హిందువులు ఎక్కువుగా ఇష్టపడే దైవం శ్రీరామచంద్రడు. భారతదేశంలోని ప్రతి పల్లెలో కూడా దాదాపు రామాలయం ఉంటుంది. ఇక పట్టణాల్లో అయితే నాలుగైదు గుళ్లు ఉంటాయి. అందరి కి ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు... దశాబ్దాలనాటి వివాదానికి తెరదించి అయోధ్య రామజన్మ భూమి రాముడిదే అంటూ తేలిన సందర్బంగా అక్కడ మందిరం నిర్మించి.. ఈనెల (జనవరి)22న శ్రీరామ చంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అసలు అయోధ్య పట్టణం ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏంటి...అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు అయోధ్య చరిత్ర గురించి తెసుకుందాం..
అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి... శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఈ అయోధ్య పురి. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్యపట్టణం. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా ఫైజాబాదుని ఆనుకుని... సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య నగరానికి శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది.
స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్షపురాణాలలో పుణ్య క్షేత్రాల్లో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి. వేదాలు.. పురాణాలు అయోధ్య నగరాన్ని దేవతలు నిర్మించారని ...అది స్వర్గంతో సమానమని.. అధర్వణ వేదంలో పేర్కొన్నట్లు పురాణాల్లో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
అయోధ్యను మొదట ఎవరు పాలించారు..
అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకుడు నిర్మించి పాలించాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృధువు వలన భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని పురాణాలు చెపుతున్నాయి. అనంతరం రాజు మాంధాత. .. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చరంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన వాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్యవాక్పరిపాలనతో ఘనతను తీసుకు వచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేసి... ఆ యాగంతో విఘ్నం వైదొలగించి ఆయన ముని మనుమడైన భగీరధుడు గంగానదిని విశేషప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. అనంతరం వచ్చిన రఘుమహారాజు రాజ్యావిస్తరణ చేసి పేరుగడించి సూర్యంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు. .. దశరథుడి కుమారుడు రామచంద్రుడు.
ఆయోధ్య చరిత్ర
అతిపురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. ఈ నగరం గంగానదీ తీరంలో ....సరయూనది కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగరవైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకుడు కోసలరాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మికి రచించిన రామాయణ మాహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్యవైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. తులసీ దాసు తిరిగి రచించిన రామచరితమానస్‍లో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది. తమిళకవి కంబర్ వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బహుబలి, సుందరి, పాడలిప్తసురీశ్వరి, హరిచంద్ర, అచలభరత మొదలైనవారు అయోధ్యలో జన్మించిన వారే.
రామజన్మ భూమి...
బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామజన్మ భూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాధికాలు నిర్వహించబడుతున్నాయి. అత్యంత రక్షణ వలయంలో క్యూపద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అలాపోతూ పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడా నిలవడానికి రక్షణ సిబ్బంది అనుమతించరు. సెల్ పోన్, కెమెరాలు, పెన్నుల వంటివి కూడా లోపలకు అనుమతించరు. లోపల కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడవాలి కనుక చెప్పులు వేసుకుని లోపలకు వెళ్లాలి.
జైన్ మతస్థులకు కూడా ప్రాముఖ్యమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులిద్దరికి అయోధ్య జన్మస్థలం అయింది. అంతే కాదు మరో ఐదుగురు తీర్థంకరులకు కూడా జన్మస్థలంగా ఈ నగరం ఉంది. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు రాయబడింది.
అయోధ్య బుద్ధమత వారసత్వం కలిగిన నగరం. అందువలన ఇక్కడ మౌర్యచక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారకచిహ్నాలు, శిక్షణాకేంద్రాలు ఉన్నాయి. గుప్తులకాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. క్రీ.పూ 600 లలో కూడా అయోధ్య వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీ.పూ 5వ శతాబ్దం నుండి క్రీ.శ 5వ శతాబ్దం వరకు బౌద్ధమతకేంద్రంగా అయోధ్య విలసిల్లినది. బుద్ధుడు ఈనగరానికి చాలాసార్లు వచ్చినట్లు భావిస్తున్నారు.
క్రీ.శ 127 సాకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పుప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి హూయంత్సాంగ్ క్రీ.శ 636 లో తన భారతదేశ యాత్రలో ఈనగరాన్ని సందర్శించిన సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అని పేర్కొన్నాడు. కాని ఈ పేరు మార్పు ఎప్పుడు జరిందన్నది స్పష్టం కాలేదు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనాసమయంలో ఈనగరం అయోధ్య, అజోధియ అని పిలువబడింది. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా-అయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది.
అయోధ్య పేరు ఎందుకొచ్చింది..
మహారాజైన ఆయుధ్ పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొనబడింది. అతడి పేరు సంకృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. గౌతమబుద్ధుని కాలంలో ఈ నగరం పాలిలో అయోజిహా అని పిలువబడింది అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్ధాన్ని ఇస్తుంది. పురాణాలు గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. కామన్ ఎరా మొదటి శతాబ్ధాలలో ఈ నగరం సాకేతపురం అని పిలువబడింది.