చెరువులు, కాల్వలకు గండ్లు .. రైతులకు కడగండ్లు!

  • పొలాల్లో రెండు అడుగులకు పైగా ఇసుక మేటలు
  • కొట్టుకుపోయిన వరి పొలాలు, చెరకు పంట
  • నిలిచిన వరద నీటితో మిరప, పత్తి చేలకు డ్యామేజీ
  • ఖమ్మం జిల్లాలో 68,345 ఎకరాల్లో పంట నష్టం
  • ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు

కూసుమంచి తుమ్మల తండాకు చెందిన తేజావత్ వెంకన్నకు 4.15 ఎకరాల పొలం ఉండగా, అందులో వరి సాగు చేశారు. పంటకు ఇప్పటి వరకు రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టాడు. హట్యాతండా దగ్గర సాగర్​ ఎడమ కాల్వకు గండిపడి ఒక్కసారిగా వరద రావడం, పాలేరు అలుగు పారడంతో పొలం మొత్తం కోతకు గురైంది. వ్యవసాయ మోటార్, స్టార్టర్, కరెంట్ పోల్, వైరు సహా అన్నీ వరదలో కొట్టుకుపోయాయి. రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోతున్నాడు. 

ఖమ్మం/ కూసుమంచి, వెలుగు :  జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా చెరువులు, కాల్వలకు గండ్లు పడడంతో భారీగా పంట నష్టం ఏర్పడింది. ఊహించని వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్​ కాల్వలు కూడా నాలుగు చోట్ల తెగగా, చాలా చోట్ల డ్యామేజీ అయ్యాయి. వరద ఒక్కసారిగా రావడంతో వేల ఎకరాల్లోని పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, చెరకు పంటలు డ్యామేజీ కాగా, పొలాలు కోతకు గురయ్యాయి. వాగులు పొంగడంతో చెరువు కట్టలు తెగిపోయాయి. వరద నీరు ఇప్పటికీ నిలిచి ఉండడంతో మిరప, పత్తి చేలు పాడువుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 23 చెరువులకు గండ్లు పడగా, 11 చోట్ల చెరువు కట్టలు డ్యామేజీ అయ్యాయి. సాగర్​ ఎడమ కాల్వ సహా ఇతర మేజర్​ కాల్వ కట్టలు 15 చోట్ల తెగిపోగా, 13 చోట్ల కాల్వ కట్టలు డ్యామేజీ అయ్యాయి. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనాల ప్రకారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో పంట నష్టం జరిగింది.

68,345 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లెక్కతేల్చారు. ఇంకా చాలా చోట్ల వరద నీరు పొలాలు, తోటల్లో నిలిచి ఉండడంతో తెగుళ్లు వ్యాపించి, తోటలు పాడయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో పంట నష్టం మరింత పెరిగే అవకాశముంది. పంటల డ్యామేజీకి తోడు బావుల్లో వేసుకున్న వందలాది మోటార్లు, స్టార్టర్లు వరదల్లో కొట్టుకుపోగా, వందల సంఖ్యలో కరెంట్ పోల్స్​ డ్యామేజీ అయ్యాయి. ఒక్క కూసుమంచి మండలంలోనే హట్యాతండా, మల్లాయిగూడెం దగ్గర సాగర్​ కాల్వలకు గండ్లు పడడం, మినీ హైడల్​ ప్రాజెక్టు సమీపంలో, మత్స్య పరిశోధన కేంద్రం దగ్గర కట్టలు తెగడంతో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పాలేరు అలుగు పారిన ప్రాంతంలో గోరీలపాడుతండా, మంగళితండా, పాలేరు, హట్యాతండా, రాజుతండా, తుమ్మలతండా, వాల్యాతండా, జక్కేపల్లి, రాజుపేట గ్రామాల్లో పంట నష్టం భారీగా జరిగింది.