Dasara Special 2024: దసరా పండుగ వెనుక పురాణ కథ ఇదే..

దసరా పండుగ అంటే దేవీ నవరాత్రులే ముందుగా గుర్తుకొస్తాయి. దసరా పండుగకు ఎక్కువమంది గుర్తు తెచ్చుకునే పురాణ కథ కూడా మహిషాసుర మర్దిని కథే. మహిషాసురుడు ఒక భయంకరమైన రాక్షసుడు. దేవతలతోనే యుద్ధం చేసి వాళ్లను ఓడించి స్వర్గలోకంలో ఇంద్రుడి పదవిని చేపడతాడు మహిషాసురుడు .  ఆ తర్వాత అతను ఈ విశ్వాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మహిషానురుడి బాధ నుంచి లోకాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు వచ్చిన కోపమే ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తి ఒక స్త్రీ రూపమై జన్మిస్తుంది. 

త్రిమూర్తులలో ఒకరైన శివుని శక్తి ముఖంగా, విష్ణువు శక్తి భుజాలు, చేతులుగా, బ్రహ్మశక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసురుడిని చంపే శక్తి అవుతుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశాన్ని ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కో ఆయుధాన్ని అందించి మహిషాసుర మర్దినీ దేవిని యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో మహిషాసురుడితో భీకరమైన పోరు జరిపి అతడిని చంపేస్తుంది. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగానే ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి రోజున  ( అక్టోబర్​ 12) దసరా పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం 'మహిషాసుర మర్దిని' రూపమే.

మహిషాసుర మర్దిని స్తోత్రం

మహిషాసురుడిని చంపిన మహిషాసుర మర్దినీ దేవీని దసరా రోజున పూజిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని మొక్కుతూ 'అయిగిరి నందిని' స్తోతం చదివితే కొత్త శక్తి వస్తుందని నమ్ముతారు. కేవలం దసరా పండుగ రోజనే కాకుండా, మామూలు రోజుల్లోనైనా జీవితంలో ఏదైనా నిరాశ కలిగినా, అనుకున్న పని చెయ్యలేకపోతున్నా అమ్మవారిని తలచుకొని, ఈ స్తోత్రం చదివితే కొత్త శక్తిని పొందొచ్చని చాలామంది నమ్ముతారు.

ALSO READ : ఆధ్యాత్మికం : వ్యామోహమే పెద్ద పద్మవ్యూహం.. ఆ మాయ నుంచి బయటపడలేమా..?

 అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే! 
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే!!
 భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే!
జయ జయ హె మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే!!

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. . సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో  దర్శనమిస్తుంది.మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.

–వెలుగు, దసరా ప్రత్యేకం–