- డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు నిర్ణయం
న్యూఢిల్లీ, వెలుగు : హీరా గోల్డ్ కేసులో ఆ సంస్థ ఎండీ నౌహీరా షేక్ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు వెల్లడించింది. హీరా గోల్డ్ సంస్థపై నమోదైన కేసుల విషయంలో దర్యాప్తు సంస్థలు చట్టప్రకారం ముందుకెళ్లవచ్చని తెలిపింది.
ఈ మేరకు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల బెంచ్ శుక్రవారం తీర్పు ఇచ్చింది. హీరా గోల్డ్ సంస్థ వివిధ స్కీమ్స్ పేరుతో రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించింది. డబ్బులు తిరిగి డిపాజిటర్లకు చెల్లించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్‌పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తర్వాత మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది.