల కొత్త ఫ్లేవర్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. వాటిలో చాలావరకు సక్సెస్ అయ్యాయి. లేస్ మార్కెట్‌ని పెంచాయి.
వాణిజ్య ప్రకటనల్లో...
టీవీల్లో కమర్షియల్ యాడ్స్ మొదలైనప్పటినుంచి యాడ్స్ చేస్తోంది లేస్. ‘‘లేస్ పొటాటో మేక్ ఎ మీల్ ఫర్ లంచ్!” లాంటి క్యాప్షన్స్‌తో ప్రకటనలు ఇవ్వడంతో చాలామందిని ఆకట్టుకుంది. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ టీవీ షోలకు స్పాన్సర్‌గా ఉంది. టీవీల్లోనే కాదు.. అంతకుముందు రేడియోల్లో కూడా ప్రకటనలు ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇస్తోంది. లేస్ యాడ్స్ కూడా వెరైటీగా ఉంటాయి. ప్రముఖుల ఎండార్స్‌మెంట్స్, ఈవెంట్ స్పాన్సర్‌షిప్స్ చేస్తుంటుంది. అలియా భట్, రణ్‌బీర్ కపూర్, జుహీ చావ్లా, పరిణీతి చోప్రా, రొనాల్డో
వసీం అక్రమ్‌ల లాంటి వాళ్లంతా లేస్ పొటాటో చిప్స్ ప్రమోట్ చేసినవాళ్లే. అంతేకాదు.. మనిషి నవ్వే బొమ్మను పెదాల వరకు లేస్ ప్యాకెట్ల మీద ప్రింట్ చేసింది. ఆ ఎడిషన్ చాలా సక్సెస్ అయ్యింది. ఆ బొమ్మల కోసం కూడా చాలామంది లేస్ ప్యాకెట్స్ కొన్నారు. అంతేకాదు.. ఆ ప్యాకెట్స్‌ను ముఖానికి దగ్గరగా పెట్టుకుంటే కస్టమర్ నవ్వుతున్నట్లు కనిపిస్తాడు. అలా పెట్టుకుని ఫొటోలు తీసి పంపాలని కంపెనీ కస్టమర్లకు చెప్పింది. ఆ ఫొటోలను వెబ్‌సైట్‌లో ఫొటో మాంటేజ్‌లో పెట్టింది.
రైతులతో వివాదం
ఇండియాలో చాలా సక్సెస్ అయినప్పటికీ ఒకసారి పెద్ద వివాదంలో చిక్కుకుంది లేస్ కంపెనీ. లేస్ చిప్స్ తయారీకి ‘ఎఫ్‌సీ-5’ అనే ఒక ప్రత్యేకమైన ఆలుగడ్డ వంగడాన్ని మాత్రమే వాడుతుంది. అందుకోసం ఆ విత్తనాలను రైతులకు ఇచ్చి, వాటి సాగు విధానం మీద అవగాహన కల్పిస్తుంది. అలా కంపెనీతో ఒప్పందం చేసుకున్న రైతులు కంపెనీ ఇచ్చిన మార్గదర్శకాలు పాటించి, పండించి కంపెనీకే అమ్మాలి. వాటితోనే కంపెనీ చిప్స్ తయారు చేస్తుంది. లేస్ కంపెనీ పండించే ఈ ఎఫ్‌సీ-5 ఆలుగడ్డలను ఇండియాలో కొందరు రైతులు పండించారు. దాంతో కంపెనీ ఆ రైతులపై కోర్టులో దావా వేసింది. ఎందుకంటే.. కొన్ని దేశాల్లో ఈ రకం ఆలుగడ్డలను లేస్ మాత్రమే సాగు చేయడానికి పేటెంట్ తీసుకుంది.
ఈ దావా వేశాక రైతులకు మద్దతుగా కొంతమంది సామాజిక కార్యకర్తలు, మహిళలు ముందుకు వచ్చారు. అయితే, భారతదేశ చట్టాల ప్రకారం మొక్కలు, విత్తనాలకు ఎలాంటి మేధో రక్షణ హక్కులను కల్పించడానికి వీల్లేదు. అంటే పంటలు, విత్తనాలకు ఎలాంటి పేటెంట్ ఉండదు. ఎవరైనా, ఎక్కడైనా పండించుకోవచ్చు. అందుకే సుప్రీం కోర్టు ఈ కేసును కొట్టేసింది.
ఉచితంగా లేస్
ఇప్పుడంటే ఇండియాలో లేస్ గురించి తెలియని దుకాణదారుడు లేడు. కానీ.. ఏ దేశంలో అయినా కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయినప్పుడు.. ఆ ప్రొడక్ట్ కొంటే కచ్చితంగా అమ్ముడుపోతుంది అనే నమ్మకం షాపుల వాళ్లకు కలగాలి. అందుకే లేస్ మార్కెట్‌లోకి వచ్చిన కొత్తలో దుకాణదారులకు ఉచితంగా కొన్ని శాంపిల్స్ ఇచ్చింది. వాటిలో కొన్ని తిని, మరికొన్ని అమ్మి కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకుని వాళ్లు బాగున్నాయంటేనే మరిన్ని కొనమని చెప్పింది. ఇలాంటి మార్కెటింగ్ వ్యూహాలు కూడా లేస్ సక్సెస్‌కు కారణమయ్యాయి.
ప్యాకింగ్
లేస్‌ని ఎక్కువమంది ఫ్లేవర్‌తోపాటు క్రంచీనెస్ కోసం తింటుంటారు. ప్యాకెట్లోని ఆలు చిప్స్ అంత క్రంచీగా ఉండేందుకు కారణం.. ప్యాకింగ్. ప్యాక్‌లో ఉండేది కొన్ని చిప్స్ అయినా పెద్ద ప్యాకెట్‌లో వేస్తారు. ప్యాకెట్ నిండా గాలి(నైట్రోజన్ ) నింపుతారు. దానివల్ల ఫుడ్ రంగు, టేస్ట్ మారవు. ప్యాకెట్ నిండుగా గాలి ఉండడం వల్ల ఏదైనా వస్తువు ప్యాకెట్ మీద పడినా లోపల ఉన్న చిప్స్ విరిగిపోవు. పేద, మధ్య తరగతి నుంచి డబ్బున్నవాళ్ల వరకు అందరి కోసం ప్రత్యేకమైన ప్యాక్స్‌లో దొరుకుతాయి.