ఈ కాలంలో ఎండకు పెద్దపెద్ద వాళ్లే అల్లాడిపోతున్నారు. అలాంటిది పసి పిల్లల సంగతేంటి?.. ఒకవైపు వేడి, మరోవైపు ఉక్కపోత... వాటివల్ల పిల్లలకు చాలారకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో పసి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
• ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. వచ్చే తాజా గాలి ఇంటిని చల్లబరుస్తుంది. వేడిగాలులు బాగా వీస్తున్నట్లైతే తలుపులను మూసేయాలి. అప్పుడు ఏ గదిలో అయితే చల్లగా ఉంటుందో, పిల్లలను తీసుకుని అందులో ఉండాలి. కరెంటు లేనప్పుడు ఫ్యాన్ గాలి అందక పిల్లలు బాగా అల్లాడిపోతుంటే.. ఇన్వర్టర్లు, జనరేటర్లు వంటివి తెచ్చిపెట్టాలి.
• పగటిపూట పిల్లలను మంచం మీద కాకుండా, నేల మీద పలుచగా ఉండే బొంత వేసి పడుకోబెట్టాలి. అంతేకానీ కింద మందంగా ఉండే దుప్పట్లు, బొంతలు వేయొద్దు.
• ఈ కాలంలో పిల్లలకు మెత్తగా, చల్లగా ఉండే కాటన్ దుస్తులనే వేయాలి. సింథటిక్ బట్టలు వేస్తే అవి శరీరంలో వేడి పుట్టిస్తాయి. దాంతో బిడ్డకి అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు వీటివల్ల చెమట పొక్కులు వచ్చే అవకాశం ఉంది.
• ఒకవేళ పిల్లలను ఎండలో బయటికి తీసుకెళ్లాల్సి వస్తే... పొడవాటి చేతులు ఉండి. మెత్తటి దుస్తులనే వేయాలి. కచ్చితంగా గొడుగు తీసుకెళ్లాలి. ఆ పిల్లలను ఎండ నుంచి కాపాడేందుకు వెడల్పాటి టోపీలను తలకు పెట్టాలి, ఎలాస్టిక్ టోపీలు వాడొద్దు. వాటివల్ల రక్తప్రసరణ సరిగా జరగదు.
• ఉదయం తొమ్మిది, పది నుంచి సాయంత్రం ఐదు, ఆరు గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటుంది. అందుకే పిల్లల్ని ఆ సమయంలో ఎండలోకి తీసుకెళ్లకపోవడం ఉత్తమం.
• పిల్లలకు నూలు న్యాపీలు వాడాలి. అవి వేడిని కలిగించవు, అంతేకాదు, వాటివల్ల పిల్లలకు ర్యాషెస్ కూడా కావు. అదే వాడి పారేసే డిస్పోజబుల్ న్యాపీలైతే వేడిగా ఉంటాయి. వీటిలో ఉండే సింథటిక్ బ్యాండ్ వల్ల చెమట పట్టి ప్రదేశాల్లో వేడి పొక్కులు ఏర్పడే అవకాశం ఉంది.