బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్

  • ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
  • బీసీ కమిషన్​ను ప్రత్యేక కమిషన్​గా పరిగణించలేం
  • వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆర్డర్
  • విచారణ వచ్చే నెల 21కి వాయిదా

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌‌ ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అందిన వారంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం  ఇటీవల ఒక జీవో విడుదల చేసింది.  బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసే బాధ్యతను  బీసీ కమిషన్‌‌కు అప్పగించింది. దీనిని సవాల్‌‌ చేస్తూ  మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌‌.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. 

 దీనిపై జస్టిస్‌‌ సూరేపల్లి నంద బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది బి.ఎస్‌‌.ప్రసాద్‌‌ వాదనలు వినిపిస్తూ బీసీ కమిషన్‌‌నే ప్రత్యేక కమిషన్‌‌గా ప్రభుత్వం పేర్కొనడం  సుప్రీం కోర్టు  తీర్పులకు విరుద్ధమని తెలిపారు. మహారాష్ట్రలో బీసీ కమిషన్‌‌నే ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌‌గా నియమించిందని, అది ఇచ్చిన మధ్యంతర నివేదికను సుప్రీం కోర్టు రద్దు చేసిందని చెప్పారు.  బీసీ కమిషన్‌‌ ఇచ్చే నివేదికను రిజర్వేషన్ల పునఃసమీక్షకు తప్ప రాజకీయ రిజర్వేషన్ల కల్పనకు గణాంకాలుగా పరిగణించరాదని తెలిపారు. 

మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి : ఏజీ సుదర్శన్​ రెడ్డి

ప్రత్యేక కమిషన్‌‌ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని న్యాయమూర్తిని అడ్వొకేట్​ జనరల్​ ఏ సుదర్శన్‌‌రెడ్డి కోరారు. రెండున్నర నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన దశలో ఈ ఉత్తర్వులు సరికాదని పేర్కొన్నారు. 2021లో ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని తెలిపారు. ఈ జీవో అమలు నిమిత్తం తిరిగి జీవో 47 జారీ చేస్తూ గణాంకాల సేకరణకు విధివిధానాలు జారీ చేసినట్టు చెప్పారు.  సుప్రీం కోర్టు తీర్పుల అమల్లో భాగంగానే జీవో జారీ చేసినట్టు తెలిపారు. ఈ జీవోను పిటిషనర్లు సవాలు చేయలేదని అన్నారు. దీనిపై పిటిషనర్‌‌ తరఫు సీనియర్‌‌ న్యాయవాది బి.ఎస్‌‌. ప్రసాద్‌‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా వెనుకబడిన వర్గాల వాస్తవ గణాంకాల సేకరణకే ‘డెడికెటెడ్​ కమిషన్‌‌’ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

 వాదనలను విన్న న్యాయమూర్తి ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని, ఒకవేళ అభ్యంతరాలుంటే మధ్యంతర ఉత్తర్వుల తొలగింపునకు కౌంటరుతోపాటు పిటిషన్‌‌ దాఖలు చేసుకోవాలని  చెప్పారు.  రాజ్యాంగంలోని అధికరణ 340, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రత్యేక కమిషన్‌‌ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని  అన్నారు. బీసీ కమిషన్‌‌నే ప్రత్యేక కమిషన్‌‌గా పరిగణించాలంటూ ఈ నెల 9న ప్రభుత్వం జారీ చేసిన జీవో 47 సరికాదని, ఇది సుప్రీం కోర్టు తీర్పులు, రాజ్యాంగంతో విభేదిస్తున్నట్టు పేర్కొన్నారు. 

రాజకీయాల్లో వెనుకబాటుతనాన్ని స్వతంత్రంగా, విలక్షణంగా అధ్యయనం చేసి వాస్తవ గణాంకాలు సేకరించాలని, ఇలా సేకరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్‌‌.. ప్రత్యేక కమిషన్‌‌ కాదన్నారు.  పిటిషనర్‌‌ విజ్ఞప్తిని తక్షణం పరిశీలించి, వారంలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.  విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేశారు.