శివనామస్మరణతో మార్మోగిన వేములవాడ

  • భక్తులతో కిక్కిరిసిన రాజన్న ఆలయం
  • స్వామి వారి దర్శనానికి ఆరు గంటల టైం
  • గర్భగుడి దర్శనం నిలిపివేత, లఘు దర్శనం అమలు

వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి వేలాది మంది తరలివచ్చారు. తెల్లవారక ముందు నుంచే క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ధర్మగుండంలో స్నానం చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

 భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో గర్భగుడి దర్శనం నిలిపి వేసి, కేవలం లఘు దర్శనం మాత్రమే అమలు చేశారు. భక్తులు కోడె మొక్కులు చెల్లించిన అనంతరం కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో వైపు ఆలయంలో ఉదయాన్నే సుప్రభాత సేవ అనంతరం గోపూజ, వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే సోమవారం రాత్రి మహా లింగార్చన కార్యక్రమాన్ని జరిపారు.