Sri Ramanavami 2024: దేశంలో ప్రసిద్ద రామాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా...

రామనామం జపిస్తే.. అన్ని పాపాలు తొలగిపోతాయి.. శ్రీరామ చంద్రమూర్తిని దర్శించుకుంటే జన్మ ధన్యమైపోయినట్టే.. అంటుంటారు పెద్దలు .భారత దేశంలో ఉన్న దివ్య రామ మందిరాల గురించి చదివితే మన నాగరికత మీద, మన చరిత్ర మీద, వీటికి కేంద్ర బిందువైన మన జీవన విధానం మీద రాముడి ముద్ర ఎంతటిదో తెలుస్తుంది. రామాయణం దానిని ఎలా మలిచిందో అర్ధమవుతుంది.  శ్రీరామనవమి సందర్భంగా భారత సమైక్యతకు స్ఫూరిని ఇస్తూ దేశమంతా, వివిధ కాలాలలో  నిర్మించిన ఆలయాల గురించి తెలుసుకుందాం. 

భద్రాచలం: భారతదేశంలోనే ప్రసిద్ధ రామ మందిరాలలో  ఇది ఒకటి.  తెలంగాణ భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో, గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని కంచర్ల గోపన్న కట్టించాడు. ఓ రోజు రామయ్య ఆయన కలలోకి వచ్చి భద్రాచలం కొండమీద గుడి కట్టించమని అడిగాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. ఈ ఆలయానికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం. పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం భద్రాద్రి క్షేత్రం. రామాయణంతో దగ్గర సంబంధం ఉన్న రెండు ప్రదేశాలు భద్రాచలం, విజయనగరంగా చెప్తారు. రాముడు, సీత, లక్ష్మణులు భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో బస చేసినట్లు చెబుతారు. శ్రీరాముడు సీతను రక్షించేందుకు శ్రీలంకకి వెళ్ళే మార్గంలో గోదావరి నదిని దాటాడని ఈ ప్రదేశం భద్రాచలం ఆలయం నదికి ఉత్తర ఒడ్డున ఉందని చెబుతారు. 

ఇందల్వాయి: శ్రీరాముడి జీవితంలోకి సీతాదేవి రాకముందు నుంచి లక్ష్మణుడు ఆయన వెంట ఉన్నాడు. అలాంటి లక్ష్మణుడు లేని రామాలయం ఉంటుందా అనుకోవద్దు. కానీ, ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి గ్రామంలో లక్ష్మణుడు లేని రామాలయం ఉంది. దేశంలో ఇలాంటి ఆలయం ఇదొక్కటే.

ఒంటిమిట్ట కోదండరామస్వామి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం ప్రతీఏట అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరంగా కూడా పిలుస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి  లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిలా నగరం అన్ని పేరొచ్చింది. ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే. కోదండరామ స్వామి ఆలయానికి మూడు ప్రధాన గోపురద్వారాలు ఉన్నాయి. ఆ గోపురాల ద్వారా లోనికి వెళితే విశాలమైన మైదానం ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించారు. 

అయోధ్య  బాలక్​ రామాలయం:  ఎన్నో శతాబ్దాల కల తీరింది. అయోధ్యలోని రామాలయంలో బాల రాముడు కొలువు తీరాడు.ఈ ఏడాది జనవరి 22న చిన్నారి శ్రీ రాముని ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. అయోధ్య శ్రీరాముని జన్మ స్థలం. సరయూ నది ఒడ్డున ఉంది. సప్తపురి అత్యంత ముఖ్యమైన ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది.  ఈ ఆలయాన్ని నాగర శైలిలో నిర్మించారు. ఈ ఆలయ గర్భగుడిలో శ్రీరాముడి ఐదేళ్ల రూపంలో ఉన్న బాల రాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. 51 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం మీద విష్ణుమూర్తి దశావతారాలు చెక్కారు.  శ్రీరామనవమి రోజు సూర్యతిలకం ( సూర్య కిరణాలు) బాలక్​ రాముని  లలాటం(నుదిటి  )పై ప్రసరించే విధంగా చర్యలు తీసుకున్నారు.

