నారాయణపేట జిల్లాలో దంచికొట్టిన వాన

  • పొంగిపొర్లిన వాగులు, వంకలు
  • గ్రామాలకు రాకపోకలు బంద్
  • కూలిన ఇండ్లు, ఒకరు మృతి
  • అలుగు పోస్తున్న చెక్​ డ్యామ్​లు, చెరువులు

నారాయణపేట, వెలుగు:: నారాయణపేట జిల్లాలో 749.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా.. అత్యధికంగా మరికల్​ మండలంలో 138.6 మి.మీ, దామరగిద్దలో 129.2 మి.మీ వర్షం కురిసింది. మహబూబ్​నగర్​ జిల్లా వ్యాప్తంగా 813.9 మి.మీ. కురవగా.. అత్యధికంగా కౌకుంట్ల మండలంలో 88.3 మి.మీ వర్షం పడింది. మరికల్​లో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరాయి. 

మాగనూరు పెద్దవాగు ఉధృతంగా పారడంతో సత్యారం, కొల్పూర్, మందిపాల్, గజారాందొడ్డి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డాకుల మండలంలోని వర్నె-ముత్యాలంపల్లి మధ్య వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది.నారాయణపేట మండలం బండగొండ వాగు దాటే ప్రయత్నంలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న బండగొండ గ్రామానికి చెందిన కొందరు వాగులో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. 

వాగులో ఇరుక్కున కారు..

ఉట్కూరు: మండలంలోని మల్లేపల్లి ముక్కన్న చెరువు అలుగు పారడంతో  కుసుమ హరినాథ దేవాలయం సమీపంలో ఉన్న వాగు ఉధృతంగా పారింది. దీంతో నాగిరెడ్డిపల్లి, మల్లేపల్లి, సోమేశ్వరబండ గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. ఉదయం సోమేశ్వరబండ నుంచి మక్తల్​కు కారులో వెళ్తుండగా, వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. కారులో ఉన్న వ్యక్తి బయటకు దిగి, అక్కడే ఉన్న జాలర్ల సాయంతో కారును ప్రవాహంలో కొట్టుకుపోకుండా బయటకు తీయించాడు. ఉట్కూరు చెరువు అలుగు పోయడంతో దిగువన ఉన్న వరి పొలాలు నీట మునిగాయి.

సంగంబండ గేట్లు ఓపెన్..​

మక్తల్: కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు మక్తల్​ మండలం సంగంబండ రిజర్వాయర్​కు భారీగా వరద వస్తోంది. దీంతో శనివారం ఉదయం ఇరిగేషన్​ ఆఫీసర్లు ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 

జడ్చర్ల హాస్పిటల్​లోకి మళ్లీ వరద..

జడ్చర్ల : వారం కింద ముంపునకు గురైన జడ్చర్లలోని ప్రభుత్వ దవాఖాన మళ్లీ ముంపునకు గురైంది. ఊర చెరువు నాలాల నుంచి వచ్చిన వరద ఆసుపత్రి ఆవరణలో చేరింది. దీంతో హాస్పిటల్​కు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. నేతాజీ చౌక్, మంజూ హోటల్  పరిసరాల్లో వరద నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలు ఇబ్బంది ఏర్పడింది. నసరుల్లాబాద్  చెరువు అలుగు పారడంతో అల్వాన్​పల్లి,- -తంగళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి. 

వనపర్తి జిల్లాలో..

వనపర్తి/ ఖిల్లాగణపురం/మదనాపురం: జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు,  పలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.  పలు మండలాల్లో పాత మట్టి మిద్దెలు కూలాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న ప్రాంతాలను రెవెన్యూ, ఇరిగేషన్​, పోలీస్​ ఆఫీసర్లు సందర్శించి రాకపోకలను నిలిపేశారు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఖిల్లాగణపురం మండలంలో షాపూర్, మానాజిపేట, గణపురంతండా శివారుల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. 

వెంకటాంపల్లి శివారులోని పిల్లివాగులో నీటి ఉధృతితో గ్రామానికి వెళ్లే వాగు వద్దనున్న రోడ్డుపై చెట్ల కొమ్మలు వేసి రాకపోకలను నిలిపివేశారు. ఆగారం, వెంకటంపల్లిలో రెండు పాత మట్టి మిద్దెలు కూలినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మదనాపురం మండలం రామన్​పాడు ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో 1,611 క్యూసెక్కులు వస్తోంది. వరద ఉధృతి పెరగడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో బోరెల్లి రాముడు ఇల్లు 
కూలిపోయింది.

జిల్లాలో విస్తారంగా వానలు

గద్వాల/అలంపూర్, : జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు జిల్లాలో విస్తారంగా వానలు కురిసాయి. ఉండవెల్లి మండలం అలంపూర్  చౌరస్తాలో వెంకట్ సాయి కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. పొగాకు తోటలోకి నీరు చేయడంతో పంట నీట మునిగింది. ఉండవెల్లిలోని చిన్న నాగమ్మ పాత ఇంటి గోడ కూలింది..

ముంచెత్తిన వానలు..​

నాగర్ కర్నూల్: భారీ వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అచ్చంపేట, అమ్రాబాద్, పదర, కోడేరు, బల్మూరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్​లో పాత ఇల్లు కూలింది. అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండల పై నుంచి వస్తున్న వరద నీరు జలపాతంలా మారింది.  జిల్లా కేంద్రంలోని మెయిన్​ రోడ్డు వాగును తలపించింది. నాగర్​కర్నూల్, కొల్లాపూర్​ పట్టణాల్లోని లోతట్టు కాలనీల్లోకి మోకాళ్ల వరకు నీరు చేరింది. బల్మూరు, లింగాల మండలాల్లో చంద్రవాగులో వరద ప్రవాహం పెరగడంతో కొండనాగుల, -బాణాల,చెన్నంపల్లి, -పద్మనపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

కొల్లాపూర్​ మండలం ముక్కిడిగుండం, -నార్లాపూర్​ వద్ద పెద్దవాగులో ప్రవాహం పెరిగింది. కోడేరు వాగుకు వరద రావడంతో కోడేరు, -పస్పుల రోడ్డుపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగులపల్లి తాండ, -రాజాపూర్​ మధ్య వాగు దాటనీయడం లేదు. కల్వకుర్తి మండలం రఘుపతిపేట దగ్గర దుందుభి వాగుకు వరద పెరగడంతో రోడ్డుపై అడ్డంగా పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పత్తి, వరి చేలల్లో వర్షపు నీరు నిలవడంతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.