ఖమ్మం.. జలదిగ్బంధం

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కాలనీలు జలమయం       
  •  ఇండ్లలోకి వరద..  ఇబ్బందుల్లో ప్రజలు 
  • కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలిన స్థానికులు
  • ఉప్పొంగిన వాగులు.. అలుగులు పారుతున్న చెరువులు 
  • సహాయక చర్యల్లో జిల్లా అధికార యంత్రాంగం 

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్/మణగూరు/నెట్​వర్క్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రం, మణగూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఆదివారం ఖమ్మం నగరంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. మున్నేరును ఆనుకున్న లోతట్టు కాలనీలతో పాటు, లకారం చెరువును ఆనుకొని ఉన్న కాలనీల్లోకి కూడా వరద నీరు చేరింది. నగరంలోని కవిరాజ్ నాగర్, నయాబజార్, ప్రకాశ్​ నగర్ చప్టా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి.

 నగరంలోని పలు కాలనీల నుంచి లకారం చెర్వులోకి వెళ్లే నాలాలను కబ్జా చేసి, నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరంతా కాలనీల్లోకి చేరింది. ఇందిరానగర్, కోర్డు పరిసర ప్రాంతాలతో పాటు కవిరాజ్ నగర్ ప్రధానంగా ముంపునకు గురయ్యాయి. ఆదివారం జిల్లా మొత్తం కలిపి సాయంత్రం 6 గంటల వరకు 269.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా బోనకల్ మండలంలో 43.8, చింతకానిలో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో వరద బాధితుల కోసం మొత్తం 39 పునరావాస సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 7,090 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఉదయం టిఫిన్ తో పాటు భోజనం, ఇతర సౌకర్యాలను కల్పించినట్టు అధికారులు చెబుతున్నారు. 

  • కూసుమంచి మండలంలో పాలేరు నుంచి నర్సింహులగూడెం వెళ్లే రోడ్డుకు గండిపడింది. 
  • తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ నుంచి కొక్కిరేణి పోయే రహదారికి బ్రిడ్జి దగ్గర గండిపడింది. 
  • కుసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేస్తున్న నలుగురు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు కాపాడారు. పాలేరు అలుగు నీరు ఒక్కసారిగా రావడంతో మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు.  
  • కల్లూరులోని ఇటుక రాళ్ల చెరువుకు గండిపడింది. వరద నీరు గండి ద్వారా ఉధృతంగా ప్రవహిస్తూ పంట పొలాల పై నుంచి వెళ్లడంతో వరి పైరు కోతకు గురై కొట్టుకుపోయింది.  
  • వర్షాలకు చెరువు అలుగులు  పడి వాగులు పొంగడంతో కల్లూరు నుంచి లక్ష్మీపురం, కల్లూరు నుంచి పుల్లయ్య బంజర, పుల్లయ్య బంజర నుండి లోకవరం, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోచారం, పెద్ద కోరుకొండి, పోచారం అలుగు దూకింది.  తాళ్లూరు, వెంకటాపురం గ్రామాల మధ్య తాళ్లూరు చెరువు అలుగు పారింది. చుండ్రుపట్ల, రఘునాథ్ గూడెం, చండ్రుపట్ల రఘునాథ బంజర్ వద్ద బూర్గు వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకల నిలిచిపోయాయి

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో.. 

జిల్లాలోని మణుగూరును వరద ముంచెత్తింది. మూడు దశాబ్దాల తర్వాత ఇంత భారీ వరద రావడంతో ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. ప్రజలను పోలీస్​లు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కలెక్టర్ జితేశ్​వి పాటిల్, ఎస్పీ బి. రోహిత్​ రాజు, ఐటీడీఏ పీవో రాహూల్​ మణుగూరుతో పాటు పలు వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. వరదలతో జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. కాగా జిల్లాలోని మణుగూరులో 31.6 సెంటిమీటర్లు, బూర్గంపహడ్​లో 28.7, భద్రాచలంలో 25.5, పాల్వంచలో 23.7, ఆళ్లపల్లిలో అశ్వాపురంలో 21.9, కొత్తగూడెంలో 17.4, లక్ష్మదేవిపల్లిలో 16.4, టేకులపల్లిలో 14, చర్లలో 13.8, ఇల్లెందులో 13.6, ఆళ్లపల్లిలో 13, దుమ్ముగూడెంలో 11.6, ముల్కలపల్లిలో 11.6, అశ్వారావుపేటలో 10.2, పినపాకలో 10.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 

ఎక్కడెక్కడ.. ఎలా.. 

  • మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీశ్రీ నగర్, అశోక్​ నగర్​, మామిడి చెట్ల గుంపు, శేషగిరి నగర్, మేదరబస్తీ, చేపల మార్కెట్​ ఏరియా, కుంకుడు చెట్ల గుంపు, ఆదర్శనగర్​తో పాటు పలు వీధులు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద ఉధృతిలో కార్లు, బైక్​లు కొట్టుకుపోయాయి. అశోక్​ నగర్​లోని ఎస్టీ హాస్టల్లో ఉన్న దాదాపు వందకు పైగా స్టూడెంట్స్​ను పోలీసు​లు పడవలు, భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అశోక్​ నగర్​లో ఓ పెంకుటిల్లు కూలిపోయింది.  
  • మణుగూరు, అశ్వాపురం మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వరదలతో  వేలాది ఎకరాల్లో పంట పొలాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వందలాది పంట పోలాల్లో ఇసుక మేట వేసింది. 
  • చుంచుపల్లి మండలంలో వరద నీరు రోడ్డుపైకి చేరడంతో ఖమ్మం–కొత్తగూడెం రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. 
  • పెనగడప ప్రాంతంలోని గోధుమ వాగు ఉధృతిని ఎస్పీ రోహిత్​ రాజు పరిశీలించారు. 
  • పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్​కు వరద నీరు పోటెత్తడంతో 12 గేట్లు ఎత్తి దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీటిని కిందకు వదలుతున్నారు. దిగువ ప్రాంతాల్లోని వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. 
  • ఇల్లెందులో ఇల్లెందుల పాడు చెరువు అలుగు వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతూ చెట్టును పట్టుకొని వేలాడుతుండడాన్ని గమనించిన స్థానికులు అతడిని కాపాడారు. 
  • వరదలతో అశ్వాపురం మండలం మిట్టగూడెంలోని హెవీ వాటర్​ ప్లాంట్​లో ఉత్పత్తిని నిలిపేశారు. 
  • చంద్రుగొండ మండలం  సీతాయిగూడెం  శివారులోని ఎదుళ్లవాగు, పోకలగూడెం, అన్నారంతండా వాగులు పొంగాయి.  
  • అశ్వారావుపేట అంకమ్మ చెరువు అలుగు ప్రమాద స్థాయిలో పారటంతో వాగోడ్డుగూడెం, అశ్వారావుపేట కు రాకపోకలను నిలిపివేశారు. 
  • బూర్గంపాడు మండల పరిధిలో ఉన్న కృష్ణ సాగర్ గ్రామపంచాయతీలో ఊర్ల దోసపాడులో పాలవాగు పొంగిపోర్లడంతో కట్టేసిన 30 పశువులు మృతి చెందాయి. 
  • అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం, రాజాపురం గ్రామాల వద్ద ఎదుళ్ల వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.