స్వచ్ఛ ఆటోలు చాలట్లే.. చెత్త సమస్య తీరట్లే

  • గ్రేటర్​లోని రోడ్ల క్లీనింగ్ అంతంత మాత్రమే.. 
  • జీవీపీలు ఎత్తేసిన చోట పేరుకుపోతున్న చెత్త కుప్పలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో రోడ్లను సరిగ్గా క్లీన్ చేయడం లేదు. చెత్త కుప్పలు పేరుకుపోయి కాలనీలు, బస్తీలు కంపుకొడుతున్నాయి. కొన్నిచోట్ల పేరుకుపోయిన చెత్తను రాత్రి వేళల్లో జనం తగలబెడుతున్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీ చేయడమే లక్ష్యమని జీహెచ్ఎంసీ అంటున్నప్పటికీ.. రోజురోజుకు సమస్య మరింత తీవ్రమవుతోంది. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల(జీవీపీ)ను ఎత్తివేసిన చోట సమస్య ఎక్కువైంది. మొత్తం 2,541 జీవీపీలను గుర్తించి ఎలిమినేట్ చేశామని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ, ఇంటికి స్వచ్ఛ ఆటోలు రాని ప్రాంతాల వారు చెత్త ఎక్కడ వేయాలో తెలియక తిరిగి జీవీపీలు తొలగించినచోటనే తెచ్చి పోస్తున్నారు.

 కొంతమంది రాత్రి సమయంలో దగ్గర్లోని రోడ్ల వెంట పారబోస్తున్నారు. దీంతో చెత్త సమస్యపై బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్​నుంచి కాలనీలు, బస్తీల వరకు చెత్త కుప్పులు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 గ్రేటర్ లో 4 వేల కాలనీలు ఉండగా వెయ్యికిపైగా కాలనీల్లో చెత్త సమస్య ఉంది. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించాల్సిన స్వచ్ఛ ఆటోలు 4,500 ఉన్నప్పటికీ, ఇందులో దాదాపు వెయ్యి వరకు ఫీల్డ్ లోకి రావడంలేదు. వచ్చిన వారు లిమిటెడ్ గా మాత్రమే చెత్తను తీసుకెళ్తామని కండిషన్స్ పెడుతున్నారు.  ఇలా 25 శాతం వరకు ఆటోలు ఫీల్డ్ లో లేకపోవడంతో చెత్త సేకరణ జరగడంలేదు. 

కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ లో కేవలం 4,500 ఆటోలు సరిపోవడం కూడా కష్టమే. ఆటోలు రాకపోవడంతోనే రోడ్లపై చెత్త వేస్తున్నామని కొన్ని కాలనీల వాసులు చెబుతున్నారు. రెగ్యులర్ గా ఆటో వస్తే ఆటోలోనే వేస్తామని అంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే ఎక్కడా చెత్త సమస్య లేదని జీహెచ్ఎంసీ అధికారులు సమాధానం ఇస్తున్నారు.