పంటలకు జీవం .. పాలమూరు, నారాయణపేట జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు

  • కరిగెట్ట పూర్తి చేసుకొని  వరి నాట్లు పెట్టుకుంటున్న రైతులు
  • పత్తి, మక్క, జొన్న, కంది పంటలకు మేలు చేసిన వానలు

మహబూబ్​నగర్, వెలుగు: పంటలు జీవం పోసుకుంటున్నాయి. సీజన్​ ప్రారంభమైన నెలన్నర తర్వాత మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాల్లో వరి నాట్లు షురూ అయ్యాయి. అలాగే సాగులో ఉన్న ఆరుతడి పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మేలు చేస్తాయి. పది రోజుల కిందటి వరకు ఎదుగు లేకుండా ఉన్న పత్తి, జొన్న, మక్క చేలు ఇప్పుడు కళకళలాడుతున్నాయి.

ఇన్​ టైంలో నాట్లు..

జూన్​లో ఏరువాక తర్వాత నుంచి వరి నాట్లు మొదలు కావాల్సి ఉంది. కానీ, ఆ నెల వర్షాలు ముఖం చాటేశాయి. ఇన్​టైంలో నైరుతి రుతు పవనాలు వచ్చినా, ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో వరి సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో కోయిల్​సాగర్​ కెనాల్స్​ ద్వారా సాగునీటిని అందించినా.. పెద్ద మొత్తంలో వరి నాట్లు పడలేదు. వర్షాలు పడతాయా? పడవా? అనే సందేహంతో రైతులు వరి సాగుకు ముందుకు రాలేదు.

అయితే పది రోజులుగా జిల్లాల్లో ముసురు పట్టగా, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో వరి నాట్లు వేసుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు 3.55 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా ఉండగా, ఇప్పటికే 60 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మిగతా చోట్ల నార్లు పోసురుకున్నారు. కొన్ని  చోట్ల కరిగెట్లను సిద్ధం చేసుకొని, నాట్లు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. రానున్న వారం రోజుల్లో వరి నాట్లు జోరందుకుంటాయని భావిస్తున్నారు. 

ఆరుతడి పంటలకు జీవం..

వరి తర్వాత మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో రైతులు ఎక్కువగా పత్తి, కంది, మొక్కజొన్న పంటలు సాగు చేస్తారు. అయితే పత్తి, మక్క విత్తనాలను రోహిణి కార్తె తర్వాత చల్లుకున్నారు. అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తినా మొక్కలు ఎదగలేదు. వీటిని కాపాడుకునేందుకు కొందరు ట్యాంకర్లు, స్ర్పింక్లర్లు, బిందెలతో నీళ్లు పెట్టారు. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈ పంటలకు జీవం పోశాయి. ఫీటు నుంచి ఫీటున్నర సైజుకు 
మొక్కలు ఎదిగాయి. 

మోస్తరు వానలు..

అల్పపీడన ప్రభావంతో మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో శుక్రవారం నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం శనివారం నారాయణపేట జిల్లాలో 296.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా కోస్గిలో 58.6 మిమీ, ధన్వాడలో 36.4, ఊట్కూరులో 27.4, నారాయణపేటలో 26.2, నర్వలో 28.2, మరికల్​లో 31.4 మిమీ వర్షపాతం నమోదైంది. మాగనూరు, మద్దూరు, మక్తల్, కృష్ణ మండలాల్లో ముసురు పట్టింది. మహబూబ్​నగర్​ జిల్లా వ్యాప్తంగా 423.1 మిమీ వర్షపాతం నమోదైంది. గండీడ్​లో 41.3, మహమ్మదాబాద్​లో 49.0 మిమీ వర్షం కురిసింది. అడ్డాకుల, బాలానగర్​, మూసాపేట, చిన్నచింతకుంట, హన్వాడ, కోయిల్​కొండ, దేవరకద్ర, మిడ్జిల్, జడ్చర్ల మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

సిఫార్సు మేరకే ఎరువులు వాడాలి

అగ్రికల్చర్​ ఆఫీసర్ల సిఫార్సు మేరకే ఎరువులు వాడితే మంచి దిగుబడి వస్తుంది. ఆఫీసర్లు చెప్పిన సూచనలు, సలహాలు తప్పక పాటించాలి. వరి నార్లు సిద్ధం చేసుకొని, కరిగెట్ట చేసుకున్న రైతులు ఎకరాకు ఒక డీఏపీ సంచి, 15 కిలోల పొటాష్​ కలిపి రెండు సార్లు చల్లుకోవాలి. నాట్లు వేయడానికి ఒక రోజు ముందు మళ్లీ ఎరువులు చల్లుకొని, నాట్లు పెట్టుకోవాలి. పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు ఎకరాకు 15 కిలోల యూరియాను ఐదు కిలోల పొటాష్​తో కలుపుకొని మొక్క మొదల్లో వేసుకోవాలి. 

వెంకటేశ్వర్లు, డీఏవో, మహబూబ్​నగర్