కొంతమంది పిల్లలు ఒంటరిగా పడుకోవాలంటే భయపడుతుంటారు. ఒకవేళ సముదాయించి నిద్రపుచ్చినా ఉలిక్కి పడి లేచి, బాగా ఏడుస్తుంటారు. ఇది పిల్లలున్న ప్రతి ఇంట్లో ఉండేదే, దీన్ని చూసీచూడనట్టు వదిలేస్తే.. పెద్దయ్యాక కూడా వాళ్లని ఆ భయం వదలదు. ఒంటరిగా పడుకోలేరు. ఈ సమస్య నుంచి పిల్లల్ని బయట పడేయాలంటే పేరెంట్స్ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
- పిల్లలు ఒంటరిగా పడుకోలేకపోవడానికి గల కారణం ఏంటో పేరెంట్స్ తెలుసుకోవాలి.
- మామూలుగానే చాలామంది పిల్లలకి చీకటి అంటే భయం ఉంటుంది. మొదట దాన్ని దూరం చేయాలి.
- రాత్రి, పగలు వెనక ఉన్న సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ చెప్పి ఆ భయాన్ని కాస్త తగ్గించొచ్చు.
- పిల్లలు ఒంటరిగా పడుకోలేకపోవడానికి పేరెంట్స్ కూడా ఒక కారణం.
- చకచకా తినాలి... త్వరగా నిద్రపోవాలి. మారాం చేయకూడదు. చెప్పిన మాట వినాలి. లేదంటే దెయ్యం వస్తుంది. బూచోడికి పట్టిస్తా అంటూ భయపెడుతుంటారు.
- పేరెంట్స్ సరదాకే అన్నా ఆ పసి మనసుల్లో ఈ మాటలు బలంగా నాటుకుంటాయి. ఒంటరిగా ఉంటే బూచోడు, దెయ్యం వస్తాయని భయపడతారు.
- రాత్రిళ్లు వాళ్లని ఊహించుకుంటారు. అందుకని పిల్లలకు లేని పోని భయాలు పెట్టొద్దు.
- హారర్, క్రైమ్ సినిమాల్లో రాత్రిని ఒక డేంజర్ బెల్ లా చూపిస్తుంటారు. దాంతో రాత్రంటే భయం పట్టుకుంటుంది పిల్లలకి.
- అందుకేవాళ్లని భయపెట్టే సినిమాలు, సీరియల్స్ ఇంట్లో పెట్టకూడదు. భయం కలిగించే మాటలకు కూడా దూరంగా ఉంచాలి.
- ఒకవేళ పిల్లలు హారర్ సినిమాలు చూస్తే.. అందులో చూపించేదంతా ఫిక్షన్ అని అర్థమయ్యేలా చెప్పాలి.
- అలాగే వాళ్లకి పీడకలలు ఏమైనా వస్తుంటే అది కల మాత్రమే. ఏమీకాదు అని చెప్పాలి. అప్పుడే పిల్లలు ధైర్యంగా పడుకుంటారు.
- కొందరు పిల్లలు తమకు వచ్చిన కలల గురించి చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు వాళ్ల మాటలకు అడ్డుపడకూడదు. వాళ్లు చెప్పేది ఓపికగా వినాలి.
- ఆ కలలే తరచూ వస్తున్నాయేమో అడగాలి. ఎందుకంటే, పిల్లల్లో ఉండే భయాలే వాళ్లకి కలల రూపంలో వస్తుంటాయి.
- అందుకే వాళ్లకెలాంటి కల వచ్చిందో తెలుసుకుంటే వాళ్ల భయాల గురించి కూడా తెలుస్తుంది. దాని ద్వారా వాళ్లు ఒంటరిగా ఎందుకు పడుకోలేకపోతున్నారో అర్థం అవుతుంది.
- ఆ రాత్రి పడుకునే ముందు కథలు చెప్పమనడం పిల్లలకు ఓ సరదా.
- అలాంటప్పుడు మాయలు, మంత్రాలు, దెయ్యాల కథలు చెప్తుంటారు కొందరు పేరెంట్స్.
- ఇలాంటివి పిల్లల్ని పిరికి వాళ్లుగా మారుస్తాయి. నీడను చూసినా భయపడతారు. అందుకే అలాంటి కథలు కాకుండా హాయిగా నిద్రలోకి జారుకునే కథలు చెప్పాలి.