శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం తెల్లవారుజూమున బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. మరి కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తోన్న భద్రతా దళాలు.. టెర్రరిస్టుల ఏరివేత ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఉత్తర కాశ్మీర్ జిల్లా పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీరీలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు అధికారులను అలర్ట్ చేశాయి.
ఇంటలిజెన్స్ రిపోర్ట్ తో అప్రమత్తమైన భద్రతా దళాలు, జమ్ము కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. కుంబింగ్ చేస్తోన్న క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు మొదలయ్యాయి. దాదాపు కొన్ని గంటల పాటు భీకరంగా జరిగిన ఈ కాల్పుల్లో భద్రతా దళాల చేతిలో ముగ్గురు టెర్రరిస్టులు హతం అయ్యారు. దీనికి ముందు జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం నలుగురు జవాన్లు గాయపడగా.. అందులో ఇద్దరు మృతి చెందారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు:
జమ్ముకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఫస్ట్ టైమ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈసీ జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న మొత్తం మూడు దశల్లో జమ్మూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జమ్మూలో ప్రచారం హోరెత్తించేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఇవాళ శనివారం జమ్ము కాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ పర్యాటన వేళ జమ్మూ కాశ్మీర్ లో వరుస ఎన్ కౌంటర్లు జరగడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జమ్మూలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.