రెండు గంటలు కుండపోత..పలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షాలు

  • అక్కడక్కడా ఉప్పొంగిన వాగులు
  • ఇండ్లలోకి చేరిన వరద నీరు
  • మెదక్​లో 12.9 సెంటీమీటర్ల వాన
  • మరో నాలుగు రోజులు వర్షాలు

నెట్​వర్క్, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల రెండు గంటలపాటు వాన దంచికొట్టింది. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపడి ఇద్దరు చనిపోయారు. మెదక్  పట్టణంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. రాందాస్ చౌరస్తా నుంచి జేఎస్​రోడ్డు రూట్​లో, పాత గాంధీ లైబ్రరీ వద్ద వరద ఉధృతికి బైక్​లు కొట్టుకుపోయాయి. మెదక్​లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వానాకాలంలో ఇదే పెద్ద వర్షం. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, బెజ్జంకి, ములుగు, వర్గల్, కొండపాక  మండలాల్లో భారీ వర్షం కురిసింది.

బెజ్జంకి సమీపంలోని ఈదుల వాగు పొంగిపొర్లి  రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట టౌన్​లో రోడ్ల పై వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది అయ్యింది. ఉమ్మడి కరీంనగర్​జిల్లా గంగాధర శివారులో కరీంనగర్‌‌, ‌‌-జగిత్యాల హైవేపై చెట్టు కూలి సుమారు 4 గంటలపాటు ట్రాఫిక్​ నిలిచిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వానకు బోయినిపల్లి నుంచి వేములవాడ మార్గంలో ఉన్న రోడ్డు కల్వర్టు పైనుంచి కోరెం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శంకునికుంట చెరువుకు వరద ప్రవాహం పెరగడంతో కోనాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

పొలం పనులకు వెళ్లిన రైతులను.. గ్రామస్తులు తాడు సాయంతో వాగు దాటించారు.  మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో గంటకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.  లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కామారెడ్డిలో   లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లమీద వరద నీరుప్రవహించింది. విద్యానగర్, నిజాంసాగర్​రోడ్డు, బతుకమ్మకుంట, వివేకానంద కాలనీల్లో  ఇండ్లలోకి నీరు చేరింది. 

ప్రభుత్వ ఆసుపత్రిలోకి వాన నీళ్లు

శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. వార్డుల్లోకి, వరండాలోకి నీరు రావడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. టాయిలెట్స్ దగ్గర నుంచి  వర్షపు నీరు రావడం వల్ల దుర్వాసన వ్యాపించింది. ఆసుపత్రి సిబ్బంది వార్డుల్లో చేరిన నీటిని బయటకు తోడేశారు. 

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన 

గ్రేటర్​హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పటాన్​చెరులో అత్యధికంగా 6.15 సెంటీమీటర్ల వాన పడింది. పగలంతా వాతావరణం పొడిగా ఉండగా.. సాయంత్రం 5 గంటల తర్వాత నల్లటి మేఘాలు సిటీని కమ్మేశాయి. జల్లులతో మొదలైన వాన పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. కుత్బుల్లాపూర్​లో 4.58, లంగర్ హౌస్ లో 4.28, గచ్చిబౌలిలో 3.85, హెచ్​సీయూలో 3.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఐటీ కారిడార్ లో రోడ్లు జలమయమయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాయంత్ర రద్దీ టైమ్​లో వాన కురవడంతో సిటీలోని పలు రూట్లలో ట్రాఫిక్ జాం నెలకొంది. 

ఎల్లో అలర్ట్​ జారీ 

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వాయువ్య అరేబియన్ సముద్రం.. దక్షిణ కేరళ తీరంలో ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల వాతావరణశాఖ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో వర్షాలు కురువొచ్చని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుంది. 

పిడుగుపాటుకు ఇద్దరు బలి

పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలోని నందుప గ్రామంలో దౌత్రే అంజన్న (20) వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా పిడుగు పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అంజన్నను కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కెరమెరి మండల కేంద్రానికి చెందిన చౌదరి రమేశ్ (30) శుక్రవారం షేక్ హుస్సేన్ అనే వ్యక్తి చేనులో పని చేస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మరణించాడు.