యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. ఒకరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో సాంకేతిక లోపంతో రియాక్టర్ పేలిపోయింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. 

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కనకయ్య, ప్రకాశ్ అనే ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉండగా.. క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే కనకయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు జనగాం జిల్లా బచ్చన్నపేటకు వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గాయపడిన మరో వ్యక్తి మొగిలిపాక ప్రకాశ్ గా గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో  ఇంకా ఎవరైనా లోపల మంటలలో చిక్కుకున్నారేమోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తు్న్నారు.