కామారెడ్డి టౌన్, వెలుగు : బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రోడ్లు, కాలనీల గుండా సాగింది. సామాజిక కార్యకర్త శివకుమార్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు.
దాడులు జరగకుండా ఉండేందుకు హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని, లేకపోతే దేశ విభజన నాటి పరిస్థితులు పునరావృత్తమవుతాయన్నారు. ఇస్కాన్ సంస్థను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేదించాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జహీరాబాద్మాజీ ఎంపీ బీబీపాటిల్, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్అరుణతార తదితరులు పాల్గొన్నారు.
హిందువుల జోలికి వస్తే ఖబడ్దార్
నిజామాబాద్ సిటీ, వెలుగు: హిందువుల జోలికి వస్తే ఎలా ఉంటుందో బంగ్లాదేశ్ కు తెలియజేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంఘీభావ నిరసన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన హిందువుల పట్ల బంగ్లాదేశ్ లాంటి దేశాలు నీచంగా ప్రవర్తిండాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ తదితరులు పాల్గొన్నారు.