కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యానగర్‌కాలనీ, ఎన్జీవోస్కాలనీ, జన్మభూమిరోడ్డు, ఆర్యనగర్, నిజాంసాగర్ రోడ్డు, రామారెడ్డి రోడ్డు, సిరిసిల్లారోడ్డు ఏరియాలు, అయ్యప్పనగర్, ఇందిరానగర్, పంచముఖి హన్మాన్కాలనీ, బతుకమ్మకుంట, జీఆర్కాలనీ ఏరియాలో రోడ్లపై నీరు చేరటంతో పాటు ఇండ్లలోకి నీరు చేరింది. ఇండ్లలోకి నీరు రావటంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. పలువురు సురక్షిత ఏరియాలకు వెళ్లారు.
రోడ్లపై వరద నీరు నిలిచిపోవటంతో పోలీసులు బారికేడ్లు పెట్టి రాకపోకల్ని నియంత్రించారు. డిగ్రీ కాలేజీ కంపౌండ్ వాల్ కాకతీయనగర్ కాలనీ వద్ద కొంత కూలింది. వరద నీరు ఆ ఏరియాలోని ఇండ్ల వద్దకు వచ్చాయి. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారటంతో వాగులో నీరు పట్టక జీఆర్ కాలనీలోకి నీరు వచ్చి చేరింది. ఇక్కడకు మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చేరుకొని స్థానికులతో మాట్లాడారు. ఓ గర్భిణీని ఛైర్పర్సన్ వరద నీటిలో నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కామారెడ్డి టౌన్‌కు సమీపంలో టెకిర్యాల్ వద్ద హైవేపై ప్లై ఓవర్ బ్రిడ్జి వద్డ రోడ్డు కుంగిపోయి వెహికిల్స్రాకపోకలకు అంతరాయం కలిగింది.
కామారెడ్డి టౌన్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యటించారు. నిజాంసాగర్ రోడ్డులో రోడ్డుపై నీరు నిలిచి ఉన్న దృష్ట్యా వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. పెద్ద చెరువు అలుగు పారుతున్న దృష్ట్యా లోతట్టు ప్రజలను అలర్టు చేయాలని సూచించారు. మున్సిపల్ యంత్రాంగం అలర్టుగా ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్‌రావు, ఛైర్పర్సన్ ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ సుజాత ఉన్నారు.