నిజామాబాద్ జిల్లాలో నిండుకుండల్లా చెరువులు

  • జిల్లాలో​ 266 సె.మీ వర్షం
  • వరద బాధితులకు ఆరుచోట్ల ఆశ్రయం
  • శిథిలమైన ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు
  •  నేడూ స్కూల్స్, కాలేజీలకు సెలవు
  • అలర్ట్​గా అధికార యంత్రాంగం

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో గడిచిన 24 గంటలలో 266 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిరికొండ మండలంలో అత్యధికంగా సోమవారం 17.2 సె.మీ వర్షం కురిసింది. నందిపేటలో 13.0, ముప్కాల్​లో 12.2సె.మీ, ముగ్పాల్​ 10.3, ఎర్గట్ల 11.5, మోర్తాడ్​ 10.8, నవీపేట 10.0 సె.మీ వర్షం నమోదైంది. మిగతా  మండలాల్లో వాన దంచికొట్టింది.  ఏకధాటి వాన, చలి గాలులతో జనం ఇళ్లు విడిచి బయటకు రాలేదు.  జిల్లాలో మొత్తం 1,270 చెరువులు, కుంటలు ఉండగా అన్ని చోట్లా వర్షం నీరు చేరింది. వర్షం ఎక్కువ కురిసిన మండలాల్లో చెరువులు అలుగుపారాయి.  వాగులు, అలుగు పారిన చోట పంటలు దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి  కొనసాగితే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. 

71 ఇండ్లకు నష్టం

గోదావరి ఉగ్రరూపంతో నది పరీవాహక ప్రాంతాలను రెవెన్యూ ఆఫీసర్లు అలర్ట్​ చేశారు. చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని చాటింపు వేయించారు. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షం, వరదల ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజుల నుంచి 71 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.  మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో కూలే స్థితిలో 42 ఇండ్లు ఉన్నట్లు గుర్తించి వాటిని ఖాళీ చేయాలని కమిషనర్​ మంద మకరంద్​ నోటీసులు జారీ చేశారు.  

జక్రాన్​పల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస సెంటర్​లో రెండు కుటుంబాలకు వంట సరుకులు అందించారు. వర్ని మండలంలోని హుమ్నాపూర్, సత్యనారాయణపురం, రుద్రూర్ మండలంలోని చిక్కడ్​పల్లి, బోధన్​ మండలంలోని బెల్లాల్​లో వర్షం బాధితుకులకు గవర్నమెంట్​ తరపున తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. మంజీరా పరీవాహక ప్రాంతంలోని బోధన్​ మండలం హంగర్గా విలేజ్​ చుట్టూ వరద నీరు చేరుతున్నందున అక్కడి కుటుంబాలను సేఫ్​ ప్లేస్​కు షిఫ్ట్​ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.

నిండిన అలీసాగర్​ రిజర్వాయర్​

నగరానికి తాగునీరు అందించే అలీసాగర్​ రిజర్వాయిర్​ పూర్తిగా నిండింది. పూర్తి కెపాసిటీ 1299.06 ఫీట్లుకాగా పూర్తి మట్టం నీరు చేరినందుక ఒక గేట్​ ఓపెన్​ చేసి 900 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ధర్పల్లి మండలం రామగుడు ప్రాజెక్టు నిండుకొని అలుగు పారుతోంది. 10,295 క్యూసెక్కుల నీటిని ఇంజనీర్లు బయటకు వదిలారు.  బోధన్ టౌన్​ ప్రజానీకానికి తాగునీరు అందించే బెల్లాల్​ ట్యాంక్​ పూర్తి కెపాసిటీలో నిండింది. ​ 

నేడు కూడా సెలవే

వర్షాలు, వరదల తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని  కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు మీడియాకు తెలిపారు. గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఏవీ పనిచేయవని వివరించారు. స్టూడెంట్స్​కు ఇబ్బంది కలుగకూడదనే ఆలోచనతో సెలవు ప్రకటించామన్నారు. 

18 చోట్ల అర్​అండ్​బీ రోడ్స్​కు ఎఫెక్ట్​

నిజామాబాద్​ రూరల్​ సెగ్మెంట్​లో  గడ్కోల్​, వాడీ, తిరుమన్​పల్లి, నర్సింగ్​పల్లి, సిరికొండ, సిర్నాపల్లి, కొండూర్​, లింగాపూర్​, గుడియా తాండ, బాడ్సి  రోడ్లు తెగిపోయాయి. ఆర్మూర్​ సెగ్మెంట్​లో పిప్రీ, బాల్కొండ సెగ్మెంట్​లో పాలెం, పడ్కల్​, కోనాపూర్,​ బాన్స్​వాడ సెగ్మెంట్​ పరిధిలోని జలాల్​పూర్​, బొప్పాపూర్​, కొల్లూర్​, కుర్నాపల్లి- మోస్రా రోడ్లు దెబ్బతిన్నాయి.  పంచాయతీరాజ్​ రోడ్డు ఆరు చోట్ల దెబ్బతిని రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది.