Father Day Special : నాన్న ప్రేమ అప్పుడు తెలుస్తది.. ఫాదర్స్ డే చరిత్ర ఇదీ..!

నాన్న ప్రేమ అప్పుడు తెలుస్తది

చానా మందికి ‘నాన్న' అయినంకనే 'నాన్న' విలువ తెలుస్తది. ‘ఇన్ని బాధలు, బాధ్యతల్ని ఎట్ల మోసిండు ? పిల్లలు చేసే అల్లరి, వాళ్లకు కొంచెం సుస్తీ చేసినా గుండెలో అలజడి ! ఇవన్నీ ఎట్లా భరించిండు?' అని నాన్న అయినంకనే ప్రశ్నించుకుంటరు. అప్పుడే అర్థమైతది.. ‘నాన్న వేసిన బాటలో నా అడుగులు పడుతున్నయ్ ' అని... ఆ టైంలో నాన్న వైపు చూస్తే.. ‘నా పిల్లల కోసం ఈ గ్రేట్ మ్యాన్ ఇప్పుడు తాతగా మారిండు. చిన్నపిల్లాడిలా వాళ్లని ఆడిస్తున్నడు. కథలు చెప్తూ బుద్ధులు నేర్పుతున్నడు. తన బిడ్డకు కష్టం రావొద్దని.. మళ్లీ నా కష్టాన్ని పంచుకుంటుండు' అనిపిస్తది. ఇది నాన్న గొప్పతనం!


జీవితంలో ఎవరికైనా నాన్నే రియల్ హీరో! ఈ ముచ్చట ప్రపంచానికి తెల్వదు కానీ, ప్రతి ఒక్కరి మనసుకు తెలుసు. ఎవరి నాన్న వాళ్లకు గ్రేట్! చిన్నప్పుడు స్కూల్లో ' మా నాన్న సూపర్ హీరో అంటే మా నాన్న సూపర్ హీరో" పోటీపడి కథలు చెప్పుకుంటరు. 'మా నాన్నకు మస్తు బలం ఉంటదిరా భయ్.. పెద్దగైనంక నేను కూడా మా నాన్నలెక్కనే అయిత' అని అంటరు. నాన్న ప్రభావం అట్ల ఉంటది మరి. అడిగింది తెచ్చిస్తాడు. ఏ ప్రశ్న అడిగినా ఒడిలో కూసబెట్టుకుని చెప్తడు. పదోతరగతి వరకు నాన్న నాన్నలాగ కనిపిస్తడు. ఆ తర్వాత నాన్నలో ఒక మంచి దోస్తును చూస్తం. ఏ దారి ఎట్లాంటిదో వివరించి చెప్తాడు. ఆ వయసులో చిన్న చిన్న విషయాలకే చిరాకు పడ్తున్నా.. కూల్ గా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆయనొక గొప్ప సైకాలజిస్ట్ గా కనిపిస్తడు. 

నాన్న ప్రేమ అర్థం కాదు.

 తీట పని చేసినప్పుడు 'వీపు వాయించు" అని ఏదో మీది మాటకు అమ్మతో అని వెనకేసుకొస్తడు. అది పెద్ద తప్పులాగ అనిపిస్తే మాత్రం కసిరిస్తడు. అదే మాట కసిరింపు అమ్మ నోట్లో వస్తే పట్టించుకోరు. కానీ, నాన్న నోట్లో కెల్లి వస్తే మాత్రం కోపం, దుఖం తెచ్చుకుంటరు. అమ్మ ఎంత తిట్టినా బాధపడరు కానీ, నాన్న ఓ మాట అంటే చాలు నొచ్చుకుంటరు. నాన్న ప్రేమ అర్థం కాదు. తల్లి ప్రేమలా అది స్పష్టంగా బయటకు కనవడదు. ఎవరన్నా తన పిల్లలను పొగుడుతున్నప్పుడు లోలోపల ఆనందపడుతూనే.. వాళ్లతో 'చాలు తీ' అని ఇష్టం లేనట్టు నటిస్తడు! దిష్టి తగుల్తదనేమోనని తన పిల్లలను ఎక్కువగా పొగడనియ్యడు! 

ఏం కోరుకుంటాడు?

తన పిల్లల్ని గొప్ప స్థానంలో చూడాలనుకుంటడు నాన్న. దానికోసం ' నేనేం అయిపోయిన పర్వాలేదు' అని తన జీవితాన్ని త్యాగం చేస్తడు. లాస్ట్కు సాధించినా.. సాధించకున్నా ఆయన కోరుకునేది ఒక్కటే! 'నాన్న' అనే పిలుపు. ఇది తల్లికి కూడా వర్తిస్తది. ఆ పిలుపు కోసమే వాళ్లు అన్నీ త్యాగం చేస్తరు. కాబట్టి ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా అప్పుడప్పుడు వాళ్ల కళ్లకు కనిపించి పోవాలె. రోజూ కనీసం ఫోన్లోనైనా వినిపిస్తుండాలె!

ఫాదర్స్ డే వెనుక

సొనరాది అమెరికాలోని వాషింగ్టన్ పక్కన చిన్న గ్రామం. ఆమెకు ఆరు నెలల వయసున్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి స్మార్ట్ విలియమ్ వ్యవసాయం చేస్తూ తల్లి లేని లోటు తెల్వకుండ ఆమెను పెంచిండు. పాలు పట్టడం, స్నానం చేయించడం, జోలపాడి నిద్రపుచ్చడం.. అన్నీ చేసిండు. ఆ టైంలో ఇంకో పెండ్లి చేసుకునే అవకాశం ఉన్నా.. తన సుఖం కన్నాతండ్రి పాత్రకు న్యాయం చెయ్యాలనుకుండు. తల్లి అనే ఊహ కూడా రానియ్యకుండ పెంచిండు.

పెద్దగైనంక వాళ్ల నాన్న ఎంత గొప్ప వ్యక్తో గుర్తించింది. సొనరా. 'మా నాన్న గ్రేట్ ఫాదర్ ' అని ఆయన పుట్టిన రోజును 'ఫాదర్స్ డే'గా జరపాలనుకుంది. వాళ్ల నాన్న జూన్లో పుట్టిందని తెలుసుగానీ, ఎప్పుడు పుట్టిందో తెల్వదంట. అందుకే జూన్లో ఏదో ఒక రోజు జరపాలని జూన్ మూడో ఆదివారం గ్రామస్తులందరిని పిలిచి 'ఫాదర్స్ డే' నిర్వహించింది. తర్వాత 'తల్లుల కోసం ఒక రోజు కేటాయించినప్పుడు.. తండ్రుల కోసం ఎందుకు కేటాయించరు?' అని పోరాటం మొదలుపెట్టింది సొనరా. దాంతో 1910 జూన్ 19న ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో ఫాదర్స్ డే వేడుకలు జరిపిను. అదే కాలక్రమంలో ప్రపంచమంతా పాకింది.

2024లో జూన్ 16వ తేదీన ఫాదర్స్ డే జరుపుకుంటుంది ప్రపంచం...