సముద్రగుప్తుడు, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CE కు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది, అప్పుడే రామ్ లాల్ల అని 5-6 అంగుళాల బాల రాముడి మూర్తి విగ్రహం ఉండేది. కాల క్రమేణా గుడి ఆక్రమణలు జరిగినా, తరువాత కాలంలో అక్కడే అయోధ్యలో తవ్వకాలు జరిపితే అదే బాల రాముడి మూర్తి బయటపడింది.  మళ్ళీ అదే స్థలంలో రాముల వారి కోసం ఆలయం పునః నిర్మించి.. బాలక్​ రాముడిని ప్రతిష్ఠించారు. 

అయోధ్యా కనకభవన్:  ప్రాచీనకాలం నుంచి దీన్ని కౌశల దేశంగా పిలుస్తున్నారు. ఈ భవనాన్ని త్రేతాయుగంలో సీతాదేవి ముఖాన్ని చూసే సందర్భంలో పెళ్లకానుకగా కైకేయి ఇచ్చిందట. అప్పటినుంచీ దీన్ని పునర్నిర్మించుకుంటూ వచ్చారనేది స్థలపురాణం. ఇందులో మూడు జోడీల సీతారాముల విగ్రహాలు కనిపిస్తాయి. పెద్ద విగ్రహాల్ని రాణీ కున్వారీ ప్రతిష్ఠంచగా, మధ్య సైజు విగ్రహాన్ని విక్రమాదిత్యుడి కాలం నాటివని, చిన్నవి కృష్ణుడు ఈ స్థలంలోనే రామజపం చేసుకుంటున్న భక్తురాలికి సమర్పించినని అని చెబుతుంటారు.  

కుంభకోణం రామస్వామి: తమిళనాడులోని కుంభకోణంలో రామస్వామి దేవాలయానికి దక్షిణ అయోధ్య అని పేరు ఉంది. ఈ ఆలయం విష్ణువు అవతారమైన రాముడికి అంకితం చేయబడింది.  ఆ దేవాలయంలోని మూలవిరాట్టు విగ్రహాలే ఇందుకు కారణం. ఈ ఆలయంలో రాముడు, సీతాదేవి వివాహ భంగిమలో గర్భగుడిలో కొలువు దీరి ఉంటారు.  ఈ ఆలయంలో  విగ్రహాలు సాలగ్రామ శిలతో చేయబడినవి. ఒక్కొక్క విగ్రహం ఎత్తు 8 అడుగుల పైనే ఉంటాయి. ఆలయంలోని మండపంలో 62 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాల పై ఉన్న శిల్ప సౌదర్యం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుందడంలో అతిశయోక్తి లేదు. ఈ ఆలయాన్ని రఘునాయకుడు నిర్మించాడు. తంజావూరు రాజ్యాన్ని క్రీస్తు శకం 1614 నుంచి 40 వరకూ పరిపాలించిన రఘునాయకుడు గొప్ప రామ భక్తుడు. దాదాపు 400 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని  రఘునాథ నాయకర్ నిర్మించారు.

ఎరి–కథా రామర్ ఆలయం : తమిళనాడులోని మధురాంతకంలో ఉంది. రామాయణంతో ఈ ప్రాంతానికి సంబంధం ఉన్నట్టు చెప్తుంటారు. లంకలో రావణాసురుడిని వధించిన తర్వాత  శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు మధురాంతకంలో కొద్దిసేపు ఆగారని భక్తులు నమ్ముతారు. 

విజయరాఘవ పెరుమాళ్ ఆలయం: తమిళనాడులోని కాంచీపురం జిల్లా తిరుప్పుకుళిలో ఉంది. ఇది108 దివ్యదేశాల్లో ఒకటని భక్తుల నమ్మకం. గర్భగుడి లోపల విజయరాఘవ పెరుమాళ్ ఒడిలో జటాయువు ఉంటుంది. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు తనకు సీతాదేవి చెప్పిన వివరాల ప్రకారం  జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశాడనేది భక్తుల నమ్మకం.

ఓర్చా రాజారామ్: మధ్యప్రదేశ్‌లోని తికంగర్ జిల్లాలో బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో బేత్వానది వంపు తిరిగినచోట ఏర్పడిన దీవిలోని చిన్న ఊరే ఓర్చా. ఓర్చా రాణి శ్రీరాముని భక్తురాలు.  ఇక్కడ రాముడిని ఓ రాజుగా పూజిస్తారు.  తన నిరంతరమైన భక్తితో పూజ్యమైన దేవతను తిరిగి బాలుడి రూపంలో తీసుకురావాలనే కోరికతో ఆమె ఒక సారి అయోధ్యకి వెళ్ళింది. రాముడు ఆమెతో ఓర్చా రావడానికి అంగీకరించాడు. అయితే ఆమె రాముడికి ఒక షరతు పెట్టిందట. ఇక్కడ నుంచి మరొక ఆలయానికి వెళ్లకూడదనే షరతుతో రాముడిని తీసుకెళ్ళి ఆలయం నిర్మించింది. రాణి రాజభవనం రామ రాజా ఆలయంగా మారిపోయింది. ఇక్కడ రాముడిని దేవుడిగానే కాకుండా రాజుగా కూడా పూజిస్తారు. రాముడి కుడి చేతిలో కత్తి, ఎడమచేతిలో డాలుతో పద్మాసనం వేసుకున్న భంగిమలో కొలువైన రాముడి ఎడమవైపున సీతాదేవి కుడివైపు లక్ష్మణుడు, పాదాలదగ్గర హనుమంతుడు కనిపిస్తారు. ఇక్కడ రాజ్యమేలే రాముడి ఎడమకాలి బొటనవేలు దర్శనం అయితే చాలంట.  మనసులో ఏ కోరిక కోరుకున్న కచ్చితంగా నెరవేరుతుందనేది అక్కడి భక్తుల నమ్మకం.   గన్ సెల్యూట్ కూడా చేస్తారు. 

నాసిక్ కాలారామ్: నాసిక్ లోని పంచవటి ప్రాంతంతో శ్రీరాముడితో ముడిపడిన అంశాలు, గుర్తులు దర్శనీయాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ రాముడు నల్లని శిలతో దర్శనమిస్తాడు. అందుకే ఇక్కడి రాముణ్ణి కాలారామ్ గా కొలుస్తారు. ఇది నాసిక్ లో పంచవటీ క్షేత్రంలో వున్న అద్భుత మందిరం. శ్రీరామచంద్రుడు తన వనవాస కాలంలో నివసించిన ప్రదేశంలోనే ఈ మందిర నిర్మాణం జరిగిందంటారు. ఈ ఆలయంలో రాముడు, సీత, లక్షణుడు విగ్రహాలు 2 అడుగుల ఎత్తులో ఉంటాయి.    ఓ రోజు సర్దార్ రంగారావు అనే వ్యక్తికి గోదావరి నదిలో రాముడి విగ్రహం ఉన్నట్లు కల వచ్చిందట. అంతేకాదు కలలో వచ్చినట్టే అదే స్థలంలో అతనికి రాముడి విగ్రహం కనిపించడంతో వెంటనే అక్కడ గుడి కట్టించాడు.          

త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం: ఈ దేవాలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది.ఇక్కడ రాముడిని  త్రిప్రయారప్పన్ లేదా త్రిప్రయార్ తేవర్ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రీరాముని విగ్రహాన్ని పూజించేవాడని నమ్ముతారు. శ్రీకృష్ణుని స్వర్గారోహణం అనంతరం విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జమ చేశారు. తర్వాత దీన్ని కేరళలోని చెట్టువా ప్రాంతానికి సమీపంలోని సముద్రానికి చెందిన కోదారు మత్స్యకారులు స్థాపించారు. వక్కయిల్ కైమల్ అనే స్థానిక పాలకుడు త్రిప్రయార్ వద్ద ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

కోదండరామ దేవాలయం :   కర్ణాటక రాష్ట్రం  చిక్ మంగళూరు జిల్లాలోని హిరెమగళూరులో ఉంది. కోదండరాముడు ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ రాముడి విల్లుని కొండన అని పిలుస్తారు. హనుమంతుని పీఠంపై గర్భగుడి లోపల రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీరాముని కుడివైపున సీతను ఉంచుతారు.  స్కంద పురాణం ప్రకారం.. శ్రీరాముడు సీతమ్మను పెండ్లి చేసుకున్నప్పటి భంగిమలో పరశురాముడికి దర్శనం ఇస్తాడు. హొయసల, ద్రావిడ నిర్మాణ శైలుల అద్భుతమైన సమ్మేళనం ఇక్కడ కనిపిస్తుంది. 

శ్రీరామ తీర్థ ఆలయం:  అమృత్ సర్ కి పశ్చిమాన 12 కిమీ దూరంలో చోగావాన్ రోడ్డులో ఉంది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీత దేవి ఆశ్రయం పొందిన ప్రదేశం. సీతాదేవి లవ,కుశలకు జన్మనిచ్చిన ప్రదేశం ఇదే. ఇక్కడ సీతాదేవి స్నానం చేసే మెట్లతో కూడిన బావి కూడా ఉంటుంది. అందుకే ఇది భారత్ లోనే అత్యంత పవిత్రమైన రామ దేవాలయాలలో ఒకటిగా నిలిచింది. ఇది సీతారాముల సంతానం లవ, కుశులకు సంబంధించింది.గర్భిణిగా వచ్చిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పించిన ప్రదేశం ఇదేనని విశ్వసిస్తారు.

రఘునాథ్ ఆలయం: జమ్మూనగరంలో ఉన్న ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని మహారాజా గులాబ్ సింగ్, అతని కుమారుడు రణబీర్ సింగ్ 1853- 1860 కాలంలో నిర్మించారు. ఈ ఆలయంలో చాలా మంది దేవుళ్ళు ఉంటారు. కానీ అధిష్ఠానం మాత్రం రాముడిదే. ఆలయ వాస్తు శిల్పం అసాధారణంగా ఉంటుంది. రఘునాథ్ ఆలయ నిర్మాణ వైభవంలో మొఘల్ రాతి కట్టడాలు చూడవచ్చు.    

రామచంద్రాలయం:  హిమాచల్​ ప్రదేశ్​ లో హరిపూర్‌ లో ఉన్న రామాలయం..   చిన్న కాశీగా ఈ క్షేత్రానికి పేరు ఉంది. ఇక్కడ ఒక్కచోటే 18 పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇందులోనే ఉంది రామచంద్రాలయం. ఇది 900 సంవత్సరాల క్రితం నిర్మించారు. అందుకే బాగా శిథిలావస్థకు చేరుకుంది. సీత, లక్ష్మణ సమేతుడై ఇక్కడ రాముడు ఉన్నాడు. లోపల శిల్పాలు, చిత్రపటాలు ఉన్నాయి. కాంగ్డా జిల్లాలోని డెహ్రా సబ్‌డివిజన్‌లో ఈ ఊరు ఉంది. సంసార్‌చంద్ర, ఆయన కుమారుడు హరీశ్‌చంద్ర ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాంగ్డా వంశీకులైన ఈ ఇద్దరు పాలించిన కొండరాజ్యం నందపూర్‌`గులేర్‌లోనే హరిపూర్‌ ఉంది. ఆలయం కూడా కొండ సంప్రదాయక శిల్పకళతో నిర్మించారు.

శ్రీరాముడు కేవల పురాణ పురుషుడు కాదు. కావ్య నాయకుడూ కాదు. భారతీయ నాగరికతా చరిత్రకు ఆయన శ్రీకారం. దాశరథి భారతీయు లకు మాత్రమే కాదు.. హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచ మానవాళికే దేవుడు అంటున్నప్పుడు, భారతదేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలతో ఆయన బంధం గురించి వేరే తర్కించాలా... హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రతి మట్టి రేణువు రాముడి గురించి విన్నదే. ..పలికినదే, స్పర్శతో పరవశించినదే. ..మనుషులకి, పక్షులకి, ఊళ్లకి, ఫలాలకి, కొండలకి, గుహలకి, వాగులూ వంకలకి, జలాశయాలకి రాముడి పేరే పెట్టుకున్న సంస్కృతి ...  అంతా రామమయమే. భారతీయ జీవనంలోని ఏకాత్మను దర్శింపచేసేవాడు రామచంద్రుడు. ఈ నేలలోని, ఈ జాతిలోని ఏకాత్మతకు ఆయన ఆద్యుడు. సమైక్యతకు స్ఫూర్తిప్రదాత శ్రీరామ చంద్రుడు.