తెలంగాణలో మరో 4 రోజులు భారీవర్షాలు..10 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

  • పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • వాయుగుండంగా మారి వర్షాలు పడే చాన్స్

హైదరాబాద్/జగిత్యాల, వెలుగు: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మరింత బలపడిందని, శనివారం నాటికి అది వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లో అలర్ట్​ జారీ చేసిన జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.

Also Read :- బలపడుతోన్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

జగిత్యాలలో కుండపోత

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల శివారులోని గోవిందుపల్లె వాగు ఉధృతంగా ప్రవహించడంతో వెంకట్రాద్రినగర్‌‌‌‌కు రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 500 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అత్యవసరం ఉన్న వారిని జేసీబీ సాయంతో వాగు దాటించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున భారీ వర్షాలతో దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందిపడ్డారు.