సైన్యం సాహసోపేత నిర్ణయం.. ఛాపర్‌కు తీగలు కట్టి హెలికాఫ్టర్ తరలింపు

రోడ్డుపై వెళ్తున్న సమయంలో కార్లు, ఆటోలు నిలిచిపోతే వాటిని మరొక వాహనం సహాయంతో తరలించడం మనం చూస్తూనే ఉంటాం.. బాగున్న వాహనం వెనుక వైపు తీగలు తగిలించి దానిని పాడైన వాహనానికి జతచేసి తరలిస్తుంటారు. మరి పాడైన హెలికాఫ్టర్‌ను తీగల సహాయంతో తరలించడం ఎపుడైనా చూశారా..! బహుశా చూసుండరు. అలాంటి సాహసోపేత నిర్ణయానికి భారత సైన్యం వేదికైంది.

తీగల సహాయంతో పాడైన హెలికాఫ్టర్ ను భారత వైమానిక దళానికి చెందిన ఛాపర్‌కు జత చేసి తరలించే ప్రయత్నం చేశారు. సదరు చాపర్ గాల్లోకి ఎగరగానే బరువు ఎక్కువై తీగలు తెగి హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో చోటుచేసుకుంది. 

ఏం జరిగిందంటే..?

కేదార్‌నాథ్‌ యాత్రికులను తరలించే సమయంలో క్రెస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఇటీవల దెబ్బతింది. ల్యాండింగ్ సమయంలో కింది బాగం దెబ్బతింది. దీనిని ఘటనా స్థలంలో బాగుచేసే అవకాశం లేకపోవడంతో.. భారత సైన్యం ఛాపర్‌ సాయంతో తరలించే ప్రయత్నం చేసింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్‌కు ఒక వైపు కేబుల్స్‌ తగిలించి దానిని హెలికాప్టర్‌ను కట్టి తరలించారు.

ALSO READ | పాక్‌‌లో కొండచరియలు .. విరిగిపడి 12 మంది మృతి

కొద్ది దూరం ప్రయాణించాక కేదార్‌నాథ్‌-గచౌర్‌ మధ్య భీంబాలి ప్రాంతంలో ఎంఐ-17 ఛాపర్‌కు అమర్చిన తీగలు తెగిపోయాయి. దాంతో కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్‌ భూమిపై పడిపోయింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లించోలిలోని మందాకిని నది సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.