జగిత్యాల జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లుతోన్న వాగులు, వంకలు

జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జగిత్యాల టౌన్‎తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోండటంతో జనజీవనం స్తంభించిపోయింది. నాన్ స్టాప్‎గా వర్షం పడుతుండటంతో కాలు బయట పెట్టలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు రోడ్లన్నీ జలయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా ప్రజలకు కలెక్టర్ సత్యప్రసాద్ కీలక సూచన చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని చెప్పారు. 

Also Read : GHMCలో నాన్​స్టాప్ ​వాన

వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అటు వైపు ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు. మట్టి ఇండ్లు, శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో ఎవరు ఉండకూడదని, కరెంట్ పోల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. వాగులు, చెరువుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని కలెక్టర్ ప్రజలకు సూచించారు.