కొండచరియలు విరిగిపడి ..ఉగాండాలో 13 మంది మృతి

నైరోబి: ఉగాండాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు గురువారం ది ఉగాండా రెడ్ క్రాస్ సొసైటీ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. భారీ వర్షాలకు బులంబులి జిల్లాలోని 6 గ్రామాల్లో 40 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

13 మంది చనిపోయారు. మరికొంత మంది గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించారు. బుధవారం ప్రధాని కార్యాలయం విపత్తు హెచ్చరికను జారీ చేసింది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు తెగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.