శబరిమల రద్దీ ఎందుకు.. ఎప్పుడూ లేనిది.. కారణాలు ఏంటీ..?

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొంతమంది దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. లక్షలాది మంది వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత నాలుగైదు రోజులుగా ( డిసెంబర్​ 14వ తేదీకి) రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు.. దర్శనం లేట్ అవుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రిటన్​ టికెట్​ రిజర్వేషన్​ చేయించుకోవడంతో  దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు.

శబరిమలలో భక్తుల రద్దీకి కారణాలు ఇవే

  • శబరిమలలో అనుభవం ఉన్న పోలీసులు విధుల్లో లేకపోవడం
     
  • భక్తుల రద్దీని అంచనా వేయడంలో ట్రావెల్​ కోర్​ దేవస్థానం విఫలం కావడం
     
  • ఈ ఏడాది కొత్త పోలీసు బృందం బాధ్యతలు స్వీకరణ... ఆలయ ప్రాంగణలో అధికారులు భక్తుల క్రౌడ్​ కంట్రోల్​ చర్యలను పరిశీలించకపోవడం 
     
  • వర్చువల్​క్యూలో ముందుగానే భక్తులు దర్శనం బుక్​ చేసుకున్న ... దానికి అనుగుఫంగా పోలీసలు.. దేవస్థాన అధికారులు చర్యలు తీసుకోకపోవడం 
     
  • పదునెట్టాంబడి దగ్గర భక్తులు నెమ్మదిగా కదలడం.. 18 మెట్ల దగ్గర పోలీసులు లేకపోవడం
     
  • పదునెట్టాంబడి దగ్గర దాదాపు నాలుగు గంటలు భక్తులు వేచి ఉండటం..
     
  • కేరళ పోలీసులకు.. దేవస్థానం అధికారులకు సమన్వయం లేకపోవడం 
     
  • రద్దీ సమయాల్లో కేరళ ఆర్టీసీ ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయకపోవడం..
     
  • గతంలో సన్నదానం దగ్గర 2 వేలకు పైగా పోలీసులు విధులు నిర్వహిస్తే ..ఈ ఏడాది 600 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. 


శబరిమలలో క్యూలైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం వహించారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అయ్యప్ప దర్శనానికి ఎక్కువగా సమయం పడుతుండటంతో కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు.

మరోవైపు.. శబరిమలకు వెళ్లే రహదారుల్లో బుధవారం ( డిసెంబర్​ 13)  కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. మండల దీక్ష పూర్తి చేసి అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు  శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  దీంతో అయ్యప్ప  భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. తమ వాహనాలను అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.  

ఇదిలా ఉంటే....

శబరిలమలో నెలకొన్న పరిస్థితుల పైన కేరళ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతున్నారు.  రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందనీ.... యాత్రికులను వెంబడించి పట్టుకోలేమనీ...  కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దనీ, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరించాలని కోరారు. దీని పైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.  శబరిమల అభివృద్ధికి 220 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రోజుకు 1.20 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న దృష్ట్యా.. దర్శన సమయాన్ని మరో గంట పెంచాలని ఆలయ అధికారులు నిర్ణయించారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.