హాస్పిటల్ పై నుంచి దూకి పేషెంట్ సూసైడ్​.. నిజామాబాద్​ సిటీలోని జీజీహెచ్​లో ఘటన

నిజామాబాద్, వెలుగు: గుండె జబ్బుతో బాధపడుతున్న పేషెంట్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిటీలోని నాగారం ఏరియాకు చెందిన చాట్ల లక్ష్మణ్​ (50) కూలీ పనులు చేసుకుంటూ.. భార్య శకుంతల, కొడుకుతో నివసిస్తున్నాడు.  కొన్నేండ్లుగా అతడు గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈనెల 6న లక్ష్మణ్ తీవ్ర అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ​హాస్పిటల్​(జీజీహెచ్)​లో అడ్మిట్​అయ్యాడు. తీవ్ర మనోవేదనకు లోనైన లక్ష్మణ్​తన ఆరోగ్యం బాగుపడదని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని తరచూ భార్యతో చెప్పేవాడు. 

మంగళవారం తాగునీరు తెచ్చేందుకు భార్య ఆస్పత్రి బయటకు వెళ్లింది. లక్ష్మణ్ ఆస్పత్రి బిల్డింగ్ 6వ ఫ్లోర్ లోకి వెళ్లి దూకేందుకు యత్నించాడు. ఇతర పేషెంట్లు చూసి ఆపేందుకు ప్రయత్నించగా వారిని వెనక్కి నెట్టి కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో స్పాట్ లో చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.