మిడ్ మానేర్ కు భారీగా వరద

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర( మిడ్ మానేర్ ) ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. మూల, మానేరు, గంజి వాగుల ద్వారా ప్రాజెక్టుకు 33,805 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ ల మీదుగా వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ కు నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 

6,300 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టులోకి వదులుతున్నారు. అలాగే ఎల్ఎండీకి 3 వేలు, ప్యాకేజీ10కి 6,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం ప్రాజెక్టులో 27.54 టీఎంసీలకుగాను 15.83 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి ఇంత భారీస్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి. 

14 టీఎంసీలకు చేరిన లోయర్ మానేర్

తిమ్మాపూర్, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ లోకి 39,047 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం సాయంత్రానికి డ్యామ్ నీటిమట్టం 14 టీఎంసీలకు చేరింది. మిడ్ మానేరు నుంచి మరో 3 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీలోకి వస్తోంది.