స్ట్రెంత్ పెరిగితేనే గంజాయికి చెక్

  • ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా జోరుగా అక్రమ రవాణా  
  • భారీగా సరుకు పట్టుబడుతున్నా .. ఆగని దందా   
  • కింది స్థాయి సిబ్బందిపై పెరుగుతున్న పనిభారం  

మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణా భారీగా జరుగుతోంది.  సిబ్బంది తక్కువగా ఉన్నా కూడా  ఇతర డిపార్ట్​మెంట్ల సహకారంతో ఎక్సైజ్​ అధికారులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకుంటున్నారు.  ఎక్సైజ్  శాఖలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు క్యాడర్​  స్ట్రెంత్​ పెంచితే రవాణాను పూర్తి స్థాయిలో నిలువరించే  వీలుంటుంది. ​ 

ఖమ్మం, వెలుగు:  రాష్ట్రంలో గంజాయి రవాణాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా సెంటర్​గా మారింది. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్​ గ సరిహద్దు నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఉమ్మడి జిల్లా మీదుగానే రవాణా జరుగుతోంది. భద్రాచలం, మణుగూరు మీదుగా ఉమ్మడి వరంగల్​ జిల్లాకు, ఖమ్మం , సూర్యాపేట మీదుగా హైదరాబాద్​కు సప్లయ్​ చేస్తున్నారు.  ఆంధ్రా ఒడిశా బోర్డర్​ లో, విశాఖ మన్యం ప్రాంతంలో పండే శీలావతి రకం గంజాయికి మార్కెట్​లో ఫుల్ డిమాండ్​ ఉంటుంది.  

దాంతో ఆ ప్రాంతాలనుంచి జిల్లా మీదుగా పెద్ద ఎత్తున రవాణా జరుగుతోంది. టూ వీలర్లు, కార్లు, బస్సులు, లారీలు, ఇతర వాహనాల్లో రూట్లు మారుస్తూ కూరగాయలు, కొబ్బరిబోండాల మాటున  సరుకు  తరలిస్తున్నారు. రవాణాకు చెక్​ పెట్టేందుకు పోలీసులు, టాస్క్​ ఫోర్స్​ టీమ్​లతో కలిసి ఎక్సైజ్​ సిబ్బంది కష్టపడుతున్నా సిబ్బంది తక్కువగా ఉండడంతో పూర్తిస్థాయిలో అడ్డుకట్ట 
వేయలేకపోతున్నారు. 

రవాణే కాదు.. వినియోగం కూడా.. 

ఇటీవల ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో కూడా గంజాయి వినియోగం పెరిగింది. స్కూలు, కాలేజీ విద్యార్థులు కూడా గంజాయికి అలవాటు పడ్డారు.  ఆ మత్తులో తప్పులు చేస్తూ, నేరస్తులుగా మారుతున్నారు.  గంజాయి కోసం డబ్బులివ్వలేదంటూ ఖమ్మం నగరంలో సొంత అమ్మమ్మను చంపిన  నిందితుడు  గంజాయికి మత్తులోనే దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు.  కొద్దినెలల కింద  టూవీలర్ స్లోగా వెళ్లమని చెప్పినందుకు ఓ యువకుడిని మరో యువకుడు   కత్తితో దాడి చేసి  హత్య చేసింది కూడా గంజాయి మత్తులోనని తేలింది.  

స్ట్రెంత్  పెంచాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్లు ఉండగా, అధికారులతో కలిసి 290 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 36 ఖాళీలున్నాయి. కేడర్​ స్ట్రెంత్ ప్రకారం ఖమ్మం జిల్లాలో 177 పోస్టులకు గాను 157 మంది,   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 149 పోస్టులకు గాను 133 మంది పనిచేస్తున్నారు.   రెండు జిల్లాల్లో కలిపి 21 మంది సబ్​ ఇన్​స్పెక్టర్లు  తక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి యేటా పట్టుబడుతున్న గంజాయిలో 50 శాతానికి పైగా ఉమ్మడి జిల్లా పరిధిలో  పట్టుకున్నదే.  

ఐదేళ్లలో ఖమ్మం జిల్లాలో 498 కేసుల్లో 8,622 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఖమ్మం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఎన్డీపీఎస్​ కింద 17 కేసుల్లో 78 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇక్కడ పెద్దమొత్తంలో సరుకు పట్టుబడుతున్నా పూర్తి స్థాయిలో అక్రమ రవాణాను నిలువరించా లంటే  కేడర్​ స్ట్రెంత్​ను సరిపోదంటున్నారు.  ఎక్సైజ్​ ఇన్​ స్పెక్టర్లు, ఎస్​ఐ పోస్టుల సంఖ్య  పెరగాలన్న వాదన వినిపిస్తోంది.  

వైరా ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్ లో ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. సాయంత్రం  బస్సుల తనిఖీల్లో  నలుగురు నుంచి ఐదుగురు  డ్యూటీలో ఉండాలి.  ఇద్దరు ఉదయం, రాత్రి  సెంట్రీ డ్యూటీ చేస్తారు. స్టేషన్​ లో ఉండాలంటే  నైట్ తనిఖీ చేసిన వారికి  మళ్లీ డే  డ్యూటీ వేయాల్సిందే  ఎవరైనా సెలవు తీసుకుంటే మిగిలిన సిబ్బందిపై అదనపు భారం పడినట్టే.

ఉన్న సిబ్బందితోనే   కట్టడి చేస్తున్నాం

ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘాపెట్టాం. ఉన్న సిబ్బందితోనే పోలీసులు, ఇతర   ప్రభుత్వ శాఖల సమన్వయంతో గంజాయి రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం.  ఇన్​ ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాం. గంజాయి రవాణా, వినియోగంపై  8712659123 నెంబర్​ తో పాటు ఎక్సైజ్​ టోల్ ఫ్రీ నెంబర్​ 18004252523కు సమాచారం ఇవ్వవచ్చు.  ఇన్ఫర్మేషన్​ ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.

- నాగేంద్రరెడ్డి, ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అధికారి​