స్వామియే శరణం అయ్యప్ప… ఓవైపు శరణు ఘోష మరోవైపు భక్తుల అరగోస. గతంలో ఎన్నడూలేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతంగా క్యూలైన్‌లో భక్తులు నిరీక్షిస్తున్నారు. శబరి కొండ కిటకిటలాడుతోంది. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. పంబ దగ్గర భారీ క్యూ ఉండటంతో చిన్నారులు వృద్దులు ఇబ్బంది పడుతున్నారు. తొక్కిసలాట జరిగిన తరువాత కూడా ట్రావెల్ కోర్ పరిస్థితి మారలేదు.రద్దీ నేపథ్యంలో శబరిపీఠం నుంచి పంబ వరకూ క్యూలైన్ విస్తరించింది. భక్తులను పోలీసులు కంట్రోల్ చేయలేక లాఠీ చార్జ్ చేశారు. అయితే గతంలో ఇంతవరకు ఎన్నడు శబరిమలలో లాఠీచార్జ్ జరగలేదని భక్తులు వాపోతున్నారు. రోజుకు 80 నుంచి లక్ష వరకూ వస్తుండటంతో… దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటల పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు దీరారు. క్యూలైన్‌లో నిరీక్షించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు.
శబరిమలలో ప్రతి ఏడాది మకర విళక్కు... జ్యోతి దర్శనం సమయంలో రద్దీ కొత్త కాదని.. ఈ ఏడాది కేరళ ప్రభుత్వం.. ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని కేరళ హిందూ ఐక్యవేదిక అధికార ప్రతినిధి ఆర్ వి బాబు అన్నారు. తమ సంస్థ అధ్యక్షురాలైన శశికళ టీచర్ నవంబర్ 2వ వారంలోనే స్వామి సన్నిధానం దర్శించి, మీడియా సమావేశం లో అక్కడ ఏర్పరచని కనీస అవసరాల గురించి ప్రస్తావించినా కూడా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
పోలీసుల నియామకంలో పక్షపాత ధోరణి
శబరిమలై యాత్రకు సంబంధించి నీలక్కల్ మొదలుకొని పంబా మీదుగా స్వామి సన్నిధానం వరకు కేవలం 650 మంది పోలీసులను మాత్రమే నియమించారు. కాని కేరళ ప్రభుత్వం 16 వేల పోలీసు బలగాలను నియమించామని చెబుతుంది. పంబా ప్రాంతంలో భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎవరూ లేరని వాపోతున్నారు. 10, 15 మంది కన్నెమూల గణపతి దగ్గర భక్తులు కంట్రోల్ చేయలేక లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. క్యూలైన్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని సమాచారం అందుతోంది.
టిడిబి మరియు పోలీసుల మధ్య సమన్వయ లోపం
శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్స్ తీసుకుంటారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఇదివరకటి వరకు కేరళ పోలీసుల వారు చూసుకునేవారు. వారి ఆధ్వర్యంలో నిర్వహించినంత కాలం ఓ మోస్తారు బాగానే నడిపించారు. కానీ ఈ విధి నిర్వహణను పోలీసుల నుండి తప్పించి టిడిబి తీసుకొని సొంతంగా నిర్వహిస్తున్నది. వీరు సమర్థవంతంగా నిర్వహించకపోవడం వల్లనే శబరిమలలో రద్దీకి సమస్య.
పంప వద్ద ప్రైవేటు వాహనం పార్కింగ్ ఏమైంది?
కేరళలో వరదలు రాకముందు, పంబానది వరకు ప్రతి వాహనాలను అనుమతించేవారు. పంబ వద్దనున్న హిల్ టాప్ పైన దాదాపు 4 వేలకు పైగా ఫోర్ వీలర్స్ పార్క్ చేసుకునే సదావకాశం ఉన్నది. కానీ వరదల కారణంగా 2018లో కేరళ హైకోర్టు ప్రైవేటు వాహనాలను నిలకల్ వద్దనే ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వరదల కారణంగా వచ్చినయి కాబట్టి ఇప్పుడు వరదలు ఏమి లేవు కనుక పంబ వరకు వాహనాలను అనుమతించే వెసులుబాటు కల్పించమని కేరళ హైకోర్టుని ఆశ్రయించాల్సిన బాధ్యత టిడిబి పై ఉన్నది. అలా కనక చేస్తే ట్రాఫిక్ ని అధిక శాతంలో మనము అదుపు చేయగలము. కానీ, ఏమీ పట్టనట్టు సోయి లేకుండా పడి ఉన్న ఈ దేవస్థానం బోర్డ్ అలాంటి ఎలాంటి ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఏటా కోట్ల భక్తులు – కోట్లలో కేరళ ప్రభుత్వానికి ఆదాయం
ఈ యొక్క శబరిమల యాత్రకి దేశం నలుమూలల నుండి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తుల సందర్శన విపరీతంగా ఉంటుంది. నవంబర్ 16 మొదలుకొని 2 నెలల వరకు అఖండ భక్తజన సందోహంతో కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో ఉన్న శబరిమల కళకళలాడుతుంది.
ఏడాది పొడవునా ఏ దిశగా రాని ఆదాయం ఈ మండలకాల మకర విలక్కు రెండు నెలల సమయంలో విపరీతమైన ఆదాయం వస్తుంది. అలాంటప్పుడు భక్తులకు కనీస అవసరాలు కూడా ప్రభుత్వం ఏర్పరచకుంటే ఎలా? ఆర్టీసీ డ్రైవర్లు చెప్పిన దాని ప్రకారం ఒక బస్సులో 49 మంది ప్రయాణికులు వెళ్లవచ్చు. కానీ దాదాపు 120 మంది ప్రయాణికులు ఒక బస్సులో ఎక్కుతున్నారట. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేరళ ప్రభుత్వం పంబ నుండి నిలక్కల్ వరకు కావలసిన కనీస కె ఎస్ ఆర్ టి సి బస్సులు సైతం నియమించలేని పరిస్థితిలో ఉంది.