2024 కొత్త కొత్తగా...

న్యూ ఇయర్​ వస్తోందంటే... ప్రతి ఒక్కరిలో ఎన్నో ఆశలు చిగురిస్తాయి. ఈ ఏడాదైనా ఏదో ఒకటి సాధించాలి అనుకోవడం సహజం. అయితే, ఏది సాధించాలన్నా ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. అది ఒక్కటి ఉంటే చాలు.. ఏదైనా సాధించొచ్చు అనే ధైర్యం వచ్చేస్తుంది. ఆటోమెటిక్​గా సంతోషమూ వస్తుంది. ఉన్నన్నాళ్లూ సంతోషంగా జీవించాలనే కదా ఎవరైనా కోరుకునేది. 

కాబట్టి హెల్త్​ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘ఈ ఏడాది నుంచి హెల్త్​ మీద ఫోకస్​ పెట్టాలనే నిర్ణయం తీసుకోవాలి. అది కూడా ముఖ్యంగా మూడు విషయాల మీద దృష్టి పెట్టి హెల్త్​, హ్యాపీనెస్​ సొంతం చేసుకోండి’’ అంటున్నారు ఎక్స్​పర్ట్స్. అందుకు కొన్ని సజెషన్స్​ కూడా చేశారు వాళ్లు. ఆ సంగతులే ఈ వారం కవర్​ స్టోరీ. 

ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుందని అర్థం. ఈ సూత్రాన్ని ఆరోగ్యానికి అప్లయ్​ చేస్తే... హెల్త్​ విషయంలో ఎంత చిన్న మార్పు వచ్చినా వెంటనే అలర్ట్​ కావాలి. లేకపోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. శక్తి కోల్పోయాక, శరీరం సహకరించనప్పుడు ఏం చేయాలన్నా కష్టం అవుతుంది. అప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏంచేయలేరు ఎవరైనా. అందుకే హెల్త్ గురించి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయొద్దు.

మొదటి నిర్ణయం

కొత్త ఏడాదిలో హెల్త్ గురించి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అని అడిగితే.. సరైన సమాధానం రాదు. ఎందుకంటే... ‘మొదలుపెట్టడమే హెల్త్ గురించా?’ అనేంత భయం వాళ్లని మాట్లాడనివ్వదు. కొందరిలో ‘నాకేమవుతుందిలే’ అనే నిర్లక్ష్యం. ఏదైనా అయితే అప్పుడు చూద్దాంలే అని వాయిదాలు వేసేవాళ్లు ఇంకొందరు. కానీ, హెల్త్​ విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఏడాదిలో తీసుకోవాల్సిన నిర్ణయాల్లో మొదటిది హెల్దీగా ఉండడమే. పూర్వం రోజుల్లో ఎంత శారీరక శ్రమ అయినా అలుపులేకుండా పనిచేసేవాళ్లు. వండుకున్నదేదో తినేవాళ్లు. తిరిగి పనుల్లోకి వెళ్లిపోయేవాళ్లు. అప్పట్లో చాలామందికి ఉన్నంతలో హాయిగా జీవించాలనేది ఫిలాసఫీ. కానీ, ఇప్పుడు...ఇతరులకంటే బాగా బతకాలనే కోరిక. అందుకు ఏదైనా చేయాలనే పోటీ తత్వం పెరిగిపోయింది. 

ఇలాంటి ఆలోచనలు ఉంటే ఒత్తిడి పెరగక ఏమవుతుంది? దాంతో తిండి, నిద్రలో భయంకరమైన మార్పులు వచ్చాయి. క్రమక్రమంగా లైఫ్ స్టయిల్​ పూర్తిగా మారిపోయింది. దాని ఫలితమే అనేక రకాల అనారోగ్యాలు చుట్టుముట్టడం. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ అనారోగ్యం బారిన పడ్డాక దానికి ఫుల్​ స్టాప్​ పెట్టేదెలా? అనే ఆలోచన మొదలవుతుంది. 

అంతవరకు వెయిట్ చేసి అనారోగ్యం వచ్చాక మేలుకుంటే ఏం లాభం? ట్రీట్​మెంట్ చేయాలన్నా శరీరం సహకరించాలి కదా. ఇలాంటప్పుడే డాక్టర్లు ‘కొంచెం ముందు తీసుకొస్తే నయమయ్యేది’ అనే మాట చెప్తుంటారు. అందుకే హెల్త్​ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనేది. అలాగే ఫ్యూచర్​ జనరేషన్​కి గిఫ్ట్​గా ఏం ఇవ్వగలం? అని ఆలోచిస్తే దొరికే ఆన్సర్ కూడా ఆరోగ్యమే​. కాబట్టి శారీరకంగా, మానసికంగా హెల్దీగా ఉండాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్.

హెల్దీగా ఉండడం అంటే.. 

హెల్దీగా ఉండడం అంటే.. శరీరం ఒక్కటే కాదు మనసు కూడా. ఈ రెండూ మెయింటెయిన్ చేసేది లైఫ్ స్టయిల్. అవి కరెక్ట్​గా మెయింటెయిన్ అవ్వాలంటే రోజూ ఫిజికల్ యాక్టివిటీస్​ చేయాలి. టైంకి తినాలి. జంక్​ ఫుడ్​కి దూరంగా ఉండాలి. ఇంట్లో వండినవాటికే ప్రిఫరెన్స్​ ఇవ్వాలి. తాజాగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. రోజూ వాకింగ్, ఎక్సర్​సైజ్​, యోగా వంటివి చేయాలి. మంచి నిద్రపోవాలి. 

ఎక్కువసేపు కూర్చుని పనిచేయకూడదు. స్పిరిచ్యువల్​ కనెక్షన్​ కూడా అవసరం. ఇవన్నీ రోజువారీ జీవితంలో ఒక భాగం అయితే కచ్చితంగా ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఇవన్నీ చదువుతుంటే... ‘అన్నీ తెలిసినవే. కొన్ని చేస్తున్నాం’ కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ చెప్పిన వాటిలో ఎన్ని ఫాలో అవుతున్నారో లిస్ట్​ రాసి చూడండి. ఇవి ఒకదానికొకటి ఇంటర్​లింక్​ అయి ఉంటాయి. అందుకే ఈ హెల్దీ హ్యాబిట్​ చెయిన్​ దెబ్బతినకూడదు. 

మళ్లీ వస్తుందట!

మళ్లీ కరోనా వస్తోందని వార్తల్లో చదువుతున్నాం. వింటున్నాం. అలాగని కొవిడ్ గురించి ప్యానిక్​ అవ్వాల్సిన పనిలేదు. ఆ వార్తలు ఎక్కువగా వినడం వల్ల ఆందోళన పెరుగుతుంది. అలాకాకుండా కొవిడ్​ సోకకుండా జాగ్రత్తలు పాటించాలి. గుంపులుగా ఉన్నచోటుకి వెళ్లకపోవడం బెటర్. ఇంటినుంచి బయటకి వెళ్తే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. జలుబు, దగ్గు ఉంటే ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడాలి. 

పనేమి లేకపోయినా మాటిమాటికి బయటకు వెళ్తుంటారు కొందరు. అలాంటి అలవాటు మానడం బెటర్​. కరోనా వైరస్​ ఎఫెక్ట్​ ఎక్కువగా లంగ్స్​ మీద పడుతుంది. కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు చేయాలి. జలుబు, దగ్గు లక్షణాలు ఎక్కువ రోజులు తగ్గకపోతే డాక్టర్​ దగ్గరకి వెళ్లాలి. అంతేకానీ మెడికల్​ షాపుకి వెళ్లి యాంటీబయాటిక్స్ తెచ్చుకుని ఇష్టానికి వాడకూడదు. 
*   *   *

రెండో నిర్ణయం

కొత్త ఏడాదిలో ఏదైనా చేయాలనే నిర్ణయం తీసుకోమంటే... ఎక్కువశాతం ‘ఇప్పటి నుంచి ఫిట్​నెస్ మెయింటెయిన్​ చేస్తాం’ అంటారు. అంతేకాదు.. ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య ఉందని ఎవరైనా చెప్పారే అనుకోండి. వెంటనే ‘ఫిట్​గా ఉండాలి. ఫిట్​నెస్ మెయింటెయిన్ చేయకపోతే ఇలాగే ఉంటుంది’ అని చెప్తారు. అసలు ఫిట్​నెస్​ ఎలా మెయింటెయిన్​ చేయాలి? ఫిట్​గా ఉండాలంటే ఏం చేయాలి?  అనేదానిగురించి సెలబ్రిటీ ఫిట్​నెస్​ ట్రైనర్​ అయిన మోహన్​లాల్ ఇలా చెప్పాడు... 

ఫిట్​నెస్ అంటే...

ఫిట్​నెస్ అనేది ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకునే వస్తువు కాదు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే కాళ్లుచేతులు ఆడిస్తుంటాం. బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ మూమెంట్స్ ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. మనిషి పుట్టుకలోనే ‘ఫిట్​నెస్’ ఉంది. ఫిట్​నెస్​  అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ, దాన్ని సరిగ్గా మెయింటెయిన్​ చేయకపోవడం వల్లే సమస్యలు వస్తాయి. 

అయితే ఫిట్​నెస్​ కోసం ఎక్సర్​సైజ్​ చేయాలనుకునే వాళ్లు ముందు డాక్టర్​ని కలవాలి. ఎక్సర్​సైజ్​ చేసేందుకు మెడికల్​ ఫిట్​నెస్​ ఉందో, లేదో తెలుసుకోవాలి. వయసు​కి తగ్గట్టు ఫిట్​నెస్ వర్కవుట్స్ చేయాలా? వద్దా? ఎలాంటి ఫిట్​నెస్ చేయాలి? అనే విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఆ తరువాత ట్రైనర్ చెప్పింది ఫాలో కావాలి. గైడెన్స్ లేకుండా ఏదో ఒకటి చేస్తామంటే కుదరదు. 
 

జిమ్​లో ఫిట్​నెస్ ట్రైనర్ చెప్పింది విని, సరిగ్గా చేస్తే చాలు. జిమ్​కి ఖర్చు పెట్టుకోలేం అనేవాళ్లు ఇంటి దగ్గరే మామూలు ఎక్సర్​సైజ్​లు చేసుకోవచ్చు. కాకపోతే.. ఏదైనా మొదలుపెట్టే ముందు ఎక్స్​పర్ట్​తో మాట్లాడడం ముఖ్యం. ఉదాహరణకు అరవయ్యేండ్ల వయసులో బరువులు ఎత్తాలంటే చేతకాదు. అదే యుక్త వయసులో ఉన్నప్పుడే మొదలుపెడితే అదే అలవాటుగా మారుతుంది. 

ఫిట్​నెస్​ మెయింటెయిన్​ చేయడం అనేది లైఫ్​ స్టయిల్​లో భాగం కావాలి. అందుకని పిల్లలు నడక నేర్చినప్పటి నుంచే రోజూ ఫిట్​నెస్​కి సంబంధించిన వ్యాయామాలు నేర్పించాలి. అదే పెద్దయ్యాక కూడా అలవాటవుతుంది. అలాకాకుండా పెద్దవాళ్లమైపోయాం. ఇప్పుడు ఫిట్​నెస్​ కోసం వ్యాయామాలు చేయాలంటే కుదరదా? అంటే. ఎందుకు కుదరదు. అది కూడా కుదురుతుంది. దానికి ముందు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్​ని లేదా హెల్త్​ అండ్ ఫిట్​నెస్ ఎక్స్​పర్ట్​ని కలవాలి. కరోనా మళ్లీ వస్తోందని వింటున్నాం. కాబట్టి దాని గురించి కూడా కంగారు పడకండి. శ్వాసను మెరుగుపరిచే ఎక్సర్​సైజ్​లు చేయాలి. అవెలా చేయాలంటే...
    

    నిటారుగా నిలబడాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లేపాలి. శ్వాస వదులుతూ చేతుల్ని కిందికి దింపాలి. 
    చేతుల్ని భుజాలకు ఎదురుగా చాచి, నెమ్మదిగా వాటిని వెడల్పు చేస్తూ లంగ్​ కెపాసిటీ ఉన్నంతమేరకు వెనక్కి చాపాలి. 
    రెండు చేతుల్ని ఎదురుగా చాచి, ఒక అరచేతిని నిలువుగా పెట్టి, రెండో అరచేతిని అడ్డంగా పెట్టి రెండు బొటనవేళ్ల మధ్యలో ఢీ కొట్టాలి. అలా రెండు మూడుసార్లు చేతులు మారుస్తూ చేయాలి. 
    చేతులు ముందుకు పెట్టి, రెండు అరచేతుల చివర్లను ఢీ కొట్టాలి. అలా స్పీడ్​గా నాలుగుసార్లు చేయాలి. 
    పిడికిలి బిగించి, ఒక చేతిని ముందుకు చాపాలి. రెండో చేత్తో గట్టిగా రెండుసార్లు కొట్టాలి. అలాగే మరో చేతికి కూడా చేయాలి. 
    చేతులు పైకెత్తి పిడికిలి బిగించి శ్వాస తీసుకోవాలి. పిడికిలి అలానే ఉంచి, బలాన్ని ఉపయోగించి శ్వాస వదులుతూ బలంగా దించాలి. 
    కూర్చుని, కప్​లో నీళ్లు పోసి స్ట్రా నోట్లో పెట్టుకుని బుడగలు ఊదినట్లు చేయాలి. కాసేపు ఊదాక స్ట్రా నోట్లో అలానే ఉంచుకుని శ్వాస తీసుకోవాలి. ఇలా నాలుగుసార్లు చేయాలి. 
    నిలబడి, పిడికిలి బిగించి చేతుల్ని ముందుకు చాపుతూ శ్వాస తీసుకోవాలి. చేతుల్ని ఫోర్స్​గా వెనక్కి తీసుకుంటూ శ్వాస వదలాలి. 
    రెండు చేతులు ముందుకు చాచి, అరచేతులతో పెద్దగా చప్పట్లు కొట్టాలి.
    రెండు చేతులతో అరచేతులు టచ్​ అయ్యేలా నాలుగుసార్లు చప్పట్లు కొట్టాలి. వెంటనే వేళ్లు మాత్రమే టచ్​ అయ్యేలా చప్పట్లు కొట్టాలి. 
    రెండు చేతుల్ని ముందుకు చాపి, ఒక చేతిని పిడికిలి బిగించాలి. దాన్ని రెండో చేతికి కొట్టాలి. తర్వాత రెండో చేతిని కూడా పిడికిలి బిగించి బొటనవేలు చివర్లు, చిటికెన వేలి చివర్లు ఒకదాని తర్వాత ఒకటి టచ్​ అయ్యేలా ఢీ కొట్టాలి. 
    రెండు టిష్యూ పేపర్లు చేత్తో పైకి పట్టుకుని శ్వాస తీసుకుని, వదలాలి. శ్వాస ఎంత బలంగా ఉందో టిష్యూ కదిలేదాన్ని బట్టి తెలుస్తుంది.
 యాక్టివ్ లైఫ్ స్టయిల్
శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. శారీరకంగా చురుకుగా ఉండడం అంటే... జిమ్ చేయడం, పరిగెత్తడం వంటివి మాత్రమే కాదు. వయసు, శరీర ఆరోగ్యం, బాడీ లాంగ్వేజ్​కు తగ్గట్టు ఫిట్​నెస్ మెయింటెయిన్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీస్, మెడిటేషన్, బ్రీతింగ్​ కంట్రోల్​ ఎక్సర్​సైజ్​లు చేయాలి. 
*   *   *

మూడోది... ముఖ్యమైనది

ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతుందో టెక్నాలజీలో వచ్చే మార్పుల్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా టీవీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్​లు, ల్యాప్​టాప్​లు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ గాడ్జెట్లకు అలవాటుపడ్డారు. అవి లేనిదే పొద్దు గడవట్లేదు చాలామందికి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లైఫ్​లోకి వచ్చాక లైఫ్​స్టయిలే మారిపోయింది. దానివల్ల మానసికారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకని కొత్త ఏడాదిలో మనసు మీద కాస్త దృష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్. కొత్త ఏడాదిలో మానసికారోగ్యం​ విషయంలో బలం​గా తయారవ్వాలి అంటే ఈ సూత్రాలు పాటించాలి అంటున్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్​ అస్ఫియా కుల్సుమ్. 

సోషల్ నెట్​వర్క్

ప్రతి ఒక్కరికీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్​. ఈ రోజుల్లో మొబైల్స్ పట్టుకుని సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చూడటం సరిపోతుంది. పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. ఇంట్లో వాళ్లతో సరిగా మాట్లాడట్లేదు. నలుగురు కలిసి ఒకచోట కూర్చున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. అలా కాకుండా క్యారమ్స్, చెస్​ వంటి గ్రూప్​ గేమ్స్​ ఆడుకోవాలి. ఒకరితో ఒకరు కనెక్ట్​ అయ్యే యాక్టివిటీస్ చేయాలి. సోషల్​ మీడియా నెట్​వర్క్​తో కాకుండా సోషల్​ నెట్​వర్క్ అలవాటు చేసుకోవాలి. పక్కనుండే వాళ్లతో మాట్లాడాలి. విషయాలు, ఫీలింగ్స్ షేర్​ చేసుకోవాలి. ఒకరినొకరు మోటివేట్ చేసుకోవాలి. 

వాళ్లని వాళ్లు బిజీగా...

మైండ్ ఎప్పుడూ బిజీగా ఉండాలి. లేదంటే అనవసరమైన ఆలోచనలతో నిండిపోతుంది. దానివల్ల మానసికం​గా వీక్​ అయిపోతారు. అలాకాకూడదంటే... డ్రాయింగ్, పెయింటింగ్, గార్డెనింగ్.. ఇలా నచ్చిన హాబీల మీద శ్రద్ధ పెట్టాలి. మనసుకు నచ్చే ఈవెంట్స్​లో పాల్గొనాలి. దానివల్ల యాంగ్జయిటీ, స్ట్రెస్ తగ్గుతాయి. 

ఫిజికల్ యాక్టివిటీలు

మనిషికి ఫిజికల్​ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం. రోజుకి దాదాపు ఇరవై నిమిషాల పాటు ఎక్సర్​సైజ్ చేయాలి. దానివల్ల ఎంత ఒత్తిడి ఉన్నా తగ్గిపోతుంది. మైండ్ ఫ్రెష్​గా ఉంటుంది. మనసు తేలికపడుతుంది. రోజంతా యాక్టివ్​గా పని చేసుకునేందుకు సాయపడుతుంది. 

చదవాలి.. రాయాలి

కొందరు భయంలో లేదా బాధలో ఉన్నప్పుడు బయటకు ఏం చెప్పలేని స్టేజ్​కి వెళ్లిపోతారు. అలా కాకుండా మనసులో బాధ లేదా భయం ఉన్నప్పుడు ఆ ఆలోచనల్ని అదుపు చేసుకోవాలి. అందుకు  పుస్తకాలు చదవాలి. మనసులో ఉన్న భావాల్ని, ఆలోచనల్ని డైరీలో రాసుకోవాలి. భయం, బాధ ఏదైనా సరే. ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు బాధ పడుతున్నాం? అనేది ఆలోచించుకోగలగాలి. అప్పుడే దాన్నుంచి బయటకు రావడం ఈజీ అవుతుంది. 

ఫ్యామిలీతో షేర్​ చేసుకోవాలి 

మీ మనసులో ఏమనిపిస్తుందో దాని గురించి ఇతరులతో మాట్లాడాలి. మొదటగా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. దేని గురించి భయం లేదా బాధ పడుతున్నారో దాని గురించి డిస్కస్ చేయాలి. మీ గురించి ఎవరు జాగ్రత్తలు తీసుకుంటారో, ఎవరు మీకు సపోర్ట్ చేస్తారో వాళ్లకు చెప్పుకోవాలి. 

పాజిటివ్​ ఆలోచన

ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్​ జరిగినప్పుడు మనసులో ‘ఇంకెంత నష్టం జరుగుతుందో?’ అనే ఆలోచనలు ముసురుతాయి. దాంతో భయాందోళన ఎక్కువవుతుంది. ఉదాహరణకు ఎగ్జామ్​ రాయాలి. ‘నాకేమీ రాదు. ఫెయిల్​ అయిపోతానేమో’ అనే భయం వల్ల వచ్చిన సమాధానాలు కూడా రాయలేరు కొన్నిసార్లు. అలా కంగారు పడకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే.. ‘నేను 50 శాతం చదువుకున్నా. అందులో ఎంతో కొంత ఎగ్జామ్ రాయగలుగుతా. కాబట్టి మార్కులు తగ్గుతాయి తప్ప, ఫెయిల్​ అవ్వను’ అనే ధైర్యం వస్తుంది. 
 

ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచమంతా భయపడే విషయం కరోనా. అది కూడా అంతే... అది వస్తుందంటే ‘చనిపోవడం ఖాయం’ అని భయపడతారు. కానీ, కుదురుగా కూర్చుని ఆలోచిస్తే.. కరోనా వచ్చినా భయం ఉండదు. దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే... రాకుండా తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో స్పష్టమవుతుంది.

అవగాహన అవసరం

పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్​ డిజార్డర్ నుంచి బయటపడాలంటే... ఆందోళనకు గురిచేసే అంశం గురించి వివరాలు తెలియాలి. ‘ఏం చేయాలి? ఏం చేయకూడదు’ అనే అవగాహన ఉండాలి. ప్రస్తుతం మరో కొత్త వేరియెంట్ వచ్చింది. ఇలాంటప్పుడు కరోనాకి సంబంధించిన వార్తలు చూసి భయపడిపోకుండా దాని గురించి వాస్తవాలు తెలుసుకోవాలి. 

ఆలోచనా శక్తి పెంచుకోవాలి

‘వాళ్లు ఇలా అనుకుంటారు. నేనెలా మాట్లాడాలి? ఎలా షేర్ చేసుకోవాలి? నన్ను ఏమనుకుంటారో?’ వంటి నెగెటివ్​ ఆలోచనలకు ఫుల్​స్టాప్​ పెట్టాలి. ‘నా గురించి ఎదుటివాళ్లు నెగెటివ్​గా ఆలోచిస్తారేమో’ అని మీరే నెగెటివ్​ థింకింగ్ చేస్తున్నారు. కాబట్టి అలా చేయకుండా ఎంతవరకు పాజిటివ్​గా ఆలోచించగలం? ఏ విషయాన్ని? ఎలా డీల్ చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. దానివల్ల ఒక విషయం గురించి ఆలోచించే శక్తి పెరుగుతుంది. 

ఆన్​లైన్​కి దూరంగా 

ఈ రోజుల్లో ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల నిద్ర సరిగా ఉండట్లేదు. రాత్రిళ్లు ఎక్కువసేపు బ్లూ లైట్​కి ఎక్స్​పోజ్ అవ్వడం, పొద్దున లేట్​గా లేచి, స్ట్రెస్​గా భావించడం. ఆ ఒత్తిడితోనే వాళ్ల డ్యూటీల​కి వెళ్లిపోవడం. దాంతో అక్కడ వర్క్ సరిగా చేయలేక, ఏకాగ్రత ఉండక చాలా ఇబ్బంది పడుతున్నారు. మన పనులు పూర్తి ఏకాగ్రతతో క్లారిటీగా చేయాలంటే మైండ్ ఫ్రెష్​గా ఉండాలి. అలా ఉండాలంటే సరిపడా నిద్ర అవసరం. సమయానికి నిద్రపోవాలి అంటే ఫోన్లు ఇతర ఆన్​లైన్ గాడ్జెట్లు పక్కన పెట్టాల్సిందే. 

పిల్లల్ని అర్థం చేసుకోవాలి

తల్లిదండ్రులు పిల్లలకు రోల్ మోడల్. వాళ్లని చూస్తూనే పెరుగుతారు. ఎప్పుడైనా వాళ్లని వాళ్లు ‘తిట్టుకోవడం లేదా ఏమీ రాదు, చేతకాదు’ అని అనుకున్నారు అనుకోండి. పెద్దవాళ్లు ఆ మాటలు సరదాగా చెప్పినా, పిల్లలు వాటిని సీరియస్​గా తీసుకుంటారు. వాళ్లు పెరిగేకొద్దీ ఆ ఆలోచన కూడా పెరుగుతుంది. మీలో వాళ్లను చూసుకుంటారు పిల్లలు. దాంతో వాళ్లకు అలాంటి సిచ్యుయేషన్​ ఏదైనా వచ్చినప్పుడు వాళ్లు కూడా పేరెంట్స్​లాగానే మాట్లాడతారు. కాబట్టి పిల్లలకు ‘ఏం నేర్పించాలి’ అనేది పేరెంట్స్​దే బాధ్యత.

భరోసా ఇవ్వాలి

పిల్లలకు చదువు విషయంలో ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. దానికితోడు పెద్దవాళ్లు, చుట్టుపక్కల ఉన్న సమాజం ‘టెన్త్ బాగా చదవాలి. తర్వాత ఇంటర్, ఎమ్​సెట్..’ ఇలా ఫుల్​ స్టాప్​ ఉండదు. వాళ్లకు స్ట్రెస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. దాంతో టార్గెట్​ని రీచ్ కాలేనప్పుడు ‘నాకేమీ రాదు కదా? నేనేం చేయలేను. పేరెంట్స్, టీచర్స్​ నన్ను ఏమంటారో? పేరెంట్స్ ఆశ తీర్చలేనేమో..’ వంటి ఆలోచనలు పిల్లలకు వస్తాయి. 

దాంతో కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అలాకాకుండా.. లైఫ్​లో ఏం జరిగినా సరే ‘నీకు తోడు నేనున్నా’ అనే భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులు సపోర్ట్​ చేస్తారని పిల్లలకి అనిపిస్తే వాళ్లపై ఒత్తిడి ఉండదు. ఇదంతా చదివాక హెల్త్ గురించి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మరి నిర్ణయం తీసుకుంటున్నారా? లేదా? హెల్త్​ అనేకాదు..​ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సక్సెస్ అయినట్టు. ఆ సక్సెస్​ రుచి చూసిన వాళ్లు దాన్ని ఎప్పటికీ వదలరు. కాబట్టి నిర్ణయం చిన్నదైనా, పెద్దదైనా దానిగురించి శ్రద్ధ తీసుకుంటే అనుకున్నది సాధిస్తారు. 
- మనీష పరిమి

పిల్లలకు అలవాటు చేయాలి

పిల్లలే రేపటి భవిష్యత్​. కాబట్టి భవిష్యత్​ తరానికి ఏం ఇస్తున్నాం? అని ప్రశ్నించు కుంటే డబ్బులు, ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అదెలాగంటే... ‘హెల్దీ ఫుడ్ తినాలి, ఎక్సర్​సైజ్​ చేయాలి’ అని పిల్లలకు చెప్తే సరిపోదు. మీరు చేస్తూ... వాళ్లతో చేయించాలి. వాళ్లకు ఒకసారి అలవాటు అయితే అది ఎప్పుడూ మర్చిపోరు. కాబట్టి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడం పెద్దల చేతిలోనే ఉంటుంది. 

చిన్నప్పటి నుంచే వాళ్లకు హెల్దీ హ్యాబిట్స్ నేర్పించాలి. పెద్దవాళ్లు సరైన దారిలో లేకపోతే పిల్లలకు అదే అలవాటు అవుతుంది. బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ ఇష్టపడేలా చేయాలి. డైలీ వాకింగ్, జాగింగ్ చేయించాలి. సూర్యరశ్మి తగిలేలా చూడాలి.   

అతి చేస్తే గతి తప్పుతుంది

ఎవరైనా ఫిట్​నెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా హార్ట్ రేట్​ని కాలిక్యులేట్ చేయాలి. దాన్ని బట్టి శ్వాస ఎలా తీసుకుం టున్నారనేది అర్థమవుతుంది. ఉదాహరణకు కొందరు మాట్లాడుతూనే కార్డియాక్ అరెస్ట్​ అయ్యి చనిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. ఫిట్​నెస్ ఎక్సర్​సైజ్​ చేస్తూ  మాట్లాడేటప్పుడు శ్వాసలో లేదా హార్ట్​ రేట్​లో ఏ ఇబ్బంది లేకపోతే నార్మల్​గా ఉన్నట్టు. 

కానీ,  మాట్లాడేటప్పుడు ఆయాస పడితే అది మోడరేట్ కండిషన్. అదే అసలు మాట్లాడలేక సైగలు చేసే స్థితికి చేరుకుంటే అది డేంజరస్. అంటే.. ఆ టైంలో హార్ట్ బీట్ కంట్రోల్​లో ఉండదు. వేగంగా కొట్టుకుంటుందని అర్థం. అలాంటప్పుడే కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంటుంది. 

మీకోసం మీరు టైం ఇవ్వాలి
 
అనుకున్నవన్నీ చేయాలంటే మీ కోసం మీరు కొంత టైం ఇచ్చుకోవాలి. కాసేపు మీ గురించి మీరు ఆలోచించు కోవాలి. ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? ఎందుకు ఇలా ఉన్నాం? బెటర్​గా ఎందుకు ఉండకూడదు? ఫ్యామిలీతో ఎందుకు స్పెండ్ చేయట్లేదు? రోజులో ఎంత టైం బిజీగా ఉంటున్నాం? ఖాళీ టైంలో ఏం చేస్తున్నాం? అని ఒక్కోటి ప్రశ్నించుకోవాలి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు  దొరికాక వాటికి అనుగుణంగా మారాలి. అందుకు మీకంటూ ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంలో మీకు నచ్చిన పని చేయాలి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. 

ఆచరణలో పెట్టడం ముఖ్యం

‘అబ్బా ఈ ఏడాది కరోనాతోనే మొదలవుతుంద’ని భయపడొద్దు. బాధపడొద్దు. వాట్సాప్​ల్లో, సోషల్​ మీడియాలో వచ్చే వార్తలు ఏవి పడితే అవి నమ్మొద్దు. గవర్నమెంట్​ లేదా సైన్స్ వెబ్​సైట్స్​లో వచ్చే వార్తలను మాత్రమే పట్టించుకోవాలి. అంతేకానీ, ప్రతీది నమ్మి భయపడిపోకూడదు. రోజూ మెడిటేషన్ చేయాలి. వాకింగ్ చేయాలి. మీకు సపోర్ట్ చేసేవాళ్లతో మీ ఆలోచనల్ని చెప్పుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. శారీరక వ్యాయామం అనేది కచ్చితంగా చేయాలి. ఇలా ఉండడం వల్ల ఆటోమెటిక్​గా మూడ్ బెటర్​ అవుతుంది. ఇవన్నీ తెలిసినవే... కానీ పాటించడంలోనే లోపం ఉంది. కాబట్టి కొత్త ఏడాదిలో ఇవన్నీ ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. 

వైరస్ భయం వద్దు

నిజానికి ఏదైనా జరగబోతోంది అన్నప్పుడు యాంగ్జయిటీ, స్ట్రెస్ అనేవి కామన్​. కానీ, అలానే ఉండిపోయి మనల్ని మనం కట్టిపడేసుకోవడం కరెక్ట్ కాదు. అలా చేస్తున్నారంటే అది మానసికారోగ్య సమస్యగా చూడాలి. ఉదాహరణకు కరోనా అనేది ఒక్కసారిగా అటాక్​ చేసేసరికి జనాలకు భయం వేసింది. దాంతో అది ఎన్నిసార్లు వచ్చినా మొదటిసారి ఎలాగైతే రియాక్ట్ అయ్యారో అలానే రియాక్ట్ అవుతున్నారు. 

దీన్ని ‘అన్​ ప్రెసిడెంటెడ్​ కండిషన్’ అంటారు. అయితే, గతంలో ఆ సిచ్యుయేషన్​లో ఎవరికైనా ఏమైనా అవుతుందా? నాకేమైనా అవుతుందా? ఏం చేయాలి? ఎలా ట్రీట్​మెంట్ తీసుకోవాలి? అనే కన్ఫ్యూజన్​ చాలా ఉంది. ఆ భయం కాస్త ట్రామాలాగ మైండ్​లో ఉండిపోయింది. దీంతో మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్​ వస్తుందంటే కూడా అలానే రియాక్ట్ అవుతున్నారు. ఈ స్థితికి మరో పేరు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్​ డిజార్డర్​ (పీటీఎస్​డీ)​. ఎప్పుడో ఒకసారి ఏదో జరిగిపోయింది. మళ్లీ అలాగే జరగబోతోంది అన్నప్పుడు కనిపించే సేమ్​ రియాక్షన్ ఇది.