నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

  • గతంలోనే  చెప్పినా మళ్లీ పిటిషన్​ వేసుడేంది?
  • బీఆర్​ఎస్​ తీరుపై హైకోర్టు ఆగ్రహం.. రూ. లక్ష జరిమానా
  • పవర్​లో ఉన్నప్పుడు రూ.100 కోట్ల స్థలాన్ని 3.23 లక్షలకే కైవసం చేస్కున్న బీఆర్​ఎస్
  • ​ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎకరం స్థలంలో బిల్డింగ్​ నిర్మాణం
  • రెగ్యులరైజేషన్​కు మున్సిపాలిటీ ఒప్పుకోవడం లేదని గతంలో హైకోర్టులో పిటిషన్
  • జోక్యం చేసుకోవాలని వినతి.. అప్పట్లోనే తిరస్కరించిన న్యాయస్థానం
  • కూల్చివేతల భయంతో మరోసారి కోర్టు ముందుకు..!
  • టైమ్​ వేస్ట్​ చేస్తున్నారని బీఆర్​ఎస్​పై హైకోర్టు సీరియస్​​.. పిటిషన్​ తిరస్కరణ 

హైదరాబాద్/నల్గొండ, వెలుగు: నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేతలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు మరోసారి  తేల్చిచెప్పింది. బిల్డింగ్​ క్రమబద్ధీకరణ వివాదంపై రెండోసారి పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి తేల్చిన అంశంపైనే మరోసారి పిటిషన్ ఎట్ల వేస్తారని నిలదీసింది. కోర్టు టైమ్​ వేస్ట్​ చేసినందుకు లక్ష రూపాయలు ఖర్చుల కింద నల్గొండ న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని బీఆర్​ఎస్​ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

తక్కువ ధరకు దక్కించుకొని.. పర్మిషన్​ లేకుండా కట్టి..!

నల్గొండ నడిబొడ్డున అగ్రోస్​ సంస్థకు చెందిన రెండెకరాల స్థలం  రూ.100 కోట్లు పలుకుతుంది. కానీ, గత ప్రభుత్వం కేవలం రూ.3.23 లక్షలకే బీఆర్ఎస్​ జిల్లా కార్యాలయానికి ధారాదత్తం చేసిందిఇందులోని ఎకరా స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్​ కట్టారు. ఇది అక్రమ నిర్మాణమని కూల్చేందుకు ఆ మధ్య నల్గొండ మున్సిపల్ కమిషనర్​ ఉపక్రమించారు. కూల్చివేతపై నోటీసులు జారీ చేశారు. నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్​ఎస్​ పార్టీ అప్పట్లోనే  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  తాము జోక్యం చేసుకోలేమని నాడు హైకోర్టు తేల్చిచెప్పింది. 

అయితే.. బీఆర్​ఎస్​తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. నల్గొండ జిల్లా సర్వే నెం 1506లో ఎకరం స్థలంలోని పార్టీ కార్యాలయ భవన నిర్మాణ క్రమబద్ధీకరణ విషయంలో జోక్యం చేసుకోవాలని, మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత నోటీసును రద్దు చేయాలని బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్  పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్ టి. వినోద్ కుమార్  విచారించారు. బీఆర్​ఎస్​ అడ్వకేట్​ వాదనలు వినిపిస్తూ.. పార్టీ కార్యాలయం క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరిస్తూ జులై 20న కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరారు.

 ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని ఏ విధమైన ఉత్తర్వులు ఇవ్వలేమని గతంలోనే  హైకోర్టు చెప్పిందని, అయితే ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చని సలహా ఇచ్చిందని అన్నారు. కూల్చివేతపై కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులను సవాల్​ చేసేందుకు ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ట్రైబ్యునల్ లేనందున తిరిగి హైకోర్టుకు రావాల్సి వచ్చిందని తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయొద్దంటూ  సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో ఉత్తర్వులు ఇచ్చిందని ప్రస్తావించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తరఫు అడ్వకేట్​ వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి అనుమతులేకుండా నిర్మాణాలు చేపట్టారని, అందువల్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. 

ఒకే విషయంలో రెండోసారి పిటిషన్​ ఏంది?

వాదనల తర్వాత హైకోర్టు.. పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్డింగ్​ రెగ్యులరైజేషన్​ నిరాకరణ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబమని గతంలోనే చెప్పామని,  తిరిగి అదే అంశంపై పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు అన్నింటికీ వర్తించవని స్పష్టం చేసింది. ఒకే వ్యవహారంపై రెండోసారి పిటిషన్ దాఖలు చేయడం ద్వారా కోర్టు సమయం వృథా చేశారని మండిపడింది. ఇందుకుగాను రూ. లక్ష జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. బీఆర్​ఎస్​ పిటిషన్​ను కొట్టివేసింది. 

బీఆర్ఎస్ ఆఫీసు ముందు ఉద్రిక్తత

నల్గొండలో బీఆర్ఎస్​ ఆఫీసు కూల్చివేతపై తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చిచెప్పడంతో బుధవారం రాత్రి నుంచే పార్టీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యా లయానికి పర్మిషన్​లేదని, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. పార్టీ ఆఫీసులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బుధవారం రాత్రి వాట్సాప్​ ద్వారా మేసేజ్​ చేశారు.

 దీంతో రాత్రికిరాత్రే ఆఫీసును కూల్చేస్తారన్న వదంతులతో పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మున్సిపల్​ మాజీ చైర్మన్​ మందడి సైదిరెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసు నిర్మాణానికి  డైరెక్టరేట్​ ఆఫ్​  టౌన్​ అండ్​ కంట్రీ ప్లానింగ్​ (డీటీసీపీ) అప్రూవల్​ లేదు. అప్పట్లో  మున్సిపల్​ పాలక వర్గం తీర్మానం కూడా చేయలేదు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడంతో, అక్రమ నిర్మాణాల కూల్చి వేత మొదలవడంతో బీఆర్​ఎస్​ నేతలు అప్రమత్తమయ్యారు. బిల్డింగ్​ రెగ్యులరైజేషన్​ కోసం మున్సిపల్​ కమిషనర్​కు ఫీజు చెల్లిస్తామని, బిల్డింగ్​ కూల్చొద్దని డీటీసీపీకి లేఖ రాశారు. కానీ డీటీసీపీ రిక్వెస్ట్​ లెటర్​ను తిరస్కరించింది